HIV: హెచ్‌ఐవీ కేసులు తగ్గుముఖం
ABN , Publish Date - Dec 01 , 2024 | 01:01 AM
గతంతో పోలిస్తే హెచ్‌ఐవీ కేసులు తగుముఖం పట్టాయి.ఎయిడ్స్‌పై అవగాహన పెరగడంతో చికిత్స పొందేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు.

చిత్తూరు రూరల్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గతంతో పోలిస్తే హెచ్‌ఐవీ కేసులు తగుముఖం పట్టాయి.ఎయిడ్స్‌పై అవగాహన పెరగడంతో చికిత్స పొందేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు హెచ్‌ఐవీ పాజిటివ్ రోగులకు సీడీ4 కౌంట్ 250కి చేరితేనే మందులు వాడేవారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన అందరికీ ఏఆర్‌టీ మందులు వాడిస్తూ జీవితకాలాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 5952మంది రోగులుంటే వారిలో 3981మంది చిత్తూరులోని ఏఆర్‌టీ కేంద్రాల్లో మందులు తీసుకుంటున్నారు.
5952 మంది బాధితులు
జిల్లాలో గత 6సంవత్సరాల గణంకాల ప్రకారం 861850మందికి పరీక్షలు నిర్వహించగా 5952మందికి పాజిటివ్ వచ్చింది. 359152 గర్భిణులకు పరీక్షలు చేయగా 236మంది హెచ్‌ఐవీ బారిన పడినట్లు తేలింది.2006 నుంచి ఇప్పటివరకు 4623 మంది ఎయిడ్స్ రోగులు మృత్యువాత పడ్డారు.
బస్సు పాసులు ఇవ్వాలి
ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా అందించే మందుల కోసం దూర ప్రాంతం నుంచి హెచ్‌ఐవీ బాధితులు జిల్లా కేంద్రానికి వస్తుంటారు.నెలలో రెండుసార్లు మందులకోసం వస్తుండడంతో ఆర్థికంగా భారం అవుతోందని రోగులు వాపోతున్నారు.గత టీడీపీ ప్రభుత్వంలో హెచ్‌ఐవీ బాధితులకు ఆర్టీసీ బస్సుల్లో పాసులు ఇవ్వడం వల్ల ఖర్చు తగ్గేది. జగన్ అధికారంలోకి రాగానే ఉచిత పాసులను నిలిపివేశారు. తిరిగి కూటమి ప్రభుత్వం రావడంతో ఉచిత పాసులను పునవృద్దరించాలని బాధితులు కోరుతున్నారు.
పెరిగిన పింఛను
హెచ్‌ఐవీ బాధితులకు పౌష్టికాహారం తీసుకునేందుకు బాసటగా వుంటుందని గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.2 వేల పింఛన్ ఇచ్చేది.గత వైసీపీ ప్రభుత్వం అనేక రకాల సాకులు చూపి పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. కూటమి ప్రభుత్వం రాగానే వారికి పింఛను రూ. 4 వేలకు పెంచింది.ప్రస్తుతం జిల్లాలో సుమారు 2116మందికి పింఛన్లందిస్తున్నారు. అనేక మంది పింఛన్లు తీసుకునేందుకు సిగ్గుపడి దరఖాస్తు చేసుకోవడం లేదని,వారిని గుర్తించి ఇటీవల పింఛన్ల కోసం దరఖాస్తులు చేయిస్తున్నట్లు జిల్లా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి వెంకటప్రసాద్ తెలిపారు.
ఆపరేషన్లు చేయకుండా రెఫర్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ చిన్న ఆపరేషన్ చేయాలన్నా హెచ్‌ఐవీ పరీక్ష తప్పనిసరి. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే ఆపరేషన్లు చేయకుండా తిరుపతికి రెఫర్ చేసేస్తున్నారు. దీంతో హెచ్‌ఐవీ సోకిన గర్భిణులు బాగా ఇబ్బంది పడుతున్నారు.