Share News

నకిలీ గోల్డ్‌ బిస్కెట్లు ఇచ్చి.. అసలుతో పరారీ

ABN , Publish Date - Feb 28 , 2026 | 08:15 AM

‘ఏపీలో ప్రముఖ వ్యక్తికి పీఏని..’ అంటూ ఇన్‌స్టాలో పరిచయం చేసుకొని నగల వ్యాపారికి నకిలీ బంగారు బిస్కెట్లు అంటగట్టి ఏకంగా కిలో అసలు బంగారు ఆభరణాలతో ఉడాయించాడో ప్రబుద్ధుడు.

నకిలీ గోల్డ్‌ బిస్కెట్లు ఇచ్చి.. అసలుతో పరారీ

  • ఎత్తుకెళ్లింది కిలో బంగారు నగలు

  • విలువ రూ.1.60 కోట్లపైనే..

  • కామర్స్‌ లెక్చరర్‌ ఘరానా మోసం

  • బంజారాహిల్స్‌లో ఘటన

  • గతంలో సీఏలను బురిడీ కొట్టించి.. రూ.3.48 కోట్ల దోపిడీ

హైదరాబాద్: ‘ఏపీలో ప్రముఖ వ్యక్తికి పీఏని..’ అంటూ ఇన్‌స్టాలో పరిచయం చేసుకొని నగల వ్యాపారికి నకిలీ బంగారు బిస్కెట్లు అంటగట్టి ఏకంగా కిలో అసలు బంగారు ఆభరణాలతో ఉడాయించాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైటెక్‌సిటీ మై హోంభుజాలో నివసించే పాలకుర్తి లక్ష్మీకావ్య బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 2లో ఓ జువెలరీస్‌ దుకాణం నిర్వహిస్తోంది. కొద్దికాలం క్రితం ఇన్‌స్టా ద్వారా కాచిగూడ(Kachiguda)కు చెందిన శ్రీనాథ్‌రాఠీ అలియాస్‌ అంకిత్‌ ఆమెకు పరిచయం అయ్యాడు.


తాను పింకిరెడ్డి పీఏ అని నమ్మబలికాడు. తన యజమాని వద్ద బంగారు బిస్కెట్లు చాలా ఉన్నాయని, వాటిని తీసుకొని అందుకు సమానమైన బంగారు ఆభరణాలు ఇవ్వాలని కోరాడు. మొదట లక్ష్మీకావ్య అతని మాటలను పట్టించుకోలేదు. కానీ అతను పదే పదే మెసేజ్‌లు పెట్టడంతో ఒప్పుకొన్నది. ఈ నెల 16న ఆమె 160గ్రాముల బంగారు అభరణాలు పంపించగా.. మరుసటి రోజు శ్రీనాథ్‌ అందుకు సమానమైన బంగారు బిస్కెట్లను అందజేశాడు. ఇది లాభదాయకంగా ఉండటంతో ఆమె ఈనెల 19న, మరో 350 గ్రాముల ఆభరణాలను అందజేయగా.. శ్రీనాథ్‌ తన తండ్రి పురుషోత్తం ద్వారా బంగారు బిస్కెట్లను ఆమెకు అందజేశాడు.


city4.jpgనమ్మకం కుదిరాక ఈ నెల 25న కిలో విలువ చేసే బంగారు ఆభరణాలు ఆమె నుంచి తీసుకున్న శ్రీనాథ్‌.. తాను పనిమీద బయటకు వెళ్తున్నానని, తన వద్ద పనిచేసే కృష్ణ ద్వారా మిగిలిన బంగారు బిస్కెట్లను పంపుతున్నానని నమ్మించడుఉ. అతను చెప్పినట్టుగానే బంజారాహిల్స్‌ పార్క్‌ హయత్‌ హోటల్లో లక్ష్మీకావ్యను కలిసిన కృష్ణ బంగారు బిస్కెట్లు ఇచ్చాడు. వాటిని సరిచూసుకోగా 1.80కిలోల బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించింది. బిస్కెట్లు ఎక్కువగా ఉండటంతో అనుమానించిన ఆమె వాటిని పరిక్షీంచగా అవి నకిలీవని తేలింది. శ్రీనాథ్‌కు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ అని వచ్చింది. కృష్ణను ప్రశ్నించగా తనను నాలుగు రోజుల కోసం పనిలో పెట్టుకున్నాడని, సోమాజిగూడలో పార్క్‌ హోటల్‌లో వసతి కల్పించాడని చెప్పాడు. దీంతో శ్రీనాథ్‌ మోసాన్ని గ్రహించిన బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనాథ్‌రాఠీ, పురుషోత్తం, కృష్ణపై కేసు నమోదు చేశారు. కృష్ణను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.


గతమంతా నేరచరిత్ర..

శ్రీనాథ్‌ గురించి పోలీసులు వాకబు చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనాథ్‌రాఠీ ఐదేళ్ల క్రితం కామర్స్‌ లెక్చరర్‌గా యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించాడు. అతను చెప్పే క్లాసులకు పలువురు చార్టర్డ్‌ అకౌంటెంట్‌లు కూడా ఆకర్షితులయ్యారు. వ్యాపారాల్లో పెట్టుబడి పేరిట పలువురు చార్టర్డ్‌ అకౌంటెంట్ల నుంచి రూ.2.48 కోట్లు వసూలు చేసి ఉఢాయించాడు. దాంతో అతడిపై హైదరాబాద్‌ సీసీఎ్‌సలో కేసు నమోదైంది. రూ. 10 కోట్లు రుణం ఇప్పిస్తానని ఓ వ్యక్తి వద్ద రూ.కోటి తీసుకొని మోసం చేశాడు. ఈ వ్యవహారంలో కూడా సీసీఎస్‏లో కేసు నమోదు అయింది.


ఈ వార్తలు కూడా చదవండి:

‘రైతు భరోసా’పై మోసగించిన కాంగ్రెస్‌

కవిత విషయంలో తప్పు చేశామా?

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2026 | 08:20 AM