Home Minister Anitha: వందరోజుల్లో శిక్ష పడాలి
ABN , Publish Date - Mar 02 , 2025 | 01:19 AM
నేరం చేసినవారికి వంద రోజుల్లో శిక్ష పడేలా పోలీసు యంత్రాంగం పనిచేయాలని హోమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎవరికి ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే గుర్తొచ్చేది పోలీసులేనని అనంతపురం పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 394 మంది ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్‌లో శనివారం ఆమె పాల్గొన్నారు. డీజీపీ ...

నేరగాళ్లలో భయం పుట్టాలి
బాధితులకు భరోసాగా నిలవండి
కొత్త ఎస్‌ఐలకు హోం మంత్రి అనిత సూచన
పీటీసీలో ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్
అనంతపురం సెంట్రల్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): నేరం చేసినవారికి వంద రోజుల్లో శిక్ష పడేలా పోలీసు యంత్రాంగం పనిచేయాలని హోమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎవరికి ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే గుర్తొచ్చేది పోలీసులేనని అనంతపురం పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 394 మంది ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్‌లో శనివారం ఆమె పాల్గొన్నారు. డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తాతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆమె ప్రసంగించారు. ‘పోలీసు ఉద్యోగం చేపట్టాక ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు మీ పరిధి చాలా చిన్నది. రేపటి నుంచి చాలా విస్తృతమౌతుంది..’ అని విధుల్లో చేరబోతున్న ఎస్‌ఐలనుద్దేశించి అన్నారు. పోలీసులు చెప్పే ఒక్క మాటతో బాధితుల కష్టాలు సగం తీరుతాయని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. తనను హోం మంత్రిని చేసిన సీఎం చంద్రబాబు, ఎన్డీఏ కూటమి సభ్యులకు ధన్యవాదాలని అన్నారు. హోం మంత్రిగా ఇలాంటి పరేడ్
మైదానంలో నిలబడాలంటే అదృష్టం, అర్హత, ప్రజల దీవెనలు ఉండాలని అన్నారు. సబ్ ఇనస్పెక్టర్లుగా 394 మంది సమాజంలో అడుగుపెట్టడం అరుదైన అంశమని అన్నారు. పాసింగ్ అవుట్ పెరేడ్‌లో నిలబడ్డ మిమ్మల్ని చూస్తున్న తల్లిదండ్రుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగి పోతున్నాయని అన్నారు. ఎంటెక్, బీటెక్, ఫార్మసీ, ఆర్ట్స్ అండ్ సైన్స కోర్సులు అభ్యసించిన వారు ఎస్‌లుగా ఎన్నికయ్యారని అన్నారు. ఇంజనీరింగ్ కోర్సులు చేసినవారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా రూ.లక్షల జీతాలు తీసుకోవచ్చని, అయినా ప్రజాసేవ చేయాలనే తపన, పోలీస్ ఉద్యోగం పట్ల ప్యాషనతో ముందుకు వచ్చారని అన్నారు. పోలీసు ఉద్యోగంలోకి రావాలంటే త్యాగం చేయాలని, ఎంత కష్టపడి చదవారో ఆర్థమౌతోందని అన్నారు. పోలీసులు అంటే ఇలా ఉండాలి అనేలా నడుచుకోవాలని సూచించారు. పోలీసులు చేసే తప్పులు, ఒప్పులు ప్రభుత్వం మీద ప్రభావం చూపుతాయని అన్నారు.
మంచి నాయకత్వం
సాంకేతికతను ప్రోత్సహించే విజన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నామని హోం మంత్రి అన్నారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, పోలీసులను కూడా బురడీ కొట్టించే తెలివితేటలు దొంగలకు ఉన్నాయని అన్నారు. నేరస్థులకే అన్ని తెలివితేటలుంటే.. కష్టపడి చదివి, కఠినతరమైన శిక్షణపొంది, జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన పోలీసులకు ఇంకెన్ని తెలివితేటలుండాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలని సూచించారు. అందుకే నిరంతర అభ్యసకులుగా ఉండాలని అన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో ఒక పోలీస్ స్టేషన ఏర్పాటు చేయడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారని అన్నారు. శిక్షణ పొందిన ఎస్‌ఐలలో 97 మంది మహిళలు ఉన్నారని, అందరికీ శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నాని అన్నారు.
నేరాలను అరికట్టేందుకు..
మహిళల హత్యలు, అత్యారాలను కట్టడి చేయడానికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని అన్నారు. ఇలాంటి నేరాలు చేసేవారికి వందరోజుల్లో శిక్ష పడేలా యంత్రాంగం పనిచేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్, హూమ్ సర్టిఫికెట్, చార్జీషీట్, కోర్టుకు ఆధారాలు సమర్పించడం.. ఇలా మొత్తం ప్రక్రియ వంద రోజుల్లో పూర్తికావాలని అన్నారు. రాష్ట్రం ఎందుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో గంజాయి ఒకటని, గంజాయి ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యం కారణంగా స్కూల్ బ్యాగుల్లోకి గంజాయి చేరిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసు యంత్రాంగం గంజాయి సాగును అరికడుతోందని అన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపడానికి ఈగల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, బడ్జెట్‌లో నిధులు కేటాయించామనిఅన్నారు. తొమ్మిది నెలల కాలంలోనే లక్ష కేజీలపైన గంజాయిని ధ్వంసం చేశామని అన్నారు. అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, వెస్ట్ గోదావరి ఇలా పలు జిల్లాల్లో పోలీసు యంత్రాంగం గంజాయి రవాణా జరగకుండా కట్టడి చేసిందని అన్నారు.
రాగద్వేషాలకు అతీతంగా సేవలు: డీజీపీ
రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించాలని శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న ఎస్‌ఐలకు డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా పిలుపునిచ్చారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో చేసిన ఆ ప్రమాణానికి అనుగుణంగానే ఉద్యోగ విరమణ పొందే వరకూ పనిచేయాలని సూచించారు. మానవ హక్కులను కాపాడుతూనే... రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. పోలీసు సేవలు అవసరమైన వారి పట్ల మరింత సానుభూతితో ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పబ్లిక్ గ్రీవెన్స రిడ్రస్సల్ సిస్టమ్‌ను అమలు చేస్తోందని అన్నారు. ఈ సిస్టమ్‌కు మంచి స్పందన లభిస్తోందని అన్నారు. 52 శాతం మంది మహిళలు పిటిషనర్లుగా వస్తున్నారంటే... పోలీసుశాఖ, ప్రభుత్వంపై విశ్వాసం పెరిగినట్లేనని స్పష్టంగా అవగతమవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు శిక్షణా విభాగం ఐజీ కేవీ మోహనరావు, ఏపీఎస్పీ బెటాలియన విభాగం ఐజీ రాజకుమారి, కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీలు జగదీష్, రత్న తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....