కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:45 PM
అస్సాం గత పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను మరోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారనే నమ్మకం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
గువాహటి: అస్సాం గత పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను మరోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారనే నమ్మకం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. గోగముఖ్‌లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడుతూ, ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే అభివృద్ధి, సుస్థిరతకే పట్టంకట్టనున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
'ఈసారి ఎన్నికలు వికసిత్ భారత్ నిర్మాణానికి జరుగుతున్న ఎన్నికలు. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయంతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది' అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి హ్యాట్రిక్ పరాజయం, ఆ పార్టీ యువరాజు రాహుల్‌కు వందోసారి ఓటమి ఖాయమని చెప్పారు. మూడోసారి ప్రధానిగా తాను హ్యాట్రిక్ సాధించానని, అస్సాంలో బీజేపీని కూడా హ్యాట్రిక్ విజయంతో ప్రజలు ఆశీర్వదిస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నానని పేర్కొన్నారు.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను మోదీ ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో అస్సాంలోని 15 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతాయని, ఇంతవరకూ ఇళ్లు రాని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. పేద కుటుంబాలను కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య కల్పిస్తామన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడాతామని, ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని పేర్కొన్నారు. 126 మంది సభ్యుల అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్
విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. ఇంధన ధర రెట్టింపు