Share News

మనసు చెప్పింది తిందాం!

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:53 AM

సోషల్‌ మీడియా చూస్తే చాలు... రకరకాల డైట్‌లకు సంబంధించిన వార్తలు, వీడియోలు వెల్లువెత్తుతుంటాయి.

మనసు చెప్పింది తిందాం!

సోషల్‌ మీడియా చూస్తే చాలు... రకరకాల డైట్‌లకు సంబంధించిన వార్తలు, వీడియోలు వెల్లువెత్తుతుంటాయి. కొన్ని రోజుల్లోనే మెరుపుతీగల్లా మారిపోతారనే ప్రకటనలు ఊదరగొడుతుంటాయి. అయితే ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరమని చెబుతూనే... ఒక సరికొత్త వాదన తెరమీదకు వచ్చింది. అదే... ‘ఇన్‌ట్యూటివ్‌ ఈటింగ్‌’. అంటే... ‘డైట్‌ పేరుతో నిబంధనలు కాదు... మీ మనసుకు నచ్చింది తింటూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండమ’ని చెప్పే విధానం ఇది...

  • రాత్రి పది గంటలు... రుక్మిణికి నిద్ర పట్టడం లేదు. ఆకలిగా అనిపిస్తోంది. కానీ నీళ్లు తప్ప ఏదీ తీసుకోవట్లేదు. ఆమె ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌’లో ఉంది. ఈ నియమం ప్రకారం... రాత్రి ఏడు తరవాత ఘనపదార్థాలు తినకూడదు.

  • పరీక్షలయ్యాయి. స్నేహితుల గెట్‌ టుగెదర్‌ పార్టీ. అందరూ వెరైటీ ఫుడ్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. రాజేష్‌ ‘షుగర్‌ ఫ్రీ డైట్‌’ లో ఉన్నాడు. లోపల్లోపల గులాబ్‌ జామూన్‌ తినాలన్న కోరికను కంట్రోల్‌ చేసుకుంటున్నాడు.

  • మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళ్లి పెద్ద బకెట్‌ నిండా పాప్‌కార్న్‌, దానికి తోడు కూల్‌డ్రింక్‌ లాగించి ఇంటికి వచ్చింది మేధ. ఈరోజు క్యాలరీల ఇంటేక్‌ పెరిగిందని బాధపడుతూ కూర్చుంది.


book5.jpgఇలాంటి సందర్భాలు ప్రతీ ఒక్కరికి అనుభవమే. తినాలనే కోరిక ఉన్నా... ఈ కాలంలో రకరకాల డైట్ల పేరుతో ఎక్కడిక్కడ కట్టడి చేసుకుని, కడుపు మాడ్చుకుంటున్నారు చాలామంది. కార్బ్స్‌, క్యాలరీలు, ఫ్యాట్‌, లేబుల్స్‌ జనాల్ని భయపెడుతుంటాయి. ‘కోటి విద్యలు కూటి కోసమే’ అన్నది నిజమే అయినా... భోజనం దగ్గర చాలా నియంత్రణలు, నిబంధనలు. అందుకే ఈమధ్య సరికొత్త వాదన ముందుకు వచ్చింది అదే... ‘ఇన్‌ట్యూటివ్‌ డైటింగ్‌ లేదా ఈటింగ్‌’. మనసుకు నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిద్దాం... అని చేప్పే భోజన విధానమిది. అందులో ఏముంది?


వెయిట్‌ సైకిల్‌

సాధారణంగా ఓ వయసు వచ్చాక చాలామంది తమ ఆరోగ్య స్థితిగతులను బట్టి ఉప్పు, కారం, చక్కెర విషయంలో నియమాలు పాటిస్తుంటారు. కానీ ఇప్పుడు జెన్‌ జెడ్‌... చిన్న వయసులోనే రకరకాల డైట్‌ ప్లాన్స్‌ ఫాలో అవుతోంది. ‘నేను వేగాన్‌ని.. నో అనిమల్‌ ప్రొడక్ట్స్‌ ప్లీజ్‌’, ‘ఓన్లీ ప్రొటీన్స్‌’, ‘షుగర్‌ ఫ్రీ, కార్బ్స్‌ ఫ్రీ... గ్లుటెన్‌ ఫ్రీ... ఇలా ఎన్నోరకాల డైట్స్‌ని వాళ్లు ఫాలో అవుతున్నారు. బరువు అదుపులో ఉంచుకోవడం, మజిల్‌ బిల్డ్‌ చేయడం లాంటివి వాళ్ల గోల్స్‌. అయితే కఠోరమైన డైట్లు చేసి బరువు తగ్గిన ఆరు నెలల తరవాత, తిరిగి బరువు పెరుగుతున్నారు చాలామంది. అందుకే ‘రకరకాల డైట్ల వల్ల ఈ వెయిట్‌ సైకిల్‌ని నియంత్రించలేం’ అంటున్నారు డైటీషియన్లు. పెరుగుతోన్న శాస్త్ర పరిశోధనలు కూడా ఈ విషయాన్నే నొక్కి వక్కాణిస్తున్నాయి. పైగా ఈ డైట్లు ఆకలి హార్మోన్లు, గట్‌ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి తాజాగా పోషకాహార నిపుణులు ‘డైట్‌లు వద్దు. మీ మనసు మెచ్చింది తినండి, శరీరానికి కాస్త కదలికలు అందించండి’ అని సలహాలు ఇస్తున్నారు.


అదో అనుభూతి!

మీరు గమనించారా? చక్కటి భోజనం లేదా ఇష్టమైన ఆహార పదార్థాలను తినగానే మంచి ఫీలింగ్‌ కలుగుతుంది. ఆ హాయి వల్ల శరీరం, మనసు తేలికగా అనిపిస్తాయి. ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఆ అనుభూతి అలా మనసంతా నిండుతుంది. ‘ఆ పెళ్లిలో తిన్నటువంటి భోజనం మళ్లీ ఎక్కడా కనిపించలేదు’.. అని ఇళ్లల్లో మాట్లాడుకోవడమూ వింటుంటాం. అంటే మన జీవితంలో భోజనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అదే. కానీ డైట్‌ల పేరుతో ఆహారాన్ని దూరం పెట్టడం ఎంతవరకు సమంజసం? ‘ఇన్‌ట్యూటివ్‌ డైటింగ్‌’ చెప్పే సూత్రం కూడా ఇదే. సింపుల్‌గా చెప్పాలంటే... ఆకలి, ఆహారం, మనసును సమన్వయం చేసుకొమ్మంటుందీ సూత్రం.


ప్రతి వ్యక్తీ భిన్నమే. ఒకరికి క్యారెట్‌ నచ్చుతుంది, మరొకరికి ముల్లంగి నచ్చుతుంది. కొందరికి పుచ్చకాయ తినగానే తేన్పులు మొదలవుతాయి. ఇంకొందరికి ఉల్లిఘాటుకే తుమ్ములు వస్తాయి. కాఫీ తాగగానే కొందరు కడుపులో తిప్పుతున్నట్టుగా ఫీల్‌ అవుతారు. పేరుకు ఒక జాతి మానవులమే కానీ, ఒక్కొక్కరి శరీరం ఒక్కో తీరుగా ఉంటుంది. కాబట్టి ఒక్కో ఆహారానికి ప్రతిస్పందనలూ ఒక్కోలా ఉంటాయి. అందుకే ఎవరికి నచ్చిన ఆహారాన్ని వాళ్లు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది ఈ ‘ఇన్‌ట్యూటివ్‌ డైట్‌’. మన శరీరతత్వాన్ని అర్థం చేసుకుని, ఆవిధంగా ఆహారపు అలవాట్లను రూపొందించుకోవాలన్నమాట.


‘చిన్న మెదడు’గా పేర్కొనే గట్‌లో వంద మిలియన్‌ నాడులు, ట్రిలియన్ల బ్యాక్టీరియాలు ఉంటాయట. అందుకే సరిపడని ఆహారాన్ని తీసుకుని జీర్ణవ్యవస్థను అస్తవ్యస్తం చేస్తే... మొత్తం శరీరంపై దాని ప్రభావం పడుతుంది. ‘ఫీల్‌ గుడ్‌ హార్మోన్‌’గా పిలిచే సెరోటోనిన్‌ గట్‌ ట్రాక్ట్‌లోనే ఉండడం విశేషం. ఆహారంతో శరీరానికి అంతటి అనుబంధం ఉందన్నమాట. కాబట్టి ఆనందం కలిగించే ఆహారాన్ని తినకుండా కట్టడి చేసుకోవడం వల్ల కలిగే పరిణామాలు... దీర్ఘకాలిక ఆరోగ్యానికి మంచిది కాదన్నది డైటీషియన్ల కొత్త తర్కం.

అంతే కాదు... ఏ వేళలో అయినా భోజనం అంటే మనసూ, శరీరమూ ఆనందంగా పళ్లెం ముందు కూర్చోవాలి. కానీ డైట్‌ల వల్ల ప్రయత్నపూర్వకంగా మనకు ఇష్టం లేని, పదార్థాలను బలవంతంగా తింటున్నాం. దాని వల్ల ఆరోగ్యానికి ఉపయోగాల కన్నా హాని ఎక్కువగా జరుగుతుందని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


అర్థం చేసుకుంటూ...

ప్రస్తుతం ‘ఇన్‌ట్యూటివ్‌ ఈటింగ్‌’ చుట్టే ప్రపంచం మొత్తం తిరుగుతోంది. విశేషమేమిటంటే... సోషల్‌ మీడియాలో ‘ఇన్‌ట్యూటివ్‌ ఈటింగ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో రెండు మిలియన్లకు మించిన పోస్టులు ఇన్‌స్టాలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ వివిధ ఆహారాలు, వాటికి సంబంధించిన అధ్యయనాలు, నచ్చిన ఆహార పదార్థం తినడం వల్ల కలిగే పరిణామాలు, ఆకలి గురించిన విషయాలు తెలియజేసేవే.


ప్రతీ ఒక్కరూ సమయం ప్రకారం తింటున్నాం అనే క్రమశిక్షణతోనే కాకుండా, ఏ వేళల్లో ఆకలి వేస్తుంది? అప్పుడు ఏ పదార్థాలను తీసుకుంటున్నాం? ఆ తరవాత కలిగే అనుభూతి, కడుపులో జరిగే మార్పులను అంచనా వేసుకుంటూ డైరీలాంటిది రాసుకోవడం మంచిది. అప్పుడు ఎలాంటి పదార్థాలు మనకు సరైనవి అనే అవగాహన వస్తుంది. మనకోసమే ప్రత్యేకంగా ఓ పుస్తకాన్ని రాసుకున్నట్టు అవుతుంది. ఇదో ‘సెల్ఫ్‌ కేర్‌ డైరీ’. మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకుని రాసుకున్న డైరీ. దీని ప్రకారం ఎంత కావాలో అంతే తింటాం. పైగా నోరూరించే, నచ్చిన పదార్థాలనే తింటున్నాం కాబట్టి... కాసేపటికి మనసుకు తృప్తి కలిగి, మనకే ఆపేయాలన్న స్పృహ కలుగుతుంది. ఫలితంగా అతి తిండిని కట్టడి చేసి, బరువు నియంత్రణ చేసుకోగలుగుతాం. అందుకే ఈ ఆహార పద్ధతిలో జిమ్‌లకు వెళ్లి భారీ కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. తేలికపాటి నడక, యోగా లాంటివి చేస్తూ చక్కని ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.


పంచేంద్రియాల సమన్వయం

ఆకలి వేసినప్పుడు, మనకు సరిపడే ఆహారాన్ని మాత్రమే తింటున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. శరీరతత్వాన్ని అర్థం చేసుకుంటూ, పంచేంద్రియాల ఆధారంగా ప్రతీ ఒక్కరూ తమ ఫుడ్‌ జర్నీని మొదలుపెట్టాలన్నది ఇన్‌ట్యూటివ్‌ నిపుణుల సూచన.

ఆరోగ్యకరమైన జీవనంలో ఆనందమూ భాగమని జపనీయులు భావిస్తారు. అందుకే వాళ్లు తమకు నచ్చినవే చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందులో ఆహారమూ భాగమే. మనదేశంలో ఇలాంటి స్పృహ ఇప్పుడిప్పుడే మొదలయ్యింది. అయితే ఇంకా చాలామంది ‘డైట్‌’ పేరుతో తమని తాము కట్టడి చేసుకుంటూ, తమకి తామే శిక్షలు వేసుకుంటున్నారు. నచ్చనివి తింటూ లేదా నచ్చినవి అస్సలు తినకుండా ఆనందానికి దూరం అవుతున్నారు. ముందు శరీరం, మనసు హాయిగా ఉంటే... ప్రపంచమే హాయిగా ఉన్నట్టు కాదంటారా?

- డి.పి.అనురాధ


book5.3.jpgపాటించాల్సిన పది సూత్రాలు...

ప్రపంచంలోనే ప్రముఖ డైటీషియన్‌ ఎవిలిన్‌ ట్రిబోల్‌, న్యూట్రీషన్‌ థెరపిస్ట్‌ ఎలీజ్‌ రుష్‌ రాసిన ‘ఇన్‌ట్యూటివ్‌ ఈటింగ్‌’ పుస్తకంలో పది సూత్రాలను పొందుపరిచారు. ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ ఈ సూత్రాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది.

1. డైట్‌ గురించి మర్చిపోండి: ‘రోజుకు మూడు పూటలే తినాలి’, ‘కొవ్వు పదార్థాలు తినడం వల్ల బరువు పెరుగుతాం, ‘ఆరోగ్యానికి కార్బ్స్‌ మంచివి కావు’... ఇలా ఆహారానికి సంబంధించిన రకరకాల నియమాలు మనల్ని తికమకపెడుతుంటాయి. మరోవైపు ఏ డైట్‌నూ ఫాలో అవ్వలేకపోతున్నామనే అపరాధ భావమూ ఆవహిస్తుంది. అయితే ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మకుండా మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటూ ఆహారాన్ని తీసుకోవాలన్న స్పృహ అవసరం. అందుకే వివిధ రకాల డైట్‌లను మర్చిపోవాలి.


2. ఆకలిని గౌరవించండి: ‘ఇప్పుడే భోజనం చేశా... మళ్లీ అప్పుడే ఆకలేస్తోంది..’ అని అనిపిస్తే వెంటనే తినడం మంచిది. అంతేగానీ శరీరాన్ని ఎండబెట్టడం సరికాదు. ఎందుకంటే మీ శరీరం ఇంకా పోషణను కోరుకుంటోంది, అందుకే ఆకలి వేస్తోంది. మనం ఆరోగ్యంగా ఉన్నామని తెలియజేసే అంశాలలో ఆకలి కూడా ఒకటి. ఊపిరిపీల్చడం, కనురెప్పలు వాల్చడం లాంటి వాటిని మనం ఎలా సహజమైనవిగా భావిస్తామో... ఆకలి వేయడం కూడా అచ్చం అలాంటిదే.


3. ఆహారంతో శాంతి: అరటి పండా... కొవ్వు!. ఒక్క స్కూప్‌ ఐస్‌క్రీమ్‌ చాలు... ఇలా తినాలని ఉన్నా ఏదో వంకతో వాటిని దూరం పెట్టేస్తాం. సాయంత్రం ఏడు గంటల తరవాత ఏమీ తినను అనే నియమాలూ ఉంటాయి. దాంతో విపరీతమైన క్రేవింగ్స్‌ ఏర్పడతాయి. తినాలనే కోరిక పెరిగి మనసులో అశాంతి మొదవుతుంది. కాబట్టి ఇది తినకూడదు, అది తినకూడదు అని అనుకోకుండా... ఆహారంతో శాంతి చేసుకోవాలి. హెల్దీ డైట్‌లో అన్ని ఆహారాలున్నాయి. అందుకే పట్టింపులు లేకుండా తినడం వల్ల మనసు హాయిగా ఉంటుంది.

4. అవగాహన ముఖ్యం: ఇది మంచిది, అది చెడ్డది అని ఆహారంపై ఒక ముద్ర వేయకుండా, మీ శరీరానికి ఏది సరైనదో గుర్తించి ఆ ఆహారాన్ని భుజించాలి.


book5.3.jpg

5. నిండుదనం, తృప్తి వేరు వేరు: ఎలాగైనా బరువు తగ్గాలనే ఆసక్తితో ఏదో కాస్త తినేసి, గ్లాసు నీళ్లు తాగి కడుపు నింపేసుకుని... భోజనం అయిందనుకుంటే పొరపాటు. కాసేపటికి మళ్లీ తినాలని అనిపిస్తుంది. నిండుదనం శరీరానికి సంబంధించినది, తృప్తి మనసుకు సంబంధించినది. తినే ఆహారం ఎవరికైనా సరే తృప్తి కలిగించాలి. అలా లేనప్పుడు అది శరీరానికి సరైన ఆహారం కాదనే అర్థం.

6. గొప్ప అనుభూతి: సమయానికి హడావుడిగా ఏదో లాగించాం అని కాకుండా, ప్రతీ పూటా భోజనాన్ని ఓ గొప్ప అనుభూతిగా మలుచుకోవాలి. రుచికరమైన ఆహారాలన్నింటినీ నిదానంగా ఆస్వాదిస్తూ తినాలి. మనసులో హాయి తుంపరులు కురిసేలా భోజనాన్ని ముగించాలి.


7. ఫుడ్‌ ఎమోషన్స్‌: విసుగు, ఒత్తిడి, ఆందోళన, అశాంతి... ఇలాంటి ఏ సందర్భంలో అయినా మనసు ఆహారం మీదకే మళ్లుతుంది. భావోద్వేగాలతో తినడం మంచిది కాదు. ఎలాంటి మూడ్‌తో ఉన్నా కాసేపు వాటిని పక్కన పెట్టి, ఫుడ్‌ను ప్రేమతో తినాలి. ఆహారం సమస్యలను తొలగించదని అర్థం చేసుకోవాలి.

zzzz.jpg

8. శరీర తత్వాన్ని గౌరవించండి: మెరుపుతీగలా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ శరీరతత్వం ప్రకారమే ఎవరి ఆకారమైనా ఉంటుంది. ఇందులో జీన్స్‌ పాత్ర కీలకం. అయితే అన్ని రకాల శరీరతత్వాలకూ మాంచి రుచికరమైన భోజనాలు ఆరగించే హక్కు ఉంది. లావుగా ఉన్నవాళ్లు ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు.


9. కదలికలు: నడక, యోగా, నృత్యం, పరుగుల వల్ల శరీరంలో సంతోషాల పాళ్లు పెరుగుతాయి. అందుకే ప్రతీ ఒక్కరూ తమకు తోచిన విధంగా రోజులో కొంతైనా తేలికపాటి వ్యామాయాలు చేయడం మంచిది. మరీ పెద్ద పెద్ద ఎక్సర్‌సైజులు అవసరం లేదు.

10. ఆరోగ్యమే పరమావధి: సంస్కృతి, పెరిగిన వాతావరణం, ఇష్టాల ఆధారంగానే ప్రతీ ఒక్కరిలో ఆహార రుచులు ఏర్పడతాయి. అయితే ఒక్కరోజు స్వీట్‌ తినడంవల్లో లేక స్నాక్స్‌ తినడం వల్లో శరీరానికి హాని జరగదు. ప్రతీ రోజూ తింటున్న దాని మీదే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సమతుల ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి పరమావధి అన్నది మరవకూడదు.


ఎన్నో పుస్తకాలు...

book5.2.jpg‘జీవితాన్ని దొంగిలించే దొంగ డైట్‌... మీ డబ్బు, సమయం, ఆరోగ్యం, ఆనందాన్ని కూడా దొంగలిస్తుంద’ని అంటారు క్రిస్టీ హారిసన్‌. ఈమె ‘యాంటీ డైట్‌’ పుస్తక రచయిత్రి. 1995లో ఎవిలిన్‌

ట్రిబోల్‌, ఎలీజ్‌ రుష్‌ రచించిన ‘ఇన్‌ట్యూటివ్‌ ఈటింగ్‌: ఏ రెవల్యూషనరీ ప్రోగ్రామ్‌ దట్‌ వర్క్స్‌’ పుస్తకం ఈ విశేష డైట్‌కి సంబంధించిన తొలి రచన. అప్పట్లో అది పెద్ద సంచలనమే. ఆ తరవాత ఎన్నో పుస్తకాలు ఈ ఒరవడిలో వచ్చాయి. ‘ఇన్‌ట్యూటివ్‌ ఈటింగ్‌ ఫర్‌ ఎవ్రీ డే’, ‘జస్ట్‌ ఈట్‌ ఇట్‌’, ‘హెల్త్‌ ఎట్‌ ఎవ్రీ సైజ్‌’ లాంటివి ప్రముఖమైనవి. ప్రస్తుతం ‘ఇన్‌ట్యూటివ్‌ డైటీషియన్ల’ హవా కూడా నడుస్తోంది. ఒక్క న్యూయార్క్‌ సిటీలోనే రెండు వేలకు మించి సర్టిఫైడ్‌ ఇన్‌ట్యూటివ్‌ డైటీషియన్లు ఉన్నారట. అంటే ఈ కొత్త ఆహార పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ఎంత ట్రెండవుతోందోఅర్థం చేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!

ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే ‘మావిగన్‌’: ఏబీవీ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 12 , 2026 | 11:53 AM