Yadadri Bhuvanagiri: నేను కలెక్టర్‌ను.. నల్లాల్లో నీళ్లు వస్తున్నాయా?
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:40 AM
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం తెల్లవారుజామున ఐదున్నరకు భువనగిరి పట్టణంలో బస్తీ పర్యటన చేశారు.

బుధవారం తెల్లవారు జామున భువనగిరిలో కలెక్టర్ పర్యటన
స్థానికుల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి ఆదేశాలు
భువనగిరి టౌన్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం తెల్లవారుజామున ఐదున్నరకు భువనగిరి పట్టణంలో బస్తీ పర్యటన చేశారు. మొదట ఏడో వార్డుకి వెళ్లిన ఆయన.. స్థానికులను నిద్రలేపి ‘‘నేను జిల్లా కలెక్టర్‌ను.. ఇప్పుడే నిద్ర లేస్తున్నారా.. నల్లాల్లో సరిపడా తాగునీళ్లు వస్తున్నాయా.. మురుగు కాలువలను, రోడ్లు పారిశుధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నారా’’ అని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పర్యటిస్తూ పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. సకాలంలో విధులకు హాజరుకావాలంటూ బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు.
తనకు గ్యాస్ సబ్సిడీ రావడం లేదని స్థానికుడు ఫిర్యాదు చేయగా కలెక్టర్ అక్కడినుంచే సివిల్ సప్లయ్ అధికారులకు ఫోన్ చేసి లబ్ధిదారుకు గ్యాస్ సబ్సిడీ అందేలా చూడాలని ఆదేశించారు. అలాగే 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న వారందరికీ గృహజ్యోతి వర్తించేలా చర్యలు చేపట్టాలంటూ అక్కడి నుంచే ట్రాన్స్‌కో ఎస్‌ఈకి వాట్సా్‌పలో ఆదేశాలు జారీచేశారు. మహిళల అభ్యర్థన మేరకు నీటి ట్యాంకును నిర్మించాలంటూ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పర్యటన రెండున్నర గంటలపాటు సాగింది.