వాహనదారులకు కీలక అప్డేట్.. టోల్‌ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి..
ABN , Publish Date - Apr 01 , 2026 | 06:48 AM
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఒక కీలక అప్డేట్. ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గత నెలలోనే ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఒక కీలక అప్డేట్. ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గత నెలలోనే ప్రకటించింది. ఇకపై టోల్ రుసుములను ఫాస్టాగ్ లేదా యూపీఐ వంటి డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశంలోని అన్ని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది (Cashless toll India).
టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో నగదు రహిత విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్‌హెచ్ టోల్ ప్లాజాల్లో దాదాపు 98 శాతం చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్న నేపథ్యంలో.. జాతీయ రహదారుల టోల్ ఎకో సిస్టమ్‌ను పూర్తిగా డిజిటల్‌కు మార్చే ఉద్దేశంతో ఎన్హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. టోల్ వసూళ్లలో పారదర్శకతను పెంచడంతో పాటు వాహనాలు టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు ఆగకుండా వెళ్లేందుకు ఇది దోహదపడుతుంది (Toll plaza changes April 1).
ఒకవేళ వాహనదారుల ఫాస్టాగ్‌లో సమస్య ఉంటే, టోల్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉండే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి యూపీఐ ద్వారా తక్షణమే చెల్లింపులు చేయవచ్చు (FASTag rule update). అయితే, కొన్నిసార్లు నెట్వర్క్ సమస్యల కారణంగా యూపీఐ లావాదేవీలు కూడా ఆలస్యం కావచ్చు. అందువల్ల వాహనదారులు తమ ప్రయాణానికి ముందే ఫాస్టాగ్‌ను యాక్టివ్ చేసుకోవడం, దానిలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవడం మంచిది.
ఈ వార్తలూ చదవండి:
రిస్క్ తీసుకున్న ఫలితం.. రూ.20 లక్షలతో 3 కోట్ల సంపద సొంతం
వామ్మో.. విమానాల్లో కూడా జనాలు ఇంతేనా! ఫొటోలు వైరల్