Share News

ఫిఫా ప్రపంచ కప్: వరుసగా మూడోసారి.. ప్లే ఆఫ్స్ నుంచే నిష్క్రమించిన ఇటలీ

ABN , Publish Date - Apr 01 , 2026 | 08:43 AM

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అజేయ శక్తిగా నిలిచిన ఘనత ఇటలీ ఫుట్‌బాల్ జట్టుది! కానీ మరోసారి ఇటలీకి నిరాశ తప్పలేదు. వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచ కప్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఫిఫా ప్రపంచ కప్: వరుసగా మూడోసారి.. ప్లే ఆఫ్స్ నుంచే నిష్క్రమించిన ఇటలీ
FIFA World Cup

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అజేయ శక్తిగా నిలిచిన ఘనత ఇటలీ ఫుట్‌బాల్ జట్టుది! కానీ మరోసారి ఇటలీకి నిరాశ తప్పలేదు. వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచ కప్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన ప్రతికూల రికార్డును నమోదు చేసింది. ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం ప్లే ఆఫ్స్ ఫైనల్స్ జరిగాయి. దీంట్లో బోస్నియా హెర్జిగోవినా ఫుట్‌బాల్ జట్టుపై ఇటలీ ఘోర ఓటమిని చవిచూసింది.


బోస్నియాతో జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో ఇటలీ 4-1 తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ సారి కూడా ప్లే ఆఫ్స్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. జెనికాలోని బిలినో పోల్యే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బోస్నియా చరిత్ర సృష్టించింది. మ్యాచ్ ఆరంభంలోనే మోసీ కీన్ 15వ నిమిషంలో గోల్ చేసి ఇటలీని ఆధిక్యం దిశగా నడిపించాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. హాఫ్ టైమ్‌కు కొద్దిసేపటి ముందు అలెస్సాండ్రో బాస్టోనీ రెడ్ కార్ట్‌తో మైదానం నుంచి వీడాడు. దీంతో ఇటలీ జట్టు కేవలం 10 మంది ప్లేయర్లతోనే కొనసాగాల్సి వచ్చింది. దీనిని పూర్తిగా వినియోగించుకున్న బోస్నియా, 79వ నిమిషంలో హారిస్ టబాకోవిచ్ గోల్‌తో ఇటలీ స్కోరును సమం చేసింది. అదనపు సమయానికీ ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ పెనాల్టీలకు దారి తీసింది.


తేలిపోయారు..

పెనాల్టీ దశలో ఇటలీ పూర్తిగా తేలిపోయింది. పియో ఎస్పొసిటో తొలి పెనాల్టీని బయటకు కొట్టగా, బ్రయాన్ క్రిస్టాంటే బార్‌ను తాకించాడు. చివరకు బజ్రాక్టారెవిచ్ గోల్‌తో బోస్నియా విజయం ఖాయం అయ్యింది. గోల్‌కీపర్ దొన్నరుమా కూడా ఇటలీ జట్టును రక్షించలేకపోయాడు. మ్యాచ్ ఓటమి తర్వాత ఇటలీ కోచ్ జెన్నారో గొట్టాసో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ప్లేయర్ల కృషి, పట్టుదల అద్భుతం. కానీ ఈ ఫలితాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.


వరుసగా మూడోసారి..

ఇది ఇటలీకి వరుసగా మూడో ప్లే ఆఫ్ నిరాశ. 2018లో స్వీడన్, 2022లో నార్త్ మేసిడోనియా చేతిలో ఓడిన తర్వాత, ఇప్పుడు బోస్నియా చేతిలో మరోసారి ఓటమిని చవిచూసింది. ఇక బోస్నియా మాత్రం చరిత్ర సృష్టించింది. 2014 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తూ అభిమానుల్లో ఆనందోత్సాహాలు నింపింది. మ్యాచ్ ముగిసిన వెంటనే అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లి సంబరాలు జరుపుకున్నారు. మొత్తానికి, ఇటలీకి ఇది ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక పెద్ద షాక్‌గా నిలిచింది.


ఇవి కూడా చదవండి:

విషాదం.. ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

దూబె ఔట్ అయినప్పుడు గన్ సెలబ్రేషన్స్.. జడ్డూ ఏమన్నాడంటే?

Updated Date - Apr 01 , 2026 | 09:33 AM