Share News

Cabinet Withdraws: రాష్ట్రపతి వద్ద ఉన్న 3 బిల్లులు ఉపసంహరణ

ABN , Publish Date - May 09 , 2025 | 04:49 AM

గత ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన మూడు కీలక బిల్లులను రాష్ట్ర మంత్రివర్గం ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. వాటి సవరణలు కేంద్ర నిబంధనలకు అనుగుణంగా పంపబడతాయి

Cabinet Withdraws: రాష్ట్రపతి వద్ద ఉన్న 3 బిల్లులు ఉపసంహరణ

  • రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపులు

  • భీమిలిలో బీచ్‌ రిసార్ట్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం టూరిజం

  • అథారిటీకి 18.70 ఎకరాలు బదిలీ

అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన మూడు బిల్లులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పారిశ్రామిక వివాదాల సవరణ బిల్లు-2019, కార్మిక చట్టాల సవరణ బిల్లు-2019, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు-2019ను ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనలను ఆమోదించింది. వీటిని మళ్లీ కేంద్ర చట్టాల నిబంధనలకు అనుగుణంగా సవరించి కేంద్రానికి పంపనుంది. గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకం అమలుకోసం జలహారతి కార్పొరేషన్‌ పేరిట స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తూ గత నెలలో జారీచేసిన జీవో 16లో సవరణలకు కూడా ఆమోదదముద్ర వేసింది. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు తెలియజేశారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందజేసే సాయాన్ని రూ.10 వేల నుంచి 20వేలకు పెంచుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.258.35 కోట్ల మేర లబ్ధి చేకూర్చే విధంగా జారీచేసిన జీవోను మంత్రిమండలి ఆమోదించిందని చెప్పారు. ఈ పథకం పేరును ‘మెరైన్‌ ఫిషింగ్‌ బ్యాన్‌ రిలీఫ్‌’గా పునరుద్ధరించే ప్రతిపాదనను కూడా అంగీకరించిందన్నారు.


మరిన్ని నిర్ణయాలివీ..

  • విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం, అన్నవరం గ్రామంలో 18.70 ఎకరాల ప్రభుత్వ భూమిని బీచ్‌ రిసార్ట్‌, కన్వెన్షన్‌ సెంట ర్‌ నిర్మాణం కోసం ఏపీ టూరిజం అథారిటీకి బదిలీకి ఆమోదం.

  • పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం చిత్తూరు జిల్లా కుప్పం మండలం పాలర్లపల్లె గ్రామ సర్వే నంబర్‌ 221లో 18.70 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయింపు.

  • అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ద్వారా 1,000 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు స్థాపించడానికి కడప జిల్లా కొండాపూర్‌ మండలం కె బొమ్మేపల్లిలో 41.64 ఎకరాలు, ఆ ప్రాంతంలోనే 191.64 ఎకరాల భూమిని నెడ్‌క్యాప్‌కు కౌలు ప్రాతిపదికన కేటాయింపు. ఎకరానికి ఏడాది రూ.31 వేలు. ప్రతి రెండేళ్లకు 5 శాతం పెంపు. లీజు గడువు 46 ఏళ్లు.

  • కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్ర యానం గ్రామంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి బురద పీతల హ్యాచరీ స్థాపించడానికి ప్లూటస్‌ ఆక్వా ఎల్‌ఎల్‌పీకి కేటాయింపు. ఏడాదికి ఎకరానికి రూ.2.50 లక్షల లీజు. కాలపరిమితి 15 ఏళ్లు.

  • కర్నూలు రూరల్‌ మండలం బి తండ్రపాడులో సర్వే నంబర్‌ 277/7బీలో ఒక ఎకరా95 సెంట్ల భూమిని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు కోసం ఇవ్వడానికి ఆమోదం. ఎకరానికి రూ.61.23 లక్షలు చెల్లించాలి.


  • టీటీడీ ఐటీ విభాగంలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (ఐటీ) పోస్టును జనరల్‌ మేనేజర్‌ (ఐటీ)గా అప్‌గ్రేడ్‌ చేయడానికి ఆమోదం. టీటీడీలో అర్బన్‌ డిజైన్‌, ప్లానింగ్‌ (యూడీపీ) సెల్‌ ఏర్పాటు చేయడానికి, దానికి నూతనంగా 8 పోస్టుల కల్పనకు ఆమోద ముద్ర.

  • ఏపీ పర్యాటక విధానాని(2024-29)కి అనుబంధంగా తీసుకొచ్చిన ఎంప్లాయిమెంట్‌ ఇన్‌సెంటివ్‌ పాలసీకి ఆమోదం.

  • 2025-26లో కార్యక్రమాలు, ఈవెంట్ల నిర్వహణకు ఏపీ పర్యాటక అథారిటీకి గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.78 కోట్లు కేటాయింపు.

  • కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్కేంద్రం ఆస్తులను నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా ప్రకటించకుండా ఉండేందుకు ఏపీ జెన్‌కో రూ.650 కోట్లు మధ్యకాలిక రుణం.

  • అమరావతిలో ప్యాకేజీ ఈ-15 రోడ్డు విస్తరణ మంగళగిరి పాత జాతీయ రహదారి వరకు (రూ.72.79 కోట్లు), ప్యాకేజీ ఈ-13 రోడ్‌ విస్తరణ (రూ.400.56 కోట్లు) పనులను ఎల్‌-1 బిడ్డర్లకు అప్పగించడానికి కార్యాదేశాలు జారీచేసే అధికారం ఏడీసీఎల్‌ చైర్‌పర్సన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌కు అప్పగింత.

  • ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులతో అమలవుతున్న రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమంలో ప్యాకేజీ-43 కింద డిజైన్‌ నిర్మాణం, నిర్వహణ(డీబీవో) పద్ధతిలో పనులు చేపట్టడానికి, అదనపు అనుబంధ పనులు సహా నిర్వహణకు రూ.560.57 కోట్లు కేటాయించేందుకు పరిపాలనా మంజూరు. ప్యాకేజీ-44 కింద ఇతర అనుబంధ పనులు, ఏఐ ఆధారిత నీటి సరఫరా వ్యవస్థ మొదలైనవాటి నిర్వహణకు రూ.494.86 కోట్లు మంజూరు. ప్యాకేజీ 45 కింద జాతీయ రహదారి-16కి అనుసంధానమయ్యే ఇంటర్‌ చేంజ్‌తోపాటు వంతెనలు, అండర్‌పా‌స్‌లు, యుటిలిటీలతో కూడిన 6 లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌తో ఈ-3 రోడ్డు విస్తరణ కోసం 593.03 కోట్లకు ఆమోదం.


  • ‘వరుణ్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని కన్సార్టియం’ బదులుగా ‘వరుణ్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరు మీద అమ్మకం ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆమోదం.

  • హయట్‌ బ్రాండ్‌తో అనుబంధం ఉన్న ‘ఓం శ్రీ భావన సాయి అసోసియేట్స్‌ ఎల్‌ఎల్‌పీ’ బదులుగా ‘ఓం శ్రీ భావన సాయి అసోసియేట్స్‌’ పేరు మీద అమ్మకం ఒప్పందానికి ఆమోదం.

  • నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో ఏపీ మారిటైమ్‌ బోర్డు ద్వారా పారిశ్రామిక హబ్‌ నిర్మాణం కోసం జరుపుతున్న భూసేకరణకు పరిహారాన్ని ఎకరాకు మరో రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా ఎకరాకు రూ.16 లక్షలు మాత్రమే ఉన్న పరిహారం రూ.20 లక్షలకు పెంపు. దీనివల్ల పారిశ్రామికవాడ ఏర్పాటు ఊపందుకుని పోర్టు అధారిత పరిశ్రమలు వస్తాయని.. ఉద్యోగావకాశాలు కూడా ఏర్పడతాయని.. ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కేబినెట్‌ పేర్కొంది.

  • ఏపీ మారిటైమ్‌ బోర్డు పారిశ్రామిక ప్రయోజనాల కోసం వాడ్రేవుకు సమీపంలోని భూములను, బోర్డు సేకరించే ప్రక్రియలో ఉన్న భూములను, భవిష్యత్‌లో సేకరించబోయే భూములను, ప్రభుత్వ ఉప్పు భూములను ఏపీఐఐసీకి బదిలీకి ఆమోదం.

  • నెల్లూరు జిల్లా నెల్లూరు బీట్‌-2 గ్రామంలోని సర్వే నంబర్‌ 2062-3లో గల 36 ఎకరాల భూమి వర్గీకరణను పెన్నానది పోరంబోకు నుంచి ఏడబ్ల్యూ డ్రై(అసెస్డ్‌ వేస్ట్‌ డ్రై)గా మార్చడానికి, కొత్త సర్వే నంబర్‌ 2224ని సృష్టించి భగత్‌ సింగ్‌ కాలనీ నివాసితులకు పట్టాలు మంజూరు చేసే సులభతర ప్రక్రియ చేపట్టేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు అనుమతి మంజూరు.

  • అమృత్‌-2.0 కింద పురపాలక సంస్థల్లో 281 మౌలిక వసతుల పనులను ‘ఎస్‌ఎన్‌ఏ-స్పర్శ్‌’ ప్లాట్‌ఫాం ద్వారా కన్సెషనరీ హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌(చామ్‌) కింద చేపట్టడానికి ఆమోదం.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..

ఆపరేషన్ సిందూర్‌పై చైనా, అమెరికా స్పందన

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 04:49 AM