Share News

Peddireddy: పెద్దిరెడ్డిపై చర్యలకు సర్కార్ సిద్ధం.. విచారణకు ఆదేశించిన ఏపీ సీఎం..

ABN , Publish Date - Jan 29 , 2025 | 08:33 PM

చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై నిగ్గు తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ భూముల భక్షణపై పూర్తి స్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటైంది.

Peddireddy: పెద్దిరెడ్డిపై చర్యలకు సర్కార్ సిద్ధం.. విచారణకు ఆదేశించిన ఏపీ సీఎం..
Former Minister Peddireddy Ramachandra Reddy

చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అటవీ భూముల ఆక్రమణపై నిగ్గు తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) సిద్ధమైంది. అటవీ భూముల భక్షణపై పూర్తి స్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటైంది. ఈ జాయింట్ కమిటీలో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జెర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారులు సభ్యులుగా ఉంటారు. ముగ్గురు సభ్యులతో కమిటీ ను ఏర్పాటు చేస్తూ కొద్దిసేపటి క్రితం ఏపీ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు.


ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జాయింట్ కమిటీలో సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మనికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోద బాయ్ ఉంటారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరడంపై ఇప్పటికే ప్రాధమిక నివేదిక ముఖ్యమంత్రికి చేరింది. ఈరోజు సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ప్రభుత్వం ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూములు తీసుకోవాలన్నా ఎన్నో అనుమతులు కావాలి. కానీ ఎకరాలకొద్దీ భూములను పెద్ది రెడ్డి కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందులో విలాసవంతమైన భవనంతో పాటు వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతే కాదు అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డును కూడా వేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దర్యాఫ్తునకు ఆదేశించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 29 , 2025 | 09:20 PM