Ombudsman Issue: ఉపాధిలో అంబుడ్స్‌మెన్ ఉన్నట్టా? లేనట్టా?
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:26 AM
ఉపాధి హామీ పథకంలోని అంబుడ్స్‌మెన్ వ్యవస్థ రాష్ట్రంలో నిర్వీర్యమైన దశలో ఉంది. 8 జిల్లాల్లో పదవీకాలం ముగిసినప్పటికీ అధికారులు రీన్యువల్ చేయకపోవడంతో సందిగ్ధత నెలకొంది

జిల్లాల్లో రెన్యువల్ నిలిపివేత..
అమరావతి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో అవినీతిని నియంత్రించేందుకు ప్రధానంగా పనిచేసే అంబుడ్స్‌మెన్ వ్యవస్థ రాష్ట్రంలో ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి పథకం సజావుగా సాగేందుకు విజిలెన్స్, సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్, అంబుడ్స్‌మెన్ వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ పథకం చట్టం పేర్కొంటోంది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఈ వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సోషల్ ఆడిట్ డైరెక్టర్‌గా శ్రీకాంత్‌ను, చీఫ్ విజిలెన్స్ అధికారిగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి భవానీ హర్షను, చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారిగా రిటైర్డ్ ఇంజనీర్ గోపీచంద్‌ను నియమించింది. అయితే అంబుడ్స్‌మెన్ వ్యవస్థను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు మరిచిపోయారు. గత ప్రభుత్వంలో 13 ఉమ్మడి జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఒక్కో అంబుడ్స్‌మెన్‌ను నియమించారు. సాధారణంగా అంబుడ్స్‌మెన్‌లను రెండేళ్ల పాటు విధుల్లో కొనసాగిస్తారు. అవసరమైతే మరో రెండేళ్లు కొనసాగిస్తారు. రాష్ట్రంలో 8 జిల్లాల అంబుడ్స్‌మెన్‌లకు పదవీకాలం గత ఏడాది జూన్ 30తో ముగిసింది. వారిని తిరిగి కొనసాగించాలంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వారికి రెన్యువల్ ఇవ్వాలి. 9 నెలలవుతున్నా రెన్యువల్ చేయలేదు. తొలగించనూలేదు. దీంతో వారు విధుల్లో ఉన్నారా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. కానీ మొత్తం 13 జిల్లాల్లో అంబుడ్స్‌మెన్‌లు మాత్రం విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం తమను కొనసాగిస్తుందో?, లేదో తమకే తెలియదని వారు పేర్కొంటున్నారు.