Green Tax: లారీలపై జగన్ గ్రీన్ బాదుడు భారీగా తగ్గింపు
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:26 AM
గ్రీన్ ట్యాక్స్ పేరుతో జగన్ ప్రభుత్వం లారీ యజమానులపై వేసిన భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం తగ్గించింది..

ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ హర్షం
అమరావతి, విజయవాడ, జూలై 16(ఆంధ్రజ్యోతి): గ్రీన్ ట్యాక్స్ పేరుతో జగన్ ప్రభుత్వం లారీ యజమానులపై వేసిన భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం తగ్గించింది. వైసీపీ ప్రభుత్వం పర్యావరణం పేరుతో 12 సంవత్సరాలు దాటిన రవాణా వాహనాలపై పన్ను భారీగా విధించింది. పది టన్నుల లారీలపై రూ.5,000, 30 టన్నుల లారీలపై 15 వేలు విధించడంతో లారీ యజమానులు గగ్గోలు పెట్టారు. తాము అధికారంలోకి వస్తే ఆ ట్యాక్స్‌ను భారీగా తగ్గిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినర తర్వాత లారీ యజమానుల సంఘం చంద్రబాబుకు సమస్య విన్నవించింది. దీంతో రూ.5 వేల భారాన్ని రూ.1,500కు, రూ.15 వేల భారాన్ని రూ.మూడు వేలకు తగ్గిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దీనిపై ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. బుధవారం సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన సీఎంకు, రవాణా మంత్రికి... రవాణా వాహనాల యాజమాన్యం రుణపడి ఉంటుందని అన్నారు.