Share News

Police: కామారెడ్డిలో మూకుమ్మడి ఆత్మహత్యలు?

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:16 AM

ప్రేమ వ్యవహారమో ? వివాహేతర సంబంధమో ? మరేదైనా కారణమో స్పష్టత లేదు కానీ... ఓ ఎస్సై, ఓ మహిళా కానిస్టేబుల్‌, మరో యువకుడు కామారెడ్డి జిల్లాలోని ఓ చెరువులో శవాలై కనిపించారు.

Police: కామారెడ్డిలో మూకుమ్మడి ఆత్మహత్యలు?

  • మృతుల్లో బిక్కనూరు ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌, మరో యువకుడు

  • అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్దచెరువులో ఘటన

  • తొలుత కానిస్టేబుల్‌, యువకుడి మృతదేహాలు చెరువు నుంచి వెలికితీత

  • తాజాగా ఎస్సై మృతదేహం కూడా.. మృతికి గల కారణాలపై దర్యాప్తు

కామారెడ్డి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రేమ వ్యవహారమో ? వివాహేతర సంబంధమో ? మరేదైనా కారణమో స్పష్టత లేదు కానీ... ఓ ఎస్సై, ఓ మహిళా కానిస్టేబుల్‌, మరో యువకుడు కామారెడ్డి జిల్లాలోని ఓ చెరువులో శవాలై కనిపించారు. మూకుమ్మడి ఆత్మహత్యలుగా భావిస్తున్న ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం కుప్రియల్‌ గ్రామ శివారులోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్దచెరువు వద్ద బుధవారం జరిగింది. ఈ ఘటనలో బీబీపేట పోలీసు స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌ శ్రుతి(25), బీబీపేట సొసైటీ కాంట్రాక్ట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ (28) మృతదేహాలను పోలీసులు బుధవారమే గుర్తించారు. బుధవారం నుంచి ఆచూకీ లేకుండా పోయిన భిక్కనూరు ఎస్సై సాతెల్లి సాయికుమార్‌ (32) మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మెదక్‌ జిల్లా కొల్పారం గ్రామానికి చెందిన సాయికుమార్‌ 2018లో ఎస్సై అయ్యారు. ప్రస్తుతం భిక్కనూరు ఎస్సైగా ఉన్న సాయికుమార్‌ గతంలో సిద్దిపేట జిల్లా చిన్నకొడురు మండలం, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం, బీబీపేట పోలీసుస్టేషన్లలో ఎస్సైగా పని చేశారు. సాయికుమార్‌కు భార్య లక్ష్మి, కొడుకు శ్రీహన్ష్‌ ఉన్నారు. 2014 బ్యాచ్‌కు చెందిన శ్రుతి గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. మూడేళ్లుగా బీబీపేట పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తుంది.


ప్రేమ వ్యవహారమేనా ?

బుధవారం మధ్యాహ్నం వరకు విధుల్లో ఉన్న ఎస్సై సాయికుమార్‌ ఆ తర్వాత తన సొంత కారులో కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి శ్రుతి, నిఖిల్‌ను కలిసినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అక్కడి నుంచి ఈ ముగ్గురు కలిసి అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్దచెరువు వైపు వెళ్లినట్లు గుర్తించారు. బీబీపేట పోలీసు స్టేషన్‌లో పని చేసినప్పటి నుంచి సాయికుమార్‌కు శ్రుతితో పరిచయం ఉందని, ఇరువురి మధ్య వివాహేతర సంబంధం ఉందనే ప్రచారమూ ఉంది. సాయికుమార్‌కు భిక్కనూరుకు బదిలీ అయిన తర్వాత శ్రుతికి నిఖిల్‌ దగ్గరయ్యాడని, ఇరువురు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం వీరి మధ్య వాగ్వాదం జరగ్గా క్షణికావేశంలో శ్రుతి చెరువులో దూకే యత్నం చేయగా సాయికుమార్‌, నిఖిల్‌ ఆమెను అడ్డుకున్నారని ఘటనాస్థలిలో లభించిన ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు అనుకుంటున్నారు.


అయినా వారిని విడిపించుకుని శ్రుతి చెరువులోకి దూకగా.. ఆమెను కాపాడేందుకు సాయికుమార్‌, నిఖిల్‌ కూడా నీళ్లలోకి దూకి పిచ్చి మొక్కలు, నాచు తీగల మధ్య చిక్కుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాలకు పిచ్చి మొక్కలు, నాచు తీగలు చుట్టుకుని ఉండడంతో ఈ అంచనాకు వచ్చారు. అయితే, ముగ్గురూ చనిపోవడంతో వారి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురి మరణానికి గల కారణాన్ని త్వరలోనే వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ సింధూ శర్మ గురువారం విలేకరులతో అన్నారు. కాగా, శ్రుతి ముఖంపై గాయాలున్నాయని సాయికుమార్‌, నిఖిల్‌ కలిసి ఆమెను హత్య చేసి ఉంటారని శ్రుతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక, ఎస్సై సాయికుమార్‌ మృతదేహానికి నివాళులర్పించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.


అసలు ఏం జరిగిందంటే ?

ఎస్సై సాయికుమార్‌, కానిస్టేబుల్‌ శ్రుతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ మరణాలపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. బుధవారం విధులకు హాజరైన శ్రుతి రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. శ్రుతి ఫోన్‌ స్విచ్చాఫ్‌ లో ఉండడంతో మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆమె చివరిగా పెద్ద చెరువు వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా శ్రుతి, నిఖిల్‌కు చెందిన వస్తువులతో పాటు భిక్కనూరు ఎస్సై కారు ఉన్నాయి. అర్ధరాత్రి అయినా చెరువులో గాలించగా శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు దొరికాయి. సాయికుమార్‌ ఆచూకీ లభించకపోవడంతో అనే అనుమానాలు తలెత్తాయి. అయితే, గురువారం ఉదయం సాయికుమార్‌ మృతదేహం కూడా అదే చెరువులో దొరికింది.

Updated Date - Dec 27 , 2024 | 04:16 AM