Share News

సిమెంటు, స్టీలు సరఫరాకు స్వస్తి

ABN , Publish Date - Jan 11 , 2026 | 02:25 AM

లబ్ధిదారులకు ఇకపై మెటీరియల్‌కు బదులుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో లబ్ధిదారులకు, గృహనిర్మాణ శాఖ అఽఽధికారులకు కూడా ఊరట కలిగింది.

సిమెంటు, స్టీలు సరఫరాకు  స్వస్తి
బి.కొత్తకోటలో మూతపడిన గృహనిర్మాణశాఖ గోదాం

కేంద్ర ఉత్తర్వులతో గృహ లబ్ధిదారులకు ఊరట

మదనపల్లె, జనవరి 10(ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులకు ఇకపై మెటీరియల్‌కు బదులుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో లబ్ధిదారులకు, గృహనిర్మాణ శాఖ అఽఽధికారులకు కూడా ఊరట కలిగింది. తాజా నిబంధన అతిక్రమిస్తే బిల్లులే కాదు... ఇళ్ల మంజూరునే ఆపేస్తామని తేల్చిచెప్పింది. దీంతో అధికారులు సిమెంటు, స్టీలు, ద్వారబంధాలు, కిటకీలు, ఇతర ఎలక్ర్టికల్‌ సామగ్రి సరఫరాకు స్వప్తి చెబుతున్నారు. ఇప్పటికే గోదాముల్లోని స్టాకును లబ్ధిదారులకు పంపిణీ చేసేస్తున్నారు.

జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, పీలేరు డివిజన్లలో గృహనిర్మాణశాఖకు 32 గోదాములున్నాయి. ఇవన్నీ అద్దెప్రాతిపదికన తీసుకున్నవే. నెలకు రూ.3.50లక్షల అద్దె చెల్లిస్తున్నారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రస్తుతం మండలాల్లో ఉన్న గోదాములను మూసేసి, నియోజకవర్గానికి ఒకటి ఉండేలా చూస్తున్నారు. అది కూడా అవసరం ఉన్న చోట మాత్రమే కొనసాగించాలని యోచిస్తున్నారు. రాష్ట్రంలో గోదాములకు నెలకు రూ.1.05కోట్లు, ఏటా బీమా కింద రూ.66లక్షలు చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ భారం తగ్గనుంది.

ఎందుకీ పరిస్థితి?

పుష్కరకాలంగా రాష్ట్ర ప్రభుత్వాలు పేదల గృహాల మంజూరుకు స్వస్తి చెప్పి. కేంద్రం ఇస్తున్న కోటానే తన ఖాతాలో వేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాయి. అది కూడా యూనిట్‌ విలువ రూ.1.80లక్షల నుంచి రూ.2.50లక్షలకు మించడం లేదు. వీటిలో కూడా లబ్ధిదారులకు యూనిట్‌ సొమ్ము మొత్తం ఇవ్వకుండా సిమెంటు, స్టీలు, ఇతర సామగ్రి పేరుతో బిల్లులో రూ.80వేల నుంచి రూ.90 వేలు కట్‌ చేస్తోంది. ఈ విషయాన్ని ఆడిట్‌ విభాగం గుర్తించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కేంద్రం బిల్లుకు మొత్తం యూసీ ఉండాలనే నిబంధన పెట్టింది.


వైసీపీలో కమీషన్ల కక్కుర్తి

గత వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు సిమెంటు, స్టీలుతోపాటు అదనంగా కిటికీలు, ద్వార బంధాలతో ఇతర ఎలక్ర్టికల్‌, ప్లంబర్‌ మెటీరియల్‌ అంటగట్టింది. అవి నాసిరకంగా ఉండటంతో చాలా చోట్ల లబ్ధిదారులు తీసుకోలేదు. అయినా బలవంతంగా కట్టబెట్టారు. కొందరు తీసుకోకున్నా.. బిల్లులో కోత పెట్టారు. కమీషన్ల కక్కుర్తితో ఇలా నాసిరకం సామగ్రి ఇచ్చారన్న విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. ఫలితంగా సామగ్రి ఇవ్వాలనే నిర్ణయానికే గండి పడినట్టయింది. ప్రభుత్వం ఇచ్చే సిమెంటు, స్టీలుకు, బయటి మార్కెట్‌లో లభ్యమయ్యే వాటికి ధరల్లో పెద్దగా వ్యత్యాసం కూడా లేదంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నా..పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు అందుబాటులో ఉండటంతో ముందుకు రావడంలేదు. దీంతో గోదాములో వర్షాలకు స్టాకు గడ్డ కట్టుకుపోవడం, ఇక్కడ ఇస్తున్నారు..కాదా అంటూ తీసుకెళ్లినా..చాలా మంది బయట అమ్మేస్తున్నట్లు గుర్తించారు. ఈక్రమంలో నెలాఖరుకు గోదాములన్నీ మూసేయాలని, ఎక్కడైనా ఉంటే అద్దె మీరే చెల్లించాల్సి వస్తుందని ఉత్తర్వులు అందాయి.

Updated Date - Jan 11 , 2026 | 02:25 AM