KTR: రేవంత్ ఇంటి పేరు అనుముల కాదు అనకొండ...
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:56 PM
బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే రిజర్వేషన్ల డ్రామా ఆడారని సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. బీసీలకు ముఖ్యమంత్రి క్షమాపన చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.
వరంగల్, నవంబర్ 26: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ అవినీతి అనకొండ అని అంటూ వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో పర్యటిస్తున్న కేటీఆర్.. సంగెం మండలంలోని టెక్స్ట్ టైల్ పార్క్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ ఇంటి పేరు అనుముల కాదని అనకొండ అంటూ మండిపడ్డారు. ఆయన అన్నదమ్ములు ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందన్నారు.
బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే రిజర్వేషన్ల డ్రామా ఆడారని.. బీసీలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ విజన్‌కు కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ నిదర్శనమని చెప్పుకొచ్చారు. నేతన్నలకు ఆలంబనగా నిలిచిన జిల్లా ఓరుగల్లు అని అన్నారు. నేతన్నలు సూరత్, బీవండి లాంటి ప్రాంతాలకు వలసపోకుండా ఉండేందుకు కేసీఆర్ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎనిమిదేళ్ల కిందట దీన్ని ప్రారంభించామని.. కైటెక్స్, యంగ్ వన్, గణేశా కంపెనీలు 30 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని అన్నారు. ఈ రెండేళ్లు ఇక్కడ అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని తెలిపారు.
కేఎమ్‌టీపీ.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అని.. దీన్ని కేంద్రం స్ఫూర్తిగా తీసుకుని పీఎం మిత్ర తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ పాటిస్తుంది.. దేశం అనుసరిస్తోంది అనడానికి ఇది నిదర్శనమని వెల్లడించారు. ఎవరి ప్రయోజనాల కోసం 27 మున్సిపాలిటీలను హైదరాబాద్‌లో కలిపారని మాజీ మంత్రి ప్రశ్నించారు. రైతుల దగ్గర తక్కువ ధరకి తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని లక్షల ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్ తీసుకొచ్చారని మండిపడ్డారు. 5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతూ రేవంత్ తన అన్నదమ్ముళ్ళ కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రజా అవసరాల కోసం ఆ ల్యాండ్ ఉపయోగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మోడల్.. రాహుల్ మోడల్ అంటూ భజన చేస్తున్నారు తప్పా ఏం లేదని కేటీఆర్ కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో సఫ్రాన్ కొత్త సెంటర్.. తెలంగాణ వృద్ధికి మైలురాయన్న సీఎం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నవీన్ యాదవ్
Read Latest Telangana News And Telugu News