Singer Madhupriya: వివాదంలో సింగర్ మధుప్రియ.. అసలు కారణమిదే
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:38 PM
Singer Madhupriya: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో గాయని మధుప్రియ పాట షూటింగ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.

జయశంకర్ భూపాలపల్లి : ఏపీలోని శ్రీకాళహస్తి కాలభైరవ స్వామి ఆలయంలో రెండేళ్ల క్రితం ప్రైవేట్ ఆల్బమ్‌కు చెందిన ఓ పాటను చిత్రీకరించి ప్రముఖ సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సింగర్ మధుప్రియ (Madhu Priya) కూడా అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో మధుప్రియపై ఓ ప్రైవేట్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ విషయంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాళేశ్వర ఆలయంలో ఏ మాత్రం ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతించరు.. అలాంటిది మధుప్రియ బృందం ఏకంగా గర్భగుడిలోకి ఎలా వెళ్లారనే ప్రశ్నలు ఇప్పుడు తొలుస్తున్నాయి. గర్భగుడిలోకి వెళ్లి ఎలా చిత్రీకరించారని భక్తులు ఆలయ సిబ్బందిని నిలదీస్తున్నారు. తమ మనోభావాలను మధుప్రియ, ఆలయ అధికారులు దెబ్బతీశారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధుప్రియ టీం రాష్ట్ర దేవాదాయ శాఖ అనుమతితోనే ఆలయంలో చిత్రీకరించారా? లేదా స్థానికంగా ఉండే గుడి సిబ్బందిని ఒప్పించి పాట తీసుకున్నారా..? అనే ప్రశ్నలు ఇప్పుడు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి.
అధికారులు ఏమన్నారంటే..
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో అపచారంపై అధికారులు స్పందించారు. దేవాదాయ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రకటన ద్వారా ఆలయ ఈవో వివరణ ఇచ్చారు. గాయని మధుప్రియ పాట షూటింగ్ చేసుకునేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. విధుల్లో ఉన్న పూజారికి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. కాళేశ్వరం గర్భగుడిలో గాయని మధుప్రియ పాట చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఏబీఎన్‌లో కథనం ప్రసారంపై అధికారులు స్పందించారు.