AP Government : రైతుల ‘బకాయిలు’ క్లియర్
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:48 AM
రైతులకు రూ.కోట్లలో బకాయి పెట్టిన సొమ్మును కూటమి ప్రభుత్వం చెల్లించింది. 2023-24లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.1,674.47 కోట్లు అప్పటి ప్రభుత్వం...

2023-24 ధాన్యం కొనుగోళ్ల అప్పు 1,674.47 కోట్లు చెల్లించిన ప్రభుత్వం
వైసీపీ వదిలేసిన భూసార పరీక్షలపైనా దృష్టి
రాయితీపై సూక్ష్మ పోషకాల పంపిణీ పునరుద్ధరణ
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం వివిధ పథకాల కింద రైతులకు రూ.కోట్లలో బకాయి పెట్టిన సొమ్మును కూటమి ప్రభుత్వం చెల్లించింది. 2023-24లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.1,674.47 కోట్లు అప్పటి ప్రభుత్వం బకాయి పెడితే ఈ మొత్తాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు చెల్లించింది. గత ఐదేళ్లలో మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,166.99 కోట్లలో రూ.452.55 కోట్లు ఈ ఏడాది విడుదల చేశారు. విత్తన రాయితీ రూ.120 కోట్లను ఈ ప్రభుత్వం ఇచ్చింది. 2024 మేలో వడగండ్ల వాన, అధిక వర్షాలకు ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు రూ.4.31 కోట్లను ఈ ఏడాది జనవరిలో విడుదల చేశారు. పామాయిల్ రైతులకు, కంపెనీలకు చెల్లించాల్సిన బకాయులు రూ.238.90 కోట్లలో రూ.29.42 కోట్లు విడుదల చేయగా, ఎంఐడీహెచ్ పథకంలో చెల్లించాల్సిన రూ.93.54 కోట్లలో రూ.33.33 కోట్లు విడుదల చేసింది. విత్తన రాయితీకి సంబంధించి, ఇంకో రూ.100 కోట్లు త్వరలో చెల్లించనున్నట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. కాగా 2024-25లో పశువులను కోల్పోయిన రైతులకు నష్టపరిహారంగా రూ.119 కోట్లు పాత బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లించింది.
పీఎంఎంఎ్‌సవై కింద 2025-26 బడ్జెట్‌లో రూ.417 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో భూసార పరీక్షలను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కూటమి ప్రభుత్వం 2024-25లో ‘సాయిల్ హెల్త్, ఫెర్టిలిటీ’ పథకం కింద రూ.13.09 కోట్లతో 4.30 లక్షల భూసార పరీక్షా పత్రాలు రైతులకు అందించింది. 2025-26లో 6 లక్షల భూసార పరీక్షా పత్రాలు రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం 3 లక్షల టన్నుల సూక్ష్మ పోషకాలను రైతులకు రాయితీపై ఇవ్వగా, 2019-24 మధ్య వైసీపీ సర్కార్ సూక్ష్మ పోషకాల పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. 2025-26లో 5.98 లక్షల హెక్టార్ల రైతులకు రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.