Satya Sai : కదిలింది సాయిరథం
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:35 AM
సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి మార్మోగింది. పట్టణ వీధులన్నీ కిటకిటలాడాయి. ప్రశాంతి నిలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హిల్‌వ్యూ స్టేడియంలో సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్వర్ణరథంపై సత్యసాయి బాబా చిత్రపటాన్ని ...
పుట్టపర్తిలో మార్మోగిన సాయినామం
అట్టహాసంగా సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు
ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత రెడ్డి తదితరుల హాజరు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి మార్మోగింది. పట్టణ వీధులన్నీ కిటకిటలాడాయి. ప్రశాంతి నిలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హిల్‌వ్యూ స్టేడియంలో సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్వర్ణరథంపై సత్యసాయి బాబా చిత్రపటాన్ని ఊరేగించారు. సత్యసాయి స్వర్ణరథం స్టేడియంలోకి వస్తుండగా గాయకుడు మనో తన పాటతో అరవిందు డోలు వాయిద్యంతో సాగింది. గాయకుల పాటకు భక్తులు లీనమై పులకించిపోయారు. శాంతి వేదిక వరకు సాగిన స్వర్ణ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఎగబడ్డారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తెలుగు రాషా్ట్రల ముఖ్యమంత్రులు నారా
చంద్రబాబునాయుడు, రేవంతరెడ్డితోపాటు దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం హిల్ వ్యూ స్టేడియంలో ప్రముఖ గాయకుడు మనో, శివమణి సంగీత విభావరితో ఆలరించారు. అన్నిరాషా్ట్రల సత్యసాయి భక్త బృందాలు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించాయి. సింగర్ మనో పాట పాడుతుండగా.. సత్యసాయి స్వర్ణరథం స్టేడియంలోకి ప్రవేశించింది. దీంతో భక్తుల సాయినామంతో స్టేడియం దద్దరిల్లింది. సాయి రథం ముందు వేదపారాయణం చేస్తూ సాగారు. వేదం, నగర సంకీర్తన, భజన ఒకే వేదికపై ఆధ్యాత్మికత, ఏకత్వాన్ని ప్రతిబింబించాయి. స్వర్ణ రథంపై దివ్యకాంతులతో విరాజిల్లుతున్న సత్యసాయి బాబా దర్శనంతో భక్తులు తన్మయత్వం పొందారు.
సాయి కుల్వంతులో..
సత్యసాయి శత జయంతి వేడుకలను ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత సభామండపంలో ఘనంగా నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. విద్యార్థుల వేదపఠనం, భక్తి నివేదనం పేరిట భక్తి గీతాల ఆలాపన చేపట్టారు. వేలాది మంది భక్తులు
సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయం పూర్తిగా నిండిపోయింది. అందులో చోటులేక బయటే భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. పుట్టపర్తి వీధులు కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెంట్రల్ ట్రస్టు సభ్యులు, సేవాదళ్, జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నాయి. దీంతో బాబా శతజయంతి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు నారాయణ సేవతోపాటు పలువురు భక్తులు అన్నదానం చేశారు.
ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. వేడుకల మొదటి రోజు నుంచి ప్రముఖులు సందర్శిస్తున్నారు. దీంతో భద్రత కల్పించడం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ నిరంతరం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ.. గడిపారు.