Scam: ఆన్‌లైన్ సంస్థ మోసానికి కానిస్టేబుల్ బలి
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:54 AM
అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ ఊరించిన ఓ ఆన్‌లైన్ ఫైనాన్స్ సంస్థను నమ్మిన కానిస్టేబుల్ రూ.25లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.

25లక్షల అప్పు చేసి అందులో పెట్టుబడి
దగాపడి కుటుంబంతో సహా ఆత్మహత్యకు విఫలయత్నం
ఫలించక ఉరేసుకుని బలవన్మరణం
సిద్దిపేట క్రైం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ ఊరించిన ఓ ఆన్‌లైన్ ఫైనాన్స్ సంస్థను నమ్మిన కానిస్టేబుల్ రూ.25లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. అప్పు తీర్చే మార్గం కనబడక మనస్తాపానికి గురై భార్య, పదేళ్లు కూడా దాటని ఇద్దరు కుమారులతో సహా ఆత్మహత్యకు విఫలయత్నం చేసి చివరకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేటలో ఆదివారం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34) సిద్దిపేటలో నివాసం ఉంటూ సిరిసిల్లలో 17వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయంటూ ఊరించిన ‘ఫోనిక్స్’ అనే ఓ ఆన్‌లైన్ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థను నమ్మిన బాలకృష్ణ రూ.25లక్షల అప్పు చేసి అందులో పెట్టుబడి పెట్టి మోసపోయారు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో శనివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన అప్పు తీర్చే మార్గం కనబడటం లేదు అందరం చనిపోదాం అని భార్య మానసను ఒప్పించారు. ‘‘అప్పు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాం మా చావులకు ఎవరు కారణం కాదు’’ అని సూసైడ్ నోట్ రాసి పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న ఎలుకల మందును టీలో కలుపుకుని అందరూ తాగారు. ఎంతసేపటికీ చనిపోకపోవడంతో బాలకృష్ణ పక్కనే ఉన్న రూమ్‌లోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మానస విషయాన్ని వెంటనే తన బంధువులకు తెలపడంతో వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలకృష్ణను ఆయన భార్య, కుమారులను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలకృష్ణ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మానసను, పిల్లలను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలి నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.