Advocate General Dammalapati Srinivas : ‘పేర్ని’ ఖాతాకే బియ్యం సొమ్ములు
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:35 AM
గోదాములో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మాయం చేయడంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలకపాత్ర పోషించారని, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.

బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం: అడ్వకేట్ జనరల్
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): గోదాములో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మాయం చేయడంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలకపాత్ర పోషించారని, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. గోడౌన్ మేనేజర్, కేసులో రెండో నిందితుడైన మానస తేజ బ్యాంకు ఖాతా నుంచి పేర్ని నాని బ్యాంకు ఖాతాకు బదిలీ అయిన విషయం దర్యాప్తులో తేలిందన్నారు. రేషన్ బియ్యా న్ని అక్రమంగా విక్రయించింది ఎన్నికల సమయంలోనేనని పేర్కొన్నారు. నాని గతంలో మంత్రిగా పనిచేశారని బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి నానీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ జరుపుతామని తెలిపారు. అప్పటివరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించారు. పేర్నినాని సతీమణి జయసుధ మచిలీపట్నంలోని తన గోడౌన్‌ను పౌరసరఫరాల శాఖకు లీజుకిచ్చారు. దీనిలో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయం అయ్యాయంటూ చింతం కోటిరెడ్డి ఫిర్యాదు చేశారు.