Share News

APSRTC : విద్యుత్‌ బస్సులు అద్దె ప్రాతిపదికన వద్దు!

ABN , Publish Date - Jan 28 , 2025 | 05:22 AM

ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సైతం వెనుకాడకపోవటంతో ఏపీలో కూడా దీనిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అప్రమత్తమయ్యాయి.

APSRTC : విద్యుత్‌ బస్సులు అద్దె ప్రాతిపదికన వద్దు!

  • గత ప్రభుత్వంలో 35 శాతానికి చేరిన అద్దె బస్సులు

  • ఈ విధానం కొనసాగితే.. ప్రైవేటు చేతుల్లోకి ఆర్టీసీ

  • వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు.. విస్తృత చర్చలు

విజయవాడ జనవరి 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విద్యుత్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునే అంశంపై అక్కడి ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సైతం వెనుకాడకపోవటంతో ఏపీలో కూడా దీనిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఇప్పటికిప్పుడు ఆందోళనబాట పట్టే ఆలోచన లేనప్పటికీ, విద్యుత్‌ బస్సుల విధానంపై అధ్యయనం చేస్తున్నాయి. ఆర్టీసీ గుర్తింపు సంఘాలైన ఈయూ, ఎన్‌ఎంయూల నాయకత్వాలు ఇటీవల విజయవాడలో వేర్వేరుగా ముఖ్య నేతలతో భేటీయైు విస్తృతంగా చర్చించాయి. ఆర్టీసీ సొంతంగా బస్సులు కొనాల్సింది పోయి.. అద్దె ప్రాతిపదికన తీసుకుంటోందని.. వైసీపీ ప్రభుత్వంలోని విధానం ఇప్పటికీ కొనసాగుతోందని నేతలు పేర్కొన్నాయి. ఆర్టీసీలో 10 శాతం మించి అద్దె బస్సులు ఉండకూడదని గతంలో ఒప్పందం జరిగిందని, అయితే గత ప్రభుత్వ హయాంలో అది ఏకంగా 35 శాతానికి చేరుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యు్‌ బస్సులను కూడా అద్దె ప్రాతిపదికన తీసుకుంటే.. అద్దె బస్సుల ఆక్యుపెన్సీ 50 శాతం దాటిపోతుందని, అప్పుడు ఆర్టీసీ ప్రైవేటు గుప్పెట్లోకి వెళ్లిపోతుందని సంఘాలు అందోళన వ్యక్తం చేశాయి. ఈ రెండు సంఘాల కంటే ముందు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ విద్యుత్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవద్దని గత రెండు నెలలుగా డిమాండ్‌ చేస్తోంది. నగరంలో పలు చర్చా వేదికలు కూడా నిర్వహించింది.

Updated Date - Jan 28 , 2025 | 05:22 AM