APSRTC : ఆర్టీసీకి ‘పండగే’!
ABN , Publish Date - Jan 22 , 2025 | 04:47 AM
‘మీ సేవల్లో నాణ్యత ఉంటే ఆదరించేందుకు మేం సిద్ధం’ అంటూ ఆర్టీసీకి ప్రయాణికులు గట్టి సంకేతం ఇచ్చారు.

20వ తేదీ రికార్డు స్థాయిలో 23 కోట్ల ఆర్జన
ఇందులో ప్రత్యేక బస్సుల ఆదాయం 21 కోట్లు
విడిరోజుల్లో ఏనాడూ 17కోట్లు దాటని వైనం
పండగ రోజుల్లో రూ.20 కోట్లు వస్తే గొప్ప
సంక్రాంతికి వచ్చి తిరిగి వెళ్లే వారి కోసం అదనంగా రెండు వేల బస్సులు తిప్పిన ఆర్టీసీ
ఈ ఆదరణ మరవలేం: ద్వారకా తిరుమలరావు
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ‘మీ సేవల్లో నాణ్యత ఉంటే ఆదరించేందుకు మేం సిద్ధం’ అంటూ ఆర్టీసీకి ప్రయాణికులు గట్టి సంకేతం ఇచ్చారు. పెద్ద పండగ సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి చరిత్రలో సంస్థ చూడనంత ఆదాయాన్ని ఒకేరోజు అందించారు. అయితే పండగకు వచ్చే ప్రయాణికుల్ని బస్టాండ్లలో పడిగాపులు కాయించిన ఆర్టీసీ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు మందలించడంతో మేల్కొని తిరుగు ప్రయాణాలకు సరిపడా బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ నెల 20న సొంతూళ్ల నుంచి తిరిగి వెళ్లే ప్రయాణికుల నుంచి ఆర్టీసీకి ఏకంగా రూ.23.71కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే పండగ సీజన్లో మూడు సార్లు 20కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ దాటింది. ఆర్టీసీ అంటే ఒకప్పుడు ఆసియా దేశాల్లోనే అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ.
ప్రతి పల్లెకు ప్రయాణ సేవలందిస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకమైన ఆర్టీసీ క్రమక్రమంగా ఆక్యుపెన్సీ కోల్పోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయకుండా డొక్కు బస్సులతో గోతులమయమైన రోడ్లతో ప్రయాణికులను ఆర్టీసీ భయపెట్టింది. దీనికితోడు మూడుసార్లు ప్రయాణికులపై మోయలేని భారం మోపి అంతకు ముందున్న ధరలకు దాదాపు రెట్టింపు చేసింది. సిబ్బంది విలీనంతో ప్రయాణ సేవల్లోనూ నాణ్యత తగ్గడం, ఎండీ సహా ఇంచార్జిలుగా ఉన్న కీలక అధికారులు కనీస సమీక్ష చేయకపోవడంతో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కొత్త బస్సులు కొనుగోలు మొదలు పెట్టిన ఆర్టీసీ ... గడిచిన ఆర్నెలల్లో సుమారు 600 బస్సులు సమకూర్చుకుంది. ఇది గమనించిన ప్రయాణికులు ఆర్టీసీ వైపు చూడటం మొదలుపెట్టారు.
ముఖ్యమంత్రి సూచనలతో
ఏటా సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసే ఆర్టీసీ ఎండీతో ప్రెస్ మీట్ పెట్టించి తమ సేవలు వినియోగించుకోవాలంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసేది. ఈ ఏడాది మాత్రం ఒక ప్రకటన చేసి ఊరుకున్నారు. తగినన్ని బస్సులు కూడా ఏర్పాటు చేయలేదు. పాత ఆలోచనాధోరణి మారని కొందరు ఆర్టీసీ ఉన్నతాధికారుల తీరుతోనే సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. పండగ పూట ప్రయాణికులు విజయవాడ, గుంటూరు, ఏలూ రు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో బస్టాండ్లలో బస్సు ల కోసం పడిగాపులు కాశారు. టీవీల్లో ప్రయాణికుల కష్టాలు చూసిన సీఎం చంద్రబాబు....ఆర్టీసీ అధికారులను గట్టిగా మందలించారు. దీంతో అప్పటికప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు సమీకరించుకుని పడిగాపుల ప్రయాణీకుల్ని గమ్యం చేర్చారు. ఈ అనుభవంతో తిరుగు ప్రయాణంలో రెండు వేల బస్సులు అదనంగా ఏర్పాటు చేసి తిరుగు ప్రయాణాల్లో ఇబ్బందుల్లేకుండా జాగ్రత్త పడ్డారు. సంక్రాంతికి వచ్చే వారి కోసం 3,900, తిరుగు ప్రయాణికులకు 3,300 బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ....పండగ రోజు అనుభవంతో మేల్కొని రెండు వేల బస్సులు అదనంగా ఏర్పాటు చేసింది. ప్రయాణ చార్జీలు కూడా సాధారణ ధరల్లోనే ఉండటంతో ఆర్టీసీ చరిత్రలోనే చూడనంత ఆదాయాన్ని అందించి ప్రయాణికులు తమ ఆదరణ చూపించారు. ఈ విషయమై ఆర్టీసీ ఇంచార్జి ఎండీ ద్వారకా తిరుమల రావు స్పందిస్తూ.. ప్రత్యేక సర్వీసుల పట్ల ప్రయాణికుల ఆదరణ ఎప్పటికీ మరువలేమని, చరిత్రలో చూడనంత ఆదాయం ఒక్కరోజు రావడానికి కారణం డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్లేనని వ్యాఖ్యానించారు. రెగ్యులర్ సర్వీసులు కాకుండా పండగ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా రూ.21.11కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News