Share News

Somi Reddy: లిక్కర్‌ స్కాం 10 వేల కోట్లపైనే

ABN , Publish Date - Apr 27 , 2025 | 02:26 AM

ఏపీలో లిక్కర్ స్కాం రూ.10 వేల కోట్లకు మించిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు.మద్యం వ్యాపారంలో భారీ నగదు లావాదేవీలు జరగాయని, ఈడీ, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Somi Reddy: లిక్కర్‌ స్కాం 10 వేల కోట్లపైనే

  • ఐదేళ్లలో 1.30 లక్షల కోట్ల నగదు లావాదేవీలు

  • సిట్‌తోపాటు ఈడీ, సీబీఐ విచారణ జరగాలి: సోమిరెడ్డి

అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ‘ఏపీలో లిక్కర్‌ స్కాం అంతర్జాతీయ స్థాయి కుంభకోణం. ఇది రూ.3,200 కోట్లకు పరిమితం కాదు. రూ.10 వేల కోట్లుపైనే స్కాం జరిగింది’ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ పాలన ఐదేళ్లలో మద్యం అమ్మకాల్లో రూ.1.30 లక్షల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి. ఓ వైపు ప్రధాని మోదీ డిజిటల్‌ ఇండియా అంటుంటే జగన్‌రెడ్డి మాత్రం తన దందా కోసం రాష్ట్రాన్ని క్యాష్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. దోపిడీ కోసమే మద్యం వ్యాపారంలో డిజిటల్‌ పేమెంట్లను అనుమతించలేదు. ప్రస్తుతం విచారణ సాగిస్తున్న సిట్‌తోపాటు ఈ అక్రమ నగదు లావాదేవీల గుట్టురట్టు చేయడానికి ఈడీ, సీబీఐ కూడా విచారణ చేపట్టాలి.


రూ.1.30 లక్షల కోట్ల క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ జరుగుతుంటే గత ఐదేళ్లు ఈడీ, సీబీఐ ఈ కుంభకోణంపై ఎందుకు దృష్టి సారించలేదు? జగన్‌రెడ్డి పర్యవేక్షణలో నడిచిన కసిరెడ్డి అండ్‌ టీం ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంటు పర్యవేక్షణలోని మద్యం డిపోలకు వెళ్లకుండా, డిస్టిలరీ నుంచి నేరుగా దుకాణాలకు స్టాక్‌ తరలించి అక్రమంగా అమ్మేసుకుంది. ఈ విషయాన్ని మరింత లోతుగా విచారిస్తే సుమారు రూ.10 వేల కోట్ల కుంభకోణం గుట్టు రట్టవుతుంది. ఎస్పీవై ఇండస్ట్రీని మిథున్‌రెడ్డి లాగేసుకున్నారని సాక్షాత్తు సజ్జల శ్రీధర్‌రెడ్డి నాకు చెప్పారు’ అని సోమిరెడ్డి తెలిపారు.

Updated Date - Apr 27 , 2025 | 02:28 AM