Amaravati Land Monetization: 4 వేల ఎకరాలు 80 వేల కోట్లు
ABN , Publish Date - May 05 , 2025 | 04:43 AM
అమరావతిలో 4 వేల ఎకరాల భూమిని ఎకరం రూ.20 కోట్లకు అమ్మి రూ.80 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు సీఆర్‌డీఏ ల్యాండ్ మానిటైజేషన్ ప్రణాళిక రూపొందించింది.ఈ నిధులతో అప్పుల చెల్లింపు, ప్రాజెక్టుల నిర్మాణం, భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చే లక్ష్యంగా ప్రభుత్వత ప్రయత్నిస్తోంది.

రాజధానిలో ల్యాండ్ మానిటైజేషన్‌తో నిధులు
ఎకరం రూ.20 కోట్లకు విక్రయించాలని నిర్ణయం
అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు వినియోగం
తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులకు కూడా
రెండో దశ ల్యాండ్ మానిటైజేషన్ జాబితాలో రియల్ ఎస్టేట్ సంస్థలకు 60:40 నిష్పత్తిలో భూములు
అభివృద్ధి చేసిన గృహాలు, విల్లాలు, కమర్షియల్ స్పేస్, ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి సమకూరనున్న ఆస్తులు
భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
‘‘రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా... ప్రజలపై భారం పడకుండా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నాం’’ అని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా రాజధాని అమరావతిలో ల్యాండ్ మానిటైజేషన్ పాలసీకి సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టనుంది. తొలిదశలో రాజధాని పరిధిలోని 4వేల ఎకరాలను ఈ జాబితాలోకి తీసుకురానుంది. ఈ భూములను ఎకరం రూ.20కోట్లు చొప్పున విక్రయించడం ద్వారా రూ.80వేల కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను రుణసంస్థల నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడానికి ఉపయోగించాలని భావిస్తోంది. అలాగే రాజధానిలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులకు నిధుల కొరతను కూడా వీటితో సమర్థంగా అధిగమించవచ్చని అంచనా వేస్తోంది.
బ్యాంకుల కన్సార్షియంతో చర్చలు
అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అందుకు అదనంగా అవసరమైన నిధుల సమీకరణను చేపట్టే బాధ్యతలను సీఆర్‌డీఏకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలో పలు బ్యాంకుల కన్సార్షియంతో సీఆర్‌డీఏ కమిషనర్ చర్చలు జరుపుతున్నారు. అమరావతి రాజధాని రూపురేఖలు మార్చడానికి మొత్తంగా రూ.77,250 కోట్లతో పనులు చేపట్టేందుకు సీఆర్‌డీఏ, ఏడీసీ సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. రాజధానిలో రూ.49వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శుక్రవారం శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రూ.15వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ కింద ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి తీసుకున్నారు. ఈ రెండు సంస్థలూ ఆరేళ్ల పాటు దశల వారీగా నిధులు మంజూరు చేస్తుంటాయి. అలాగే, హడ్కో నుంచి రూ.11వేల కోట్ల రుణంగా తీసుకున్నారు. ఇది కూడా ఐదేళ్లపాటు దశల వారీగా నిధులు విడుదల చేయనుంది. ఇవికాకుండా కేఎ్‌ఫడబ్ల్యూ నుంచి రానున్న మరో రూ.5వేల కోట్ల రుణం కూడా కలిపితే అమరావతి ప్రాజెక్టు పనులకు మొత్తంగా రూ.31వేల కోట్ల మేర రుణాల రూపంలో నిధులు సర్దుబాటు కానున్నాయి.
లక్ష్యాలకు అనుగుణంగా నిధుల సమీకరణ
రాజధానిలో తలపెట్టిన బ్యాలెన్స్ పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నింటినీ రెండేళ్లలోగా, ఐకానిక్ భవనాలను మూడేళ్లలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుంది. కేంద్ర ప్రభుత్వ గ్యారంటీపై రుణ సంస్థలు విడతల వారీగా ఇచ్చే నిధులతోనే పనులు చేయాలంటే కాలాతీతమయ్యే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్దేశించుకున్న ప్రాజెక్టులు, వాటిని పూర్తి చేయాల్సిన లక్ష్యాలకు అనుగుణంగా అదనంగా నిధులు సమీకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం మరో రూ.40వేల కోట్ల వరకు బ్యాంకుల కన్సార్షియం ద్వారా రుణాలు తీసుకునేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నాలు చేస్తోంది. ఈ లెక్కన అమరావతి పనుల కోసం తీసుకొనే అప్పులు రూ.70వేల కోట్లకు చేరుకుంటాయి. భవిష్యత్తులో ఈ రుణాలు భారం కాకముందే వాటిని తీర్చడానికి ల్యాండ్ మానిటైజేషన్ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది.
భూముల ధరలకు రెక్కలు
‘‘గతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేశాం. అవి పోను సీఆర్‌డీఏకి 4వేల ఎకరాలు మిగులుతుంది. ఆ భూమిని వేలం వేసి, రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం’’ అని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అమరావతిలో భూముల ధరలు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత అభివృద్ధి పనులతో రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న భూముల్లో 4వేల ఎకరాలను ల్యాండ్ మానిటైజేషన్ జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. ఏయే ప్రాంతాల్లోని భూములను ఈ జాబితాలో చేరుస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విధంగా జాబితాలో చేర్చిన భూములను ఎకరం రూ.20కోట్ల చొప్పున విక్రయించనుంది. తద్వారా రూ.80 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. దీంతో రానున్న రోజుల్లో అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు వంటివి రాజధాని పనులపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉండదని చెబుతున్నారు. అమరావతికి ప్రస్తుతం ఉన్న 34వేల ఎకరాలతో పాటు మరో 44 వేల ఎకరాలు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికిప్పుడు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ర్టియల్ సిటీ, స్పోర్ట్స్ సిటీలకు 10వేల ఎకరాలు సమీకరించి మిగిలిన భూములను ప్రాజెక్టుల పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాక సమీకరించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ భూముల్లో కొన్నింటిని ఆ తర్వాత రెండో దశ ల్యాండ్ మానిటైజేషన్ జాబితాలో 60:40 విధానంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరులోని టాప్-5 రియల్ ఎస్టేట్-డెవల్‌పమెంట్ సంస్థలతో సీఆర్‌డీఏ అధికారులు, మంత్రి నారాయణ చర్చలు జరిపారు. ఈ 60:40 విధానం వల్ల అభివృద్ధి చేసిన ఇళ్లు, విల్లాలు, కమర్షియల్ స్పేస్, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు ఇలాంటివన్నీ సీఆర్‌డీఏకు ఆస్తులుగా సమకూరుతాయి. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను తీర్చటానికి కూడా ఇవి ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు.