vantalu Tips : ఈ చిట్కాలతో..కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని ఈజీగా వేరుచేయచ్చు..
ABN , Publish Date - Jan 07 , 2025 | 10:03 AM
కొబ్బరికాయలో నుంచి కొబ్బరి చిప్పని వేరు చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలోనే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని నీట్‌గా విడదీయవచ్చు...

కూరలు, పచ్చళ్ల తయారీలో వాడే పదార్థాల్లో కొబ్బరి లోపిస్తే ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మాంసాహారం, శాఖాహారం ఏ రెసిపీకి వాడే మసాలాలోనైనా కొబ్బరి తప్పనిసరిగా వాడుతుంటారు. నిజానికి ఎండు కొబ్బరి కంటే తాజాగా ఉండే పచ్చి కొబ్బరి వంటకాలకు అదనపు రుచిని జోడిస్తుంది. అందుకని గృహిణులు ఇంట్లో పూజ కోసం వాడిన కొబ్బరిని వంటతయారీ కోసం తరచూ వినియోగిస్తుంటారు. టేస్ట్ సంగతి పక్కన పెడితే కొబ్బరికాయలో నుంచి కొబ్బరి చిప్పని వారికి వేరు చేయడం పెద్ద సవాలే. గట్టిగా ఉన్న పెంకును పగులగొట్టేందుకు రాళ్లు, సుత్తులు వంటి బరువైన పరికరాలతో పెద్ద యుద్ధమే చేస్తారు. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఇన్ని ప్రయోగాల తర్వాత కొబ్బరి చితికిపోవడమో, ముక్కలు ముక్కలుగా అయిపోవడమో జరుగుతుంది. ఇంత కష్టపడనక్కర లేకుండా ఈ కింది చిట్కాలు ఫాలో అయితే చిటికెలోనే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని నీట్‌గా విడదీయవచ్చు.
వంట త్వరగా అయిపోవాలంటే కిచెన్ చిట్కాలు తెలుసుండాలి. లేకపోతే గంటల తరబడి వంటగదిలోనే గడపాల్సి వస్తుంది. వంటల్లో కూరగాయలు తరిగే విధానం, తగిన మోతాదులో ఉప్పు వేయడం తెలిస్తేనే ఆహారం రుచిగా ఉంటుంది. ఏ పదార్థానికి ఎంత కంటెంట్‌లో మసాలా వేయాలి అన్నది కూడా తప్పకుండా తెలిసుండాలి. ఏదో వేశాం అన్నట్లు కొలత లేకుండా మసాలా దినుసులు, ఉప్పు కారాలు వేస్తే వంట నోట్లో పెట్టుకోలేనట్లుగా తయారవుతుంది. ఏ ఒక్క ఇంగ్రిడియెంట్ ఎక్కువ లేదా తక్కువైనా అనుకున్న టేస్ట్ రాదు. అందుకే మంచి టేస్ట్ కోసం కొబ్బరిని తప్పకుండా వాడటం చాలామందికి అలవాటు. ఈ పద్ధతులు పాటించి మీకెంతో ఇష్టమైన కోకోనట్ రైస్, చట్నీలు సులువుగా చేసేయండి.
1. కొబ్బరికాయ చుట్టూ ఉన్న పీచును తీసేసి 30 నుంచి 40 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత ఏదైనా బరువైన సుత్తి లేదా రాయి తీసుకుని కొబ్బరికాయను మధ్యలో పగులగొట్టండి. అప్పుడు సులువుగా పెంకు నుంచి కొబ్బరి చిప్ప విడిపోతుంది.
2. ఒకవేళ ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే కొబ్బరికాయను అరగంటపాటు వేడినీళ్లలో ఉంచి పగులగొడితే ముక్కలు కాకుండానే కొబ్బరి సులువుగా వేరవుతుంది.
3. పై 2 రెండు పద్ధతుల్లో కుదరకపోతే ఇలా కూడా చేయవచ్చు. కొబ్బరికాయను స్టవ్ మీద పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా కాల్చండి. ఇలా చేసినా కొబ్బరిని ఈజీగా తొలగించవచ్చు.
4. మీ ఇంట్లో ఓవెన్ ఉంటే ఈ విధంగా ట్రై చేసినా ఫలితముంటుంది. ముందుగా కొబ్బరి కింద ఉన్న కళ్లకు రంధ్రం చేసి నీళ్లు తీసేయండి. ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్ కొబ్బరిని బేకింగ్ షీట్ మీద ఉంచండి. కనీసం 10-15 నిమిషాలు కాల్చండి. ఇలా చేస్తే వేడి వల్ల షెల్‌పై పగుళ్లు ఏర్పడాయి. చల్లబడిన తర్వాత సుత్తి లేదా బరువైన వస్తువుతో కొబ్బరిని నొక్కగానే పెంకు, కొబ్బరి తేలికగా వేరవుతాయి.