54 ఏళ్ల కుటుంబపాలనకు అంతం
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:41 AM
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడి పారిపోవడంతో 54 ఏళ్ల అతని కుటుంబపాలన అత్యంత నాటకీయంగా ముగిసింది.

సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడి పారిపోవడంతో 54 ఏళ్ల అతని కుటుంబపాలన అత్యంత నాటకీయంగా ముగిసింది. 1970ల్లో అసద్ తండ్రి హఫెజ్ అల్ అసద్ అధ్యక్షుడైనప్పటి నుంచి ఆదివారం దాకా ఆ కుటుంబమే సిరియాను శాసించింది. తండ్రి మరణం తర్వాత 2000 సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అసద్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు 2011 నుంచి 13 ఏళ్లుగా రకరకాల ప్రయత్నాలు చేశారు. సిరియాను దేశ, విదేశీ శక్తులకు యుద్ధ భూమిగా మార్చేసిన అసద్.. చివరికి అంతర్యుద్ధానికి తలొగ్గి పారిపోయారు.
సున్నీల కోటలో హఫెజ్ సామ్రాజ్యం
సున్నీలు మెజార్టీ వర్గమైన సిరియాలో ఒకప్పుడు వారి ఆధిపత్యమే ఉండేది. దేశంలో రాజకీయ అనిశ్చితి, ప్రజాతిరుగుబాటులు అధికమైనప్పుడు అసద్ తండ్రి హఫెజ్ అల్ అసద్ 1970లో అనూహ్యంగా అధ్యక్షుడు అయ్యారు. షియా పద్ధతులను ఆచరించే అలావీట్ అనే మైనార్టీ వర్గానికి చెందిన హఫెజ్.. సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ, వాయుసేన కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉండేవారు. అధ్యక్షుడయ్యాక విభజించి పాలించు విధానంతో దేశంలో వర్గపోరుకు తెరలేపి తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. సైన్యం, సెక్యూరిటీ సర్వీసెస్ సహా ప్రభుత్వంలోని కీలక పదవుల్లో అలావీట్లు, తన కుటుంబసభ్యులను నియమించి సున్నీల ప్రాబల్యాన్ని క్రమంగా తగ్గించేశారు. దీంతో దేశ జనాభాలో 12 నుంచి 15 శాతం మాత్రమే ఉన్న అలావీట్‌లు హఫెజ్ అధికారానికి అండగా నిలబడ్డారు. హఫెజ్ 30 ఏళ్లకు పైగా సిరియాను ఓ నియంతలా శాసించారు. ఎంతలా అంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్నేహితుల దగ్గర మాట్లాడేందుకు కూడా ప్రజలు వణికిపోయేవారు.
అనుకోకుండా అధ్యక్షుడైన డాక్టర్ సాబ్
బషర్ అల్ అసద్ దేశ అధ్యక్షుడు అవ్వడం అత్యంత నాటకీయంగా జరిగింది. నిజానికి, హఫెజ్ తన పెద్ద కుమారుడు, అసద్ అన్నయ్య బసిల్‌ను తన వారసుడిగా ప్రకటించారు. అయితే, 1994లో జరిగిన ఓ కారు ప్రమాదంలో బసిల్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో లండన్‌లో కంటి వైద్యుడిగా పని చేస్తోన్న అసద్ తెరమీదకి వచ్చారు. ఉన్నపళంగా అసద్‌ను స్వదేశానికి రప్పించి సైనిక శిక్షణ ఇప్పించి, కల్నల్ హోదా కల్పించి.. భవిష్యత్తు నాయకుడు అసద్ అని సందేశం ఇచ్చారు. అయితే, హఫెజ్ 2000లో మరణించే నాటికి అసద్ వయస్సు 34 ఏళ్లు. కానీ దేశ అధ్యక్షుడు అవ్వాలంటే ఓ వ్యక్తికి కనీసం 40 ఏళ్లు ఉండాలి. అయితే, అసద్ కోసం ఈ కనీస వయస్సు పరిమితిని 40 నుంచి 34కు తగ్గిస్తూ పార్లమెంట్ చట్టం చేసేసింది. దాంతో డాక్టర్ సాబ్ తన తండ్రి వారసుడిగా అధ్యక్షుడు అయిపోయారు.
ప్రజా వ్యతిరేకతకు తలొగ్గి
ప్రజా వ్యతిరేకతకు తలొగ్గి 2011లో ఈజిప్టు అధ్యక్షుడు ముబారక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈజిప్టు నేతల ఈ నిర్ణయాన్ని ఎగతాళి చేస్తూ అసద్ అప్పట్లో ఓ ఈ-మెయిల్ పంపారు. ఇప్పుడు అదే ప్రజావ్యతిరేకతతో అసద్ తన పదవిని కోల్పోవడం, దేశాన్ని వదిలి వెళ్లిపోవడం యాదృచ్ఛికం.