Share News

ఏపీ శాసనసభ, శాసనమండలి వాయిదా

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. శాసనసభ వాయిదా పడిన కొద్ది సేపటికే శాసనమండలి సైతం శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఉదయం రెండు సభలు ప్రారంభమయ్యాయి.

ఏపీ శాసనసభ, శాసనమండలి వాయిదా

అమరావతి, ఫిబ్రవరి12: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసన మండలి వాయిదా పడ్డాయి. శాసనసభ వాయిదా పడిన కొద్దిసేపటికే శాసనమండలి సైతం శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఉదయం రెండు సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు సభల్లో గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇక శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి పార్థసారథి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకానొక దశలో ఈ ఇరువురు ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. దాంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాసన మండలి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభం వేళ ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బడ్జెట్‌పై ప్రసంగించారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం 11మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో పెద్దఎత్తున వారు నినాదాలు, నిరసనలు తెలిపారు. సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వైసీపీ సభ్యులంతా వాకౌట్ చేశారు. ఇక గవర్నర్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత.. సభ వాయిదా పడింది.


గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం చర్చ జరిగింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు బుధవారం నాడు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అనుసరించి తీరు పట్ల స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లకి 11 అసెంబ్లీ సీట్లు వచ్చాయని.. అసెంబ్లీకి 11వ తేదీన వచ్చారని.. కేవలం 11 నిమిషాలసేపు సభలో వారు ఉన్నారంటూ స్పీకర్ వ్యంగ్యంగా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ

ఏపీ అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం

For More AP News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 03:25 PM