Shadnagar: ఆన్‌లైన్ గేమ్‌కు ఉసిగొల్పి డబ్బులు పోగొట్టాడని స్నేహితుడిని హత్యచేసిన యువకుడు
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:07 AM
ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు, తన స్నేహితుడిని హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నిందితుడి అరెస్టు.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ జూదంలో తాను లక్షల్లో డబ్బు కోల్పోయినందుకు స్నేహితుడే కారణం అని అతడిని నిర్ధాక్షిణ్యంగా చంపాడో యువకుడు. ఈ మేరకు ఈ నెల 12న రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటనకు సంబంధించి కేసును పోలీసులు ఛేదించారు. హతుడిని ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం దేవులపురం గ్రామానికి చెందిన కిలరి సాయి రాహుల్ (23)గా గుర్తించారు. సాయి రాహుల్, అదే గ్రామానికి చెందిన శంకమురి వెంకటేశ్ స్నేహితులు. ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. సాయిరాహుల్ నిరుడు వెంకటేశ్‌ను ‘లెవన్ విన్నర్ ఆన్‌లైన్ క్యాసినో గేమ్’ను చూపించి ప్రోత్సహించాడు. అందులో డబ్బులు పెట్టిన వెంకటేశ్ దాదాపు రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. వెంకటేశ్ వద్ద మరో రూ.3 లక్షలు ఉన్నట్లు గుర్తించిన సాయిరాహుల్ మరోసారి బెట్టింగ్ పెడితే పోయిన డబ్బులన్నీ వస్తాయని ఆశ పెట్టాడు. చెప్పినట్లే చేసిన వెంకటేశ్.. ఆ డబ్బులూ పోగొట్టుకున్నాడు. డబ్బులొస్తాయని చెబితేనే రూ.18 లక్షలు పెట్టి పోగొట్టుకున్నానని.. అందుకు సాయి రాహులే కారణం అని అతడితో వెంకటేశ్ గొడవ పెట్టుకున్నాడు. అయితే.. నిర్ల్యక్షంగా మాట్లాడిన సాయి రాహుల్.. వెంకటేశ్‌ను చంపేస్తాననీ బెదిరించాడు.
దీన్ని మనసులో పెట్టుకున్న వెంకటేశ్ తన స్నేహితులకి జరిగిన విషయం చెప్పి కుత్బులాపూర్‌లో మూడు కత్తులు కొన్నాడు. ఈ నెల 12న అర్ధరాత్రి రాహుల్‌ను తన కారులో ఎక్కించుకొని ఫరూక్‌నగర్ మండలం లింగారెడ్డి గూడసమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగారు. అనంతరం వెంకటేశ్, అతడి స్నేహితులు.. సాయి రాహుల్‌ను గొంతుపై, కడుపులో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసి పరారయ్యారు. షాద్‌నగర్ , ఎస్‌వోటీ పోలీసులు నిందితుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వెంకటేశ్‌కు సహకరించిన అతడి స్నేహితులు ఐదుగురిని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.