Share News

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్.. ట్రంప్ రిమైండర్.. లైట్ తీసుకుంటున్న ఇరాన్!

ABN , Publish Date - Apr 05 , 2026 | 08:23 AM

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడం, లేదా రాజీకి రావడంపై ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పది రోజల డెడ్ లైన్ రేపటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఇరాన్ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. ట్రంప్ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటోంది.

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్..  ట్రంప్ రిమైండర్.. లైట్ తీసుకుంటున్న ఇరాన్!
Trump Issues 48 Hour Ultimatum to Iran

వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ 5: ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి 'స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్' జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య పోరు పరాకాష్టకు చేరింది. మార్చి 26న ట్రంప్ ప్రకటించిన 10 రోజుల గడువు రేపటితో (ఏప్రిల్ 6, సోమవారం) ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) వేదికగా ఇరాన్‌కు చివరి హెచ్చరిక జారీ చేశారు.

'48 గంటల్లో నరకం చూస్తారు' - ట్రంప్

శనివారం అర్ధరాత్రి ట్రంప్ చేసిన పోస్ట్ అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 'ఇరాన్‌కు ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి గానీ, లేదా హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడానికి గానీ నేను పది రోజుల గడువు ఇచ్చిన విషయం మీకు గుర్తుందా? సమయం మించిపోతోంది.. మరో 48 గంటల్లో వారిపై నరకం విరుచుకుపడనుంది. దేవుడికి మహిమ కలుగు గాక!' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రిమైండర్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఒకవేళ ఇరాన్ తలొగ్గకపోతే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, చమురు బావులు, అణు కేంద్రాలపై భారీ దాడులు చేయడానికి అమెరికా సైన్యం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


ఇరాన్ 'లైట్' తీసుకుంటోందా?

ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పైగా అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను 'నిస్సహాయతతో కూడిన మూర్ఖపు ప్రేలాపనలు'గా కొట్టిపారేసింది. ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ జనరల్ అలీ అబ్దుల్లాహి అలియాబాదీ మాట్లాడుతూ.. 'ట్రంప్ నరకం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన చర్యల వల్ల అమెరికాకే నరక ద్వారాలు తెరుచుకుంటాయి' అని హెచ్చరించారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ, తాము చర్చలకు సిద్ధమేనని, అయితే అవి సమానత్వంతో కూడినవిగా ఉండాలన్నారు. అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళిక 'అహేతుకం'గా ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు, ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని ఇరాన్‌.. ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. తాజాగా మరో రెండు అమెరికా హెలికాప్టర్లను నేలకూల్చినట్టు ప్రకటించింది. అమెరికాకు చెందిన కొన్ని లక్ష్యాలను ఛేదించామని తెలిపింది. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేస్తున్న తీరు చూస్తుంటే.. గడువు ముగిసిన తర్వాత పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందా అనే భయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు శాంతి కోసం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. ఇరుపక్షాలు నరకం చూపిస్తామంటూ సవాళ్లు విసురుకోవడం ఆందోళన కలిగిస్తోంది.


ఈ అంశంపై పోల్ క్వశ్చన్‌లో పాల్గొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:


ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 11:37 AM