Tomato Powder: టమాటా పొడి ఇలా తయారుచేసుకోండి.. ఏ కూరలో వేసినా టేస్ట్ అదిరిపోతుంది..
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:29 AM
Tomato Powder: వెజ్ లేదా నాన్ వెజ్ ఏ వంటకానికైనా టమాటా వేస్తే ఆ రుచే వేరు. అందరూ ఎక్కువగా వాడే ఈ కూరగాయ ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఒక్కోసారేమో రేటు కొండెక్కి కూర్చొంటే.. మరోసారి ఊహించనంత చౌకగా దొరుకుతుంది. తక్కువ ధర ఉన్నప్పుడు టమాటాతో ఈ నిల్వ పొడి చేసుకుంటే ఎప్పుడైనా కూరల్లోకి వాడుకోవచ్చు..

Tomato Powder Recipe: టమాటా.. ఏ వంటకైనా ప్రత్యేక రుచి తెచ్చిపెట్టే కూరగాయ. ఇది వేయకుండా ఏం వండినా సంతృప్తిగా అనిపించదు చాలామందికి. ముఖ్యంగా భారతీయులు దాదాపు ప్రతి వంటకంలో టమాటాను అధికంగా వాడతారు. అందరూ ఎక్కువగా వాడుకునే ఈ కూరగాయ ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఏడాదిలో కొన్ని సీజన్లలో అమాంతం పెరిగిపోతుంది. కిలో వందల్లోకి చేరి సామాన్యులు కొనలేని స్థాయికి వెళుతుంది. ఇందుకు విరుద్ధంగా కొన్నిసార్లు టమాటా రేటు అతి తక్కువ ధరకే లభిస్తుంది. కిలో ఐదు, పది రూపాయలకే మార్కెట్లో దొరుకుతుంది. ఇలా చౌక ధరకు వచ్చినప్పుడు ఈ పొడి చేసుకున్నారంటే ధర పెరిగినప్పుడైనా లేదా ఇంట్లో ఏ కూరగాయలు లేని సమయాల్లో కూరలు, రసం, పప్పు, నాన్ వెజ్ ఇలా ఏ వంటకాల్లోకి అయినా వాడుకోవచ్చు. నెలల పాటు నిల్వ ఉండే టమాటా పొడిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టమాటా పొడి తయారీ విధానం :
ముందుగా తాజాగా ఉన్న టమాటాలను తీసుకోండి. మరీ పచ్చిగా ఉండకూడదు. అలాగని బాగా పండిపోయిన టమాటాలను ఎంచుకోకండి. మధ్యస్థంగా అంటే కాస్త దోరగా, పండినా మెత్తబడని టమాటాలను తీసుకోండి.
టమాటాలను నీళ్లలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత తడిలేకుండా చూసుకోవాలి.
శుభ్రమైన బట్టతో ప్రతి టమాటాను జాగ్రత్తగా తుడిచి పొడిగా ఉన్న వస్త్రంపై వేసి తేమ పోయేవరకూ ఆరనివ్వాలి.
తడి ఆరిపోయాక టమాటాలను ముక్కలుగా తరిగి ఎండలో ఎండబెట్టాలి. రాత్రవగానే ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఉంచాలి.
ఇలా ఈ టమాటా ముక్కలు పూర్తిగా ఒరుగుల్లా ఎండిపోయేవరకూ ఎండలో ఎండబెట్టాలి. టమాటా ముక్కను పట్టుకుని విరిచి చూస్తే మీకే అర్థమవుతుంది.
టమాటా ముక్కలు ఎండిపోయాయని నిర్ధారణ అయ్యాక వీటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా అయ్యేవరకూ గ్రైండ్ చేయండి.
మిక్సీలో ఉన్న పొడిని ఒక తేమ లేని గాలి చొరబడని గాజు సీసాలోకి తీసుకుని మూత పెట్టండి.
కొన్ని నెలలపాటు నిల్వ ఉండగలిగే ఈ టమాటా పొడిని సాధారణ టమాటాల్లాగే అన్ని రకాల వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు. టమాటా ధర అధికంగా ఉన్నప్పుడు ఈ పొడి మీకెన్నో విధాలుగా పనికొస్తుంది. ఇంకెందుకాలస్యం వెంటనే మీరు ఈ టమాటా పొడిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి.
Read Also : Magic Masala Recipe : నిమిషాల్లో తయారయ్యే మ్యాజిక్ మసాలా.. ఏ రెసిపీ అయినా టేస్ట్ అదిరిపోద్ది..