Suryapet: ఆన్‌లైన్ బెట్టింగ్.. యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jun 26 , 2025 | 03:42 AM
అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.15లక్షలు పొగొట్టుకుని ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి తట్టుకోలేక సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అర్వపల్లి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.15లక్షలు పొగొట్టుకుని ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి తట్టుకోలేక సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బొల్లంపల్లికి చెందిన వంగాల సత్తయ్య చిన్న కొడుకు సుకుమార్(28) అవివాహితుడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన సుకుమార్ దానిని మానేసి.. మూడు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి ఉద్యోగ వేటలో ఉన్నాడు. బొల్లంపల్లి శివాలయంలో పండుగ సందర్భంగా ఐదు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు.
అయితే, బెంగళూరులో ఉద్యోగం చేసిన సమయంలో పలు సంస్థల నుంచి 15 లక్షల వరకు అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఫైనాన్స్ సంస్థల నుంచి ఒత్తిడి అధికమవ్వడంతో ఒత్తిడిలో ఉన్న సుకుమార్ బుధవారం తెల్లవారుజామున తమ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ‘నా సొంతం కోసం అప్పులు చేశా. అప్పులతో నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదు. అప్పుల ఒత్తిడి ఎక్కువై చనిపోతున్నా’ అని సుకుమార్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.