Share News

Nirmal: ఎడారుల్లో అసువులు తీస్తున్న గుల్ఫాం కల్తీ కల్లు

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:42 AM

గుల్ఫాం కల్తీ కల్లుకు బానిసైన భర్త ఇంటికి దూరంగా ఉన్నా ఫర్వాలేదు.. ఎంతోకొంత సంపాదించి కుటుంబానికి అండగా నిలబడితే చాలనుకుంది నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌..

Nirmal: ఎడారుల్లో అసువులు తీస్తున్న గుల్ఫాం కల్తీ కల్లు

కల్లు లభించక దుబాయ్‌, యూఏఈలో మరణిస్తున్న తెలంగాణ వాసులు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గుల్ఫాం కల్తీ కల్లుకు బానిసైన భర్త ఇంటికి దూరంగా ఉన్నా ఫర్వాలేదు.. ఎంతోకొంత సంపాదించి కుటుంబానికి అండగా నిలబడితే చాలనుకుంది నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం తొంబర్ని గ్రామానికి చెందిన 23 ఏళ్ల బోగేడమీది ప్రమీల. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో తన భర్త సంతో్‌షను జూన్‌ 22న దుబాయ్‌కు పంపింది. గుల్ఫాం కల్తీ కల్లుకు బానిసైన సంతోష్‌ దుబాయ్‌ చేరుకున్న కొన్ని గంటలకే విపరీతంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. గుల్ఫాం కల్లు మత్తు కోసం తపించిపోయి, అది దొరక్క.. ఆ మరుసటి రోజే తాను బస చేసిన గది నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. తిరిగి జూన్‌ 27న ఓ చోట శవంగా దొరికాడు. సంతోష్‌ మృతదేహం జూలై 6న హైదరాబాద్‌ చేరుకుంది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టు అయ్యింది ప్రమీల పరిస్థితి. ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన భర్త రెండు వారాల తర్వాత విగతజీవిగా తిరిగి రావడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇది కేవలం ప్రమీలకు మాత్రమే పరిమితమైన బాధ కాదు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రమీల లాంటి చాలామంది మహిళలను వితంతవులుగా మారుస్తున్న తెలంగాణ గుల్ఫాం కల్తీ కల్లు చాలా కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. ప్రాణాంతకమైన ఆల్ర్ఫాజోలం, క్లోరోఫాం, డైజోఫాంతోపాటు క్రిమిసంహారక మందుల్లో వాడే ముడి పదార్థాలను నీళ్లలో కలిపి తయారు చేసిన పానీయాన్ని ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కల్లుగా విక్రయిస్తుంటారు. గుల్ఫాం కల్లుగా పిలిచే ఈ కల్లును సేవించిన వారు దానికి బానిసలు అవుతున్నారు. అది లేకపోతే ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు. నిజానికి, దుబాయ్‌లో చట్టబద్ధంగా మద్యం లభిస్తుంది. కానీ, గుల్ఫాం కల్లుకు అలవాటు పడిన వారికి మరే మద్యం రుచించదు. దీంతో కల్తీ కల్లుకు బానిసలైన వారిలో చాలామంది దుబాయ్‌ వచ్చిన మరుసటి రోజే కనిపించకుండా పోయి శవాలుగానో లేదా మతిస్థిమితం కోల్పోయిన వారిగానో తేలుతున్నారు.


పెరుగుతున్న కేసులు

గుల్ఫాం కల్లు వ్యసనపరుల కేసులు గల్ఫ్‌ దేశాల్లో క్రమంగా పెరుగుతున్నాయి. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలానికి చెందిన అరవింద్‌ అనే గిరిజనుడు కల్తీ కల్లు దొరక్క దుబాయ్‌ వచ్చిన మూడురోజులకే పిచ్చిగా అరుస్తూ రోడ్డుపై తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. అరవింద్‌ కొద్ది నెలలుగా దుబాయ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రీ గ్రామానికి చెందిన నడిపోళ్ల శ్రీనివా్‌సది అదేకథ. శ్రీనివాస్‌ గాయాలతో రోడ్డుపై పడి ఉండగా గుర్తించిన దుబాయ్‌ పోలీసులు అతనికి చికిత్స చేయించి స్వదేశానికి పంపించారు. ఇక, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలానికి చెందిన బట్టు నాగార్జున అయితే రెండు నెలలుగా ఆచూకీ లేకుండా పోయాడు. తెలంగాణ గుల్ఫాం కల్లు కేసులు యూఏఈలో అధికమవుతున్నాయని అబుదాబీకి చెందిన సామాజిక సేవకుడు నరేందర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Also Read:

కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..

మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 02:43 AM