Share News

Vijayawada Airport: విమానయానం రయ్‌ రయ్‌

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:04 AM

విజయవాడ ఎయిర్‌పోర్టు ఏపీలో అత్యధిక 40 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. రాజమండ్రి, తిరుపతి, విశాఖ వంటి విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.

Vijayawada Airport: విమానయానం రయ్‌ రయ్‌

  • ఏపీలో ఊపందుకున్న విమాన ప్రయాణం

  • వృద్ధిలో అగ్రపథాన విజయవాడ ఎయిర్‌పోర్టు

  • ఏడాదిలో ఇక్కడి నుంచి 13.8 లక్షల మంది రాకపోకలు

  • 40% వృద్ధి నమోదు.. తర్వాతి స్థానాల్లో రాజమండ్రి, తిరుపతి

  • రాజమండ్రిలో 15.1, తిరుపతిలో 14.4, విశాఖలో 6% వృద్ధి

  • కర్నూలు, కడప విమానాశ్రయాల్లో తగ్గిన ప్రయాణికులు

విజయవాడ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విమానయానం ఊపందుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం 40 శాతం భారీ వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా... రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రయాణికుల సంఖ్యపరంగా చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో విశాఖ విమానాశ్రయం నుంచి 29,55,089 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ సంఖ్య పెద్దగానే ఉన్నప్పటికీ వృద్ధిలో మాత్రం గతేడాదితో పోలిస్తే 6 శాతమే పురోగతి కనిపించింది. ఇక విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంఏపీలోనే టాప్‌లో నిలిచింది. ఐదేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడ విమానాశ్రయానికి పునర్వైభవం వచ్చినట్టయింది. 2017-18లో సాధించిన పది లక్షల (మిలియన్‌) ప్రయాణికుల మార్కుని మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 2024-25లో అందుకుంది. ఈ ఏడాది ఇక్కడి నుంచి అత్యధికంగా 13,88,943 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో ఇక్కడ రికార్డు స్థాయిలో 40 శాతం వృద్ధి నమోదైనట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఆక్యుపెన్సీ 90శాతం పైగా ఉండటమే వృద్ధికి కారణమని తెలుస్తోంది. దీన్నిబట్టి విజయవాడ నుంచి మరిన్ని విమానాలకు డిమాండ్‌ ఉందని స్పష్టమవుతోంది.


అంతర్జాతీయ సర్వీసులకూ డిమాండ్‌

విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులకు కూడా డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం షార్జాకు మాత్రమే వారంలో రెండు రోజుల పాటు సర్వీసులు నడుస్తున్నాయి. దుబాయ్‌, సింగపూర్‌, మలేసియా, శ్రీలంక దేశాలకు అత్యవసరంగా డిమాండ్‌ ఉంది. దేశీయంగా చూస్తే కేరళ, కోల్‌కతా, వారాణసీ, గుజరాత్‌ వంటి ప్రాంతాలకూ డిమాండ్‌ ఉంది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాలకు కూడా సర్వీసులు ఏర్పాటు చేస్తే విజయవాడ ఎయిర్‌పోర్టు మరింత వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పది నెలల్లోనే విజయవాడ నుంచి కొత్తగా 7 విమానాలు పెరిగాయి. ముంబైకి 2, ఢిల్లీకి అదనంగా ఒకటి, బెంగళూరు, విశాఖకు రెండేసి చొప్పున పెరిగాయి. అమరావతి పునర్నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం వల్ల కూడా రాకపోకల్లో పురోగతి కనిపించింది. మరోవైపు రాజమండ్రి విమానాశ్రయం కూడా అనూహ్య వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాదిలో రాజమండ్రి నుంచి 4,89,114 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడంతో ఇక్కడ 15.1 శాతం వృద్ధి నమోదైంది. తిరుపతి విమానాశ్రయం (14.4 శాతం వృద్ధి) నుంచి 9,95,640 మంది రాకపోకలు సాగించారు. కాగా.. కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల పరిస్థితి మాత్రం దిగజారింది. కడప విమానాశ్రయం నుంచి 52,745 ప్రయాణీకులు రాకపోకలు సాగించినా వృద్ధి -19.5 శాతంగా, కర్నూలు నుంచి 19,427 మంది రాకపోకలు సాగించగా.. వృద్ధి -51.1 శాతంగా నమోదైంది.

Updated Date - Apr 30 , 2025 | 05:06 AM