Minister Gottipati Ravikumar : వేసవి రాకకు ముందే పెరిగిన విద్యుత్తు డిమాండ్
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:07 AM
కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు.

రాత్రి పూట 5 నుంచి 10 శాతం దాకా ఆదుకోవాలని కేంద్రానికి రాష్ట్రం వినతి
రాయలసీమకు గ్రీన్‌కారిడార్ కావాలి
ఆముదాలవలసలో 3,200 మెగావాట్ల థర్మల్ ప్లాంటును ఆమోదించండి
పీఎం కుసుమ్ కింద మరో 3 లక్షల కనెక్షన్లు మంజూరు చేయండి: గొట్టిపాటి
కేంద్ర మంత్రితో వీడియో కాన్ఫరెన్స్
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఇంకా వేసవి కాలం రాకముందే రాష్ట్రంలో రాత్రి వేళ విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతోంది. పగటిపూట విద్యుత్తు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదని, రాత్రివేళ సరిపడా అందుబాటులో లేదని, ఆదుకోవాలని కేంద్రానికి రాష్ట్రం విన్నవించింది. కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ‘పునరుత్పాదక విద్యుదుత్పత్తితో పగటిపూట సరఫరాను నిరంతరాయంగా చేస్తున్నాం. కానీ రాత్రి పూట విద్యుత్తు డిమాండ్ ఐదు నుంచి పది శాతం దాకా పెరుగుతోంది. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా సంప్రదాయ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో థర్మల్, జల విద్యుత్తు ఉత్పత్తి కావడం లేదు. దీంతో రాత్రిపూట అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ భారం డిస్కమ్‌లపై పడుతోంది. రాత్రి సమయంలో విద్యుత్తు డిమాండ్‌ను తట్టుకోవాలంటే సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తికి సమాంతరంగా సంప్రదాయ విద్యుదుత్పత్తిని కూడా పెంచాల్సి ఉంది. ఆముదాలవలసలో స్థాపించదలచిన 3200 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రం ప్రతిపాదనలను ఆమోదించండి’ అని రవికుమార్ కోరారు.
రాష్ట్ర ప్రతిపాదనలు ఇవీ..
రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీని సరఫరా చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేయాలి.
సౌర, పవన విద్యుత్తు స్టోరేజీని 2000 మెగావాట్లకు పెంచాలి. పీఎం కుసుమ్ కింద మరో 3 లక్షల మంది రైతులకు లబ్ధికూర్చేలా కనెక్షన్లకు ఆమోదం తెలపాలి.
రాష్ట్రాల పర్యటనకు కేంద్ర మంత్రి
రాష్ట్రాల విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోవడంపై కేంద్రం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్రాల విద్యుత్తు శాఖా మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరుత్పాదక విద్యుత్కేంద్రాలకు సహాయం అందిస్తున్నందున కరెంటు సరఫరాలో రాష్ట్రాలు స్థిమితంగా ఉన్నాయని భావిస్తున్న కేంద్రానికి.. డిస్కమ్‌ల స్థితిగతులు చూశాక పరిస్థితి అర్థమైంది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ల సమీక్షలతో సరిపెట్టకుండా తరచూ రాష్ట్రాల పర్యటనకు వెళ్లి విద్యుత్తు రంగ స్థితిగతులపై స్వయంగా పరిశీలన చేయాలని కేంద్ర మంత్రి నిర్ణయించారు.
For AndhraPradesh News And Telugu News