NG Ranga Agricultural University: ఉద్యోగ విరమణ వయసు పెంపు కోసం రాయ‘బేరాలు’
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:32 AM
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపు వ్యవహారం కుంపటిని రాజేసింది. సీనియర్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచే జీవో అమలు కోసం కొందరు చేస్తున్న ప్రయత్నాలపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి.

ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో వసూళ్ల పర్వం
సీనియర్ అధ్యాపకుల నుంచి లక్షల్లో వసూలు
తమకు అన్యాయం జరుగుతుందంటున్న పీహెచ్‌డీ స్కాలర్లు
జీవో 39 అమలు చేయవద్దంటూ సీఎంకు ఫిర్యాదులు
(ఆంధ్రజ్యోతి-గుంటూరు): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపు వ్యవహారం కుంపటిని రాజేసింది. సీనియర్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచే జీవో అమలు కోసం కొందరు చేస్తున్న ప్రయత్నాలపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారంటూ వర్సిటీలోని పీహెచ్‌డీ స్కాలర్లు సీఎం ముఖ్య కార్యదర్శికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. బోధన సిబ్బందికి పెంచితే తమకూ పెంచాలని బోధనేతర సిబ్బంది కూడా డిమాండ్ చేస్తుండటంతో రెండు గ్రూపులుగా విడిపోయినట్లు తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ గత వైసీపీ ప్రభుత్వం 2023 జూలై 29న జీవో 39ని తీసుకువచ్చింది. ఈ జీవోపై అప్పట్లోనే పెద్ద ఎత్తున దుమారం రేగటంతో అమలును కొంతకాలం పెండింగ్‌లో పెట్టింది.
అనంతరం ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో జీవోను అమలు చేయించేందుకు ఎన్‌జీ రంగా వర్సిటీలోని కొందరు సీనియర్ అధ్యాపకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం ప్రభుత్వంలో ఉన్న వారికి పెద్ద ఎత్తున ముట్టజెప్పాలని వసూళ్ల పర్వానికి తెరలేపారు. జీవో అమలైతే లబ్ధి పొందే సుమారు 60 మంది సీనియర్ అధ్యాపకుల నుంచి లక్షల్లో వసూలు చేసేందుకు ఓ ముఖ్య అధికారి మనుషులను రంగంలోకి దింపినట్లు ఆరోపణలున్నాయి. ఈ 60 మందికి మరో మూడేళ్లు అవకాశం వస్తే ఒక్కొక్కరికి సుమారు 1.50 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ లెక్కలు వేసి మరీ ముడుపులు భారీగా వసూలు చేస్తున్నారని సీఎంకు పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్ అధ్యాపకుల పదవీ విరమణ వయసు పెంపు వల్ల ఇప్పటికే యూనివర్సిటీలో విద్యనభ్యసించి డాక్టరేట్లు పొందిన 2500 మందికి, పీహెచ్‌డీ చేస్తున్న మరో 700 మంది స్కాలర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ పీహెచ్‌డీ స్కాలర్లు సీఎం ముఖ్య కార్యదర్శికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్ అధ్యాపకులు ఒక్కొక్కరు ప్రస్తుతం రూ.3 లక్షలు వరకు జీతం తీసుకుంటున్నారని, వారి పదవీ విరమణ వయసు మరో మూడేళ్లు పెంచితే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.70 కోట్ల వరకు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. వర్సిటీకి చెందిన ముఖ్య అధికారి ధన దాహంతో అంతమంది భవిష్యత్తుపై దెబ్బ కొడుతున్నారని పేర్కొన్నారు.