Share News

Amaravati : భూమి కోసం.. విముక్తి కోసం

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:39 AM

‘జగన్‌ పాలనలో మా భూములు పోయాయి...కాపాడండి’ అంటూ అన్ని వర్గాల ప్రజలూ గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మదనపల్లె ఉదంతం తర్వాత, ఇప్పటిదాకా దాదాపు ఆరు నెలల కాలంలో ప్రభుత్వానికి వేర్వేరు సమస్యలపై వ్యక్తిగతంగా 1,74,720 విన్నపాలు అందాయి.

Amaravati : భూమి కోసం.. విముక్తి కోసం

  • ప్రభుత్వానికి చేరుతున్న ప్రజా ఆక్రందనలు

  • పాత గొడవలు పరిష్కరించండి

  • కొత్తవి మాత్రం సృష్టించవద్దు

  • రైతులు, బాధితుల విన్నపాలు

  • వైసీపీ అరాచకాలపై ఫిర్యాదుల వెల్లువ

  • 6 నెలల్లో 1,74,720 వ్యక్తిగత ఫిర్యాదులు

  • అందులో రెవెన్యూ శాఖవే 67,928

  • గ్రామసభల్లో రీసర్వేపైనే అధిక అభ్యంతరాలు

  • జగన్‌ హయాం భూ కబ్జాలు, దురాక్రమణలు

  • పాస్‌ పుస్తకాల్లో తేడాలపై రైతుల్లో ఆందోళన

  • దిద్దుబాటు చర్యలపై సర్కారు కసరత్తు

  • భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాలు అనేకం చూశాం. కానీ ఇది అందుకు పూర్తి భిన్నంగా...భూమి విముక్తి కోసం జరుగుతున్న పోరాటం. రైతాంగం, సామాన్య ప్రజలు అనునిత్యం అనుభవిస్తున్న నరకయాతన. జగన్‌ జమానాలో వైసీపీ నేతల భూదాహం, దౌర్జన్యాలు; రీ సర్వే పేరిట కొందరు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు కలగలిసి చేసిన అరాచకాలు ప్రజలకు ఎనలేని కష్టాలను మిగిల్చాయి. అవి ఇప్పుడు ఆక్రందనల రూపంలో వెల్లువెత్తుతున్నాయి.

  • జగన్‌ పాలనలో రీ సర్వే తర్వాత రైతులకు ఇచ్చిన పాసుపుస్తకాల్లో భూమి కొలతలు, సరిహద్దులు, విస్తీర్ణం తదితర అంశాల్లో భారీ తే డాలున్నాయి. జగన్‌ బొమ్మలున్న పాస్‌ పుస్తకాలు రైతులు వద్దన్నారు. కూటమి ప్రభుత్వం వాటి పంపిణీని నిలిపివేసింది. కానీ, ఆ పుస్తకాల్లో అచ్చేసిన తప్పుల గురించి మాత్రం ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ భూమికి విముక్తి కల్పించాలని రైతులు కోరుతున్నారు. పాత సమస్యలు పరిష్కరించాలని, కొత్త సమస్యలు సృష్టించవద్దని వేడుకుంటున్నారు.

  • గ్రామసభల్లో వస్తున్న ఫిర్యాదుల్లో రీసర్వేపై వచ్చేవే అధికంగా ఉన్నాయి. ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రీ సర్వే సమస్యలతోపాటు వ్యక్తిగతంగా అందుతున్న విన్నపాలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దరఖాస్తుల పరిష్కారంపై థర్డ్‌పార్టీతో తనిఖీ (ఆడిట్‌)కూడా చేయించాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రతి దరఖాస్తుదారుకూ..‘మీ సమస్య పరిష్కారం అయింది....సంతృప్తిగా ఉన్నారా? లేక మీ సమస్య పరిష్కారం అయినా న్యాయం జరగలేదని అనుకుంటున్నారా?’ అంటూ బాధితులకు ప్రశ్నలు వేసి..వారి స్పందన కోరాలని భావిస్తున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘జగన్‌ పాలనలో మా భూములు పోయాయి...కాపాడండి’ అంటూ అన్ని వర్గాల ప్రజలూ గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మదనపల్లె ఉదంతం తర్వాత, ఇప్పటిదాకా దాదాపు ఆరు నెలల కాలంలో ప్రభుత్వానికి వేర్వేరు సమస్యలపై వ్యక్తిగతంగా 1,74,720 విన్నపాలు అందాయి. ఇందులో 1,26,301 విన్నపాలు జిల్లాల అధికారుల పరిశీలనలో ఉన్నాయి. అయితే, మొత్తం విన్నపాల్లో 67,928 కేవలం రెవెన్యూశాఖ పరిష్కరించాల్సినవే ఉన్నాయి. అంటే, భూ కబ్జాలు, భూ దురాక్రమణలు, పాస్‌ పుస్తకాల్లో తేడాలు, అసైన్డ్‌ ఇంటిస్థలాలు, రెవెన్యూ సేవలు అందించే అధికారులపై చేసిన ఫిర్యాదులు ఇందులో ఉన్నాయి. అంటే, మొత్తం ఫిర్యాదుల్లో ఇవి 38.88 శాతం. అధికశాతం ఫిర్యాదులు ఉన్న విభాగం కూడా రెవెన్యూశాఖదే కావడం గమనార్హం. గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారి (వీఆర్‌వో), సర్వేయర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, తహసీల్దార్‌, ఆర్‌డీవో..చివరకు భూముల వ్యవహారాలు చూసే జాయింట్‌ కలెక్టర్‌లపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూశాఖపై వచ్చిన ఫిర్యాదుల్లో అధికారులపై వచ్చినవే 9.87 శాతం ఉన్నాయి.

ఇవీ రెవెన్యూ విన్నపాలు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కొందరు దుండగులు మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలోని రికార్డుల రూమ్‌ను తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత భూములు కోల్పోయిన పేదలు, సామాన్యులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి మదనపల్లిలోనే ఉన్న రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.పి.సిసోడియాకు వ్యక్తిగతంగా వినతిపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం కోసమే ఆయన మూడురోజుల పాటు అక్కడే మకాం వేశారు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం, జిల్లా కలెక్టరేట్‌తోపాటు పలు చోట్ల ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించింది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యాలయాల్లో ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తూ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. రెవెన్యూ విన్నపాల్లో ప్రధానంగా ఏడు కేటగిరీలు ఉన్నాయి. అవీ...


  • కేసులపై పునర్విచారణ

ప్రభుత్వానికి అందిన ప్రజల విన్నపాలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌ను(పీజీఆర్‌ఎస్‌) అందుబాటులోకి తీసుకొచ్చారు. రెవెన్యూశాఖపై వచ్చిన ఫిర్యాదుల్లో 16వేలు పరిష్కరించామని జిల్లాల అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే, తమ సమస్య పరిష్కారం కాలేదని బాధితులు మరోసారి ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో అనుమానం వచ్చి అన్నింటినీ తిరిగి తెరిపించి పునర్విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ 16 వేల దరఖాస్తులపై జిల్లాలవారీగా కార్యాచరణ నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

  • గ్రామసభల్లో రీ సర్వే గంద రగోళం...

జగన్‌ పాలనలో భూసర్వే చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో సర్వే పూర్తిచేసినట్లు రెవెన్యూశాఖ చెబుతోంది. అయితే, అందులో పాసుపుస్తకాలు జారీ చేసిన రెండు వేల గ్రామాల పరిధిలో ఇప్పటిదాకా గ్రామసభలు జరిగాయి. ఈ గ్రామాల పరిధిలో రీసర్వేకు సంబంధించి... 2,79,148 వినతులు రెవెన్యూ శాఖకు చేరాయు. ఇందులోనూ.. భూమి విస్తీర్ణం, సరిహద్దుల కొలతల్లో భారీ తేడాలు వచ్చాయంటూ 92,551 మంది ప్రజలు ఫిర్యాదు చేశారు. వెంటనే వాటిని సరిచేసి, తమ పాత రికార్డులను పునరుద్ధరించాలని రెవెన్యూ అధికారులకు పిటిషన్లు ఇచ్చారు.

రెవెన్యూ సదస్సుల వేదికగా పరిష్కారం...ప్రభుత్వానికి ఇప్పటిదాకా వ్యక్తిగతంగా వచ్చిన ఫిర్యాదులు, విన్నపాలూ; అలాగే రీ సర్వే జరిగిన గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులను త్వరలో జరిగే రెవెన్యూ సదస్సుల వేదికగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు రెవెన్యూశాఖను ఆదేశించారు. ఈ నెలలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. త్వరలో షెడ్యూల్‌ విడుదల కానుంది. ప్రజల నుంచి ప్రభుత్వానికి వచ్చిన ప్రతి వినతికీ రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారం చూపాలని ఇప్పటికే చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దరఖాస్తుల పరిష్కారంపై థర్డ్‌పార్టీతో తనిఖీ (ఆడిట్‌)కూడా చేయించాలని ఆదేశించారు. అంటే, ప్రభుత్వానికి తాము ఇచ్చిన వినతులను ప్రభుత్వం సరిగ్గా పరిష్కరించిందా? లేదా? అనేది ప్రజలకు తెలిసేలా థర్డ్‌పార్టీ ఆడింగ్‌ చేయించనున్నారు.


  • టాప్‌ 10 జిల్లాలివే..

రెవెన్యూ విన్నపాల్లో ఎక్కువగా ఎన్టీఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, కడప, సత్యసాయి, ఏలూరు జిల్లా ల నుంచి వచ్చాయి. ప్రభుత్వ స్థాయిలో, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, విభాగాధిపతుల స్థాయిలో 51 విన్నపాలను స్వీకరించి పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌లకు పంపించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో అనకాపల్లి, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, ఏలూరు, విశాఖ, తిరుపతి, సత్యసాయి జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది, ఈ నేపఽథ్యంలో ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీసీఎల్‌ఏను ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తుల పెండింగ్‌ భారీగా ఉన్న మండలాలకు డిప్యూటీ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఆర్‌డీవోలను పంపి పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ అంశంపై ప్రతి మంగళవారం సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది.

Untitled-4 copy.jpg

Updated Date - Dec 02 , 2024 | 03:41 AM