Share News

Digital Cards: సంక్షేమ పథకాలన్నీ డిజిటల్‌ కార్డుతోనే!

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:37 AM

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలి డిజిటల్‌ కార్డు ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దీని ద్వారానే రేషన్‌, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ అందించాలని భావిస్తోంది.

Digital Cards: సంక్షేమ పథకాలన్నీ డిజిటల్‌ కార్డుతోనే!

  • అమలవుతున్న రాష్ట్రాల్లో అధ్యయనం.. కార్డులపై సీఎం సమీక్ష

  • ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ, గ్రామీణ ప్రాంతంలో పైలట్‌ ప్రాజెక్టు

  • డిజిటల్‌ కార్డులో కుటుంబంలోని ప్రతి సభ్యుడి హెల్త్‌ ప్రొఫైల్‌: రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలి డిజిటల్‌ కార్డు ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దీని ద్వారానే రేషన్‌, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ అందించాలని భావిస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం తన నివాసంలో వైద్యారోగ్య, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్‌, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు డిజిటల్‌ కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. వాటితో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులను తెలుసుకొని సమగ్ర నివేదిక రూపొందించాలని అన్నారు.


అనంతరం రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు ఉండాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్‌, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని అన్నారు. ఈ డిజిటల్‌ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుడి హెల్త్‌ ప్రొఫైల్‌ ఉండాలని, అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.


ఆయా కుటుంబ సభ్యులు తమ కుటుంబాల్లో సభ్యుల కలయిక, తొలగింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు కార్డును అప్‌డేట్‌ చేసుకునేలా ఉండాలని పేర్కొన్నారు. వీటి పర్యవేక్షణకు జిల్లాలవారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీఎస్‌ శాంతికుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 02:37 AM