Share News

AP News: టన్ను రూ.లక్ష.. మూడు నెలల్లోనే అమాంతం పెరిగిన దానిమ్మ రేటు

ABN , Publish Date - Dec 02 , 2025 | 10:07 AM

ఈ ఏడాది దానిమ్మ రైతు పంట పండింది. మార్కెట్లో దానిమ్మకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దానిమ్మ ధర లక్ష రూపాయల నుంచి రూ.1.10 లక్షల వరకు పలుకుతోంది. దీంతో దానిమ్మ సాగుచేసిన రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

AP News: టన్ను రూ.లక్ష.. మూడు నెలల్లోనే అమాంతం పెరిగిన దానిమ్మ రేటు

పుట్లూరు(అనంతపురం): దానిమ్మ రైతులకు మంచి రోజులు వచ్చాయి. ఇంతకాలం భారీగా పెట్టుబడులు పెట్టి పంటలు తీసినా.. సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఇటీవల దానిమ్మ ధరలు నెమ్మదిగా పెరుగుదల ప్రారంభమయ్యాయి. మూడు నెలల క్రితం టన్ను ధర రూ.50వేల నుంచి రూ. 60వేల వరకు ఉన్నాయి. ప్రస్తుతం టన్ను దానిమ్మ ధర లక్ష రూపాయల నుంచి రూ.1.10 లక్షల వరకు పలుకుతోంది. దీంతో గతంలో పెట్టుబడులకు చేసిన అప్పులను తీర్చుకోవచ్చని రైతులు ఆశిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13,381 ఎకరాల్లో దానిమ్మ సాగుచేస్తున్నారు. పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి, తాడిపత్రి, నార్పల, రాప్తాడు తదితర మండలాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు.


pandu1.jpg

ఇతర రాష్ట్రాల్లో దిగుబడి ఆలస్యం

ఇతర రాష్ట్రాల్లో దానిమ్మ దిగుబడి ఆలస్యం కావడంతోనే మన రాష్ట్రంలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఆ రాష్ట్రాల్లో పంట రావడానికి సుమారు రెండునెలలు పడుతుందని తెలుస్తోంది. దీంతో మన దానిమ్మపండ్లకు డిమాండ్‌ పెరిగినట్లు సమాచారం. గుజరాత్‌, మహారాష్ట్ర(Gujarat, Maharashtra) ఇతర రాష్ట్రాల్లో పంట ఆలస్యమవుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అక్కడి వ్యాపారులు సైతం కొనుగోలు చేసేందుకు మన రాష్ట్రానికి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.


pandu1.3.jpg

టన్ను ధర రూ.లక్ష పైగానే

మూడు నెలల క్రితం దానిమ్మ ధరలు టన్ను రూ.50వేల నుంచి రూ.60వేల వరకు మాత్రమే పలికాయి. ప్రస్తుతం టన్ను రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల వరకు పలుకుతోంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే రైతులకు పంట చేతికి వస్తోంది. ధరలు ఆశించిన స్థాయిలో ఉన్నప్పుడే అమ్ముకుంటే అప్పులు తీరుతాయని పలువురు అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. దానిమ్మపండ్లను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

మరో వివాదంలో ఐపీఎస్‌ సునీల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 02 , 2025 | 10:07 AM