Share News

Kota Srinivasa Rao: కోట తెరాభినిష్క్రమణం

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:04 AM

హాస్యమైనా.. హడలెత్తించే విలనీ అయినా.. భావోద్వేగమైనా.. భయపెట్టే డైలాగైనా.. పాత్ర ఏదైనా, మాండలికమేదైనా.. వెటకారం, కపటత్వం.. మంచితనం, మమకారం..

Kota Srinivasa Rao: కోట తెరాభినిష్క్రమణం

అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుది శ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు

  • అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విలక్షణ నటుడు

  • 4 దశాబ్దాల సినీ ప్రయాణం.. 750కి పైగా చిత్రాల్లో నటన

  • కడసారి చూపునకు తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

  • ఆయన పార్థివ దేహాన్ని చూసి కన్నీటిపర్యంతమైన తోటి నటులు

  • ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురి నివాళులు

  • కోట భౌతికకాయానికి చంద్రబాబు, పవన్‌ పుష్పాంజలి

  • జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు

  • కోటకు 9 నంది అవార్డులు.. 2015లో పద్మశ్రీ పురస్కారం

హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌/రాయదుర్గం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): హాస్యమైనా.. హడలెత్తించే విలనీ అయినా.. భావోద్వేగమైనా.. భయపెట్టే డైలాగైనా.. పాత్ర ఏదైనా, మాండలికమేదైనా.. వెటకారం, కపటత్వం.. మంచితనం, మమకారం.. అన్నిటినీ అలవోకగా పలికించే విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు! రంగస్థలంపై తన నటజీవితాన్ని ప్రారంభించిన ఆయన.. వెండితెరపై నాలుగున్నర దశాబ్దాలపాటు వెలిగి.. ఎనిమిది పదుల వయసులో జీవన రంగస్థలం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు! దాదాపు 750 సినిమాల్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కోట.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున.. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు! కోట శ్రీనివాసరావుకు భార్య రుక్మిణి, కుమార్తెలు పావని, పల్లవి ఉన్నారు. ఆయన కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్‌ కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో.. పెద్ద మనవడు శ్రీనివాస్‌.. అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫిలింనగర్‌లోని కోట నివాసం నుంచి అభిమానులు, కుటుంబసభ్యుల కన్నీటి వీడ్కోలు నడుమ అంతిమ యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యకియ్రలు ముగిశాయి. అంత్యక్రియల్లో సినీనటులు అలీ, కోట శంకరరావు, మాదాల రవితో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.

8.jpg


కృష్ణమ్మ ఒడిలో పెరిగి.. కళామతల్లి సేవలో ఎదిగి

కోట శ్రీనివాసరావు 1942 జూలై 10వ తేదీన.. కృష్ణా జిల్లా కంకిపాడులో సీతారామాంజనేయులు, సుశీల దంపతులకు జన్మించారు. కంకిపాడు పరిసర ప్రాంతాల ప్రజలకు సీతారామాంజనేయులు ఓ గొప్ప వైద్యుడిగా తెలుసు. ఆయనకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో రెండవ కుమారుడు కోట శ్రీనివాసరావు. కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో కోటచదువుకున్నారు. కళాశాలలో చదుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. అనంతరం కంకిపాడు బస్టాండ్‌ సమీపంలోని స్టేట్‌ బ్యాంకులో చేరి కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశారు. బ్యాంకు ఉద్యోగం చేస్తున్నా.. నటనపై ఆసక్తితో నాటకాలలో వేషాలు వేస్తూ ఉండేవారు. నిజానికి తాను కూడా తన తండ్రిలాగానే వైద్యుణ్ని కావాలనుకున్నానని.. కానీ, ప్రవేశ పరీక్షలో రెండు శాతం మార్కులు తక్కువగా రావడంతో ఆ అవకాశాన్ని కోల్పోయి, మామూలు గ్రాడ్యుయేట్‌ని అయ్యానని చెప్పేవారాయన. ఈ క్రమంలోనే.. ఒకసారి హైదరాబాద్‌లో ఆయన తన బృందంతో ‘ప్రాణం ఖరీదు’ నాటిక వేస్తే.. ప్రముఖ దర్శకుడు క్రాంతి కుమార్‌ చూసి దాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. ఆ సినిమాలో రావుగోపాలరావు వేసిన పాత్ర.. స్టేజీ మీద కోట శ్రీనివాసరావే వేసేవారు. ఆ నాటిక స్ఫూర్తితో తీస్తున్న సినిమా కాబట్టి అందులోని పాత్రధారులందరికీ సినిమాలో కూడా చిన్నచిన్న పాత్రలు ఇవ్వాలని క్రాంతి కుమార్‌ అనుకున్నారు. అలా కోట ఆ సినిమాలో నాలుగైదు సీన్లున్న చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత.. తెలంగాణ ప్రాంతంలో బడుగుల జీవితాలపై యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన ‘కుక్క’ అనే నాటికను నటుడు నారాయణరావు సినిమాగా తీశారు. అందులో కోట ‘దొర’ పాత్ర వేశారు. 1982లో.. ‘మీరైతే ఏం చేస్తారు?’ అనే నాటికలో కోట నటన చూసిన దర్శకుడు టి.కృష్ణ ఆయనకు ‘వందేమాతరం’ సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు. అలా చిన్నా చితకా వేషాలు వేస్తున్న కోట శ్రీనివాసరావు సిసలైన సత్తాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.. ‘ప్రతిఘటన’ సినిమా. అందులో మినిస్టర్‌ కాశయ్యగా తెలంగాణ యాసలో అదరగొట్టిన కోట బలమైన ముద్ర వేశారు. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, గిరిబాబు, గొల్లపూడి వంటి మేటి విలన్లు ఉన్న రోజులు కావడంతో ఆయనకు పెద్ద హీరోల సినిమాల్లో విలన్‌ పాత్రలు దొరికేవి కావు. అలా సాగిపోతున్న ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా వచ్చింది.. ‘అహ నా పెళ్లంట’ సినిమా. అందులో పిసినారి లక్ష్మీపతి పాత్రకు కోట శ్రీనివాసరావును దర్శకుడు జంధ్యాల ఏరికోరి ఎంచుకున్నారు. క్రమంగా.. అటు విలనీ, ఇటు కామెడీ.. మధ్యమధ్యలో కామెడీవిలనీ చేస్తూ కోట శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు. ఒకటా రెండా.. వందలాది చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ప్రతిఘటన హిందీ రీమేక్‌లో, సర్కార్‌ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌తో నటించి.. హిందీ ప్రేక్షకులకు కూడా ఆయన పరిచయమయ్యారు. 1999లో అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసిన కోట.. బీజేపీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ప్రత్యర్థి ఐలాపురం వెంకయ్యపై 57వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. విజయవాడకు మొదటి ఫ్లైఓవర్‌గా నిలిచే అజిత్‌సింగ్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం ఆయన హయాంలోనే జరిగింది. 2004 తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చిరంజీవితోపాటే మొదలైన కోట సినీ కెరీర్‌.. ఆయన సోదరుడైన పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’తో ముగియడం గమనార్హం.


తరలి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు..

కోట శ్రీనివాస్‌ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది. ఆయన్ను చివరిసారి చూసి నివాళులర్పించేందుకు తారాలోకమంతా ఆయన ఇంటికి తరలివచ్చింది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయన ఇంటికి చేరుకుని పుష్పాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. కోట శ్రీనివాసరావు మృతి పట్ల ‘ఎక్స్‌’ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని.. సామాజిక సేవలో కూడా ముందుండేవారని, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు కోట ఇంటికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. కోట మృతి పట్ల.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కోట శ్రీనివాసరావు మృతి చాలా బాధాకరమని.. ఎమ్మెల్యేగా ఆయన గొప్పగా ప్రజాసేవ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు తెలుగు సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కోట ఇక లేరన్న వార్త విని చాలా బాధపడ్డానని.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌.. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కోట మృతి సినీరంగానికి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి పేర్కొన్నారు.


పుత్రశోకం.. అలా చేస్తే దిష్టి పోయేదేమో!

9.jpg

వందలాది సినిమాల్లో నటించి ఎంతో ఖ్యాతి ఆర్జించిన కోట శ్రీనివాసరావును కొన్ని విషాదాలు వెంటాడాయి. ముఖ్యంగా కుమారుడు ప్రసాద్‌ మరణం ఆయన్ను బాగా కుంగదీసింది. కుమారుడి మృతిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోట భావోద్వేగానికి గురయ్యారు. ‘‘గాయం-2 సినిమాలో నేను, ప్రసాద్‌ కలిసి పనిచేశాం. ప్రసాద్‌కు అదే తొలి సినిమా. అందులో ప్రసాద్‌ చనిపోయే సన్నివేశం ఉంది. ఆ సీన్‌ తీయొద్దని, అది చూడడం నావల్ల కాదని చిత్ర బ్బందానికి చెప్పా. అది జగపతిబాబు అర్థం చేసుకుని నా డూప్‌తో ఆ సన్నివేశం తీయించారు. ఆ సన్నివేశం చిత్రీకరించిన నాలుగురోజులకే ప్రసాద్‌ బైక్‌ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఆ సన్నివేశంలో నేనే నటించి ఉంటే దిష్టిపోయేదేమో. కళ్లముందు వాడే మెదులుతుంటాడు. నా రెండో కూతురికి ప్రమాదంలో కాలు పోయిందనే బాధ కూడా వెంటాడుతుంటుంది’’ అని కోట బాధపడ్డారు.

‘కోట’ జీవితంలో విశిష్ట ఘట్టం

కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం 1994లో జరిగింది. దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య, ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర సమాఖ్య మధ్య ఏర్పడిన వివాదంతో యావత్‌ సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల కార్మికుల సంక్షేమం కోసం కోట శ్రీనివాస రావు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ప్రముఖులంతా మద్దతు ఇచ్చారు. దీక్ష విరమణ రోజు చిరంజీవి శిబిరానికి రాగా.. ఆయన ఇచ్చిన నిమ్మరసం తాగేందుకు కోట ఒప్పుకోలేదు. రాజేంద్రప్రసాద్‌కు చెప్పి దీక్ష మొదలుపెట్టానని, ఆయన నిమ్మరసం ఇస్తే తాగి విరమిస్తానని చెప్పారు. చివరకు హీరోలంతా వచ్చి నిమ్మరసం తాగించి కోట దీక్ష విరమింపజేశారు. ఆ ఏడాది నవంబరు 30న హైదరాబాద్‌లో మొక్కుబడిగానైనా షూటింగ్‌లు ప్రారంభమయ్యాయంటే అందుకు కోట చేపట్టిన దీక్షే కారణం.


నందులు నడిచొచ్చాయి

కోట శ్రీనివాసరావు తన నట జీవితంలో తొమ్మిది సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ప్రతిఘటన చిత్రంలోని కాశయ్య పాత్రకు తొలిసారిగా కోట స్పెషల్‌ జ్యూరీ నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత గాయం(1993), తీర్పు (1994), లిటిల్‌ సోల్జర్స్‌(1996), గణేశ్‌(1998), చిన్న (2000), ఆ నలుగురు(2004), పృథ్వీనారాయణ(2002), పెళ్లయిన కొత్తలో(2006) చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలకు నందులు వరించాయి. ఇక, 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు.


నవ్వులు పూయించే హాస్యపు ఊట.. విలనిజానికి కేరాఫ్‌.. కోట

విషం చిమ్మే విలన్‌గా.. నవ్వులు పూయించే కమెడియన్‌గా.. ప్రధాన ప్రతినాయకుడి పక్కన ఉంటూనే గోతులు తవ్వే కామెడీ విలన్‌గా.. మంచి తండ్రిగా, తాతగా.. ఇలా ఎన్నో పాత్రలు చేశారు కోట! దాదాపు నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రస్థానంలో.. 750 సినిమాల్లో నటించిన ఆయన కీర్తికిరీటంలో కలికితురాయిల్లాంటి పాత్రలు లెక్కకు మిక్కిలిగానే ఉన్నాయి. వాటిలోంచి కొన్ని మేలిముత్యాలను ఏరితే..

9.jpg

మంత్రి కాశయ్య (ప్రతిఘటన)

‘ప్రాణం ఖరీదు’ సినిమాతో 1978లోనే తెరంగేట్రం చేసినా.. చిన్నాచితకా పాత్రలతోనే నెట్టుకొస్తున్న కోట శ్రీనివాసరావును ‘ప్రతిఘటన’ సినిమా.. అందులో ‘గుడిసెల కాశయ్య’ వేషం.. ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసేశాయి! ‘నమస్తే తమ్మీ.. దావత్‌కు సిద్ధం జెయ్‌’... ‘మీ అమ్మలకి మీ అక్కలకి మీ నాన్నలకి అందరికీ పెడ్తాండా.. దండం’.. ‘గీ దేశంలో దరిద్రమనేది పోయేటంతవరకూ ఈ నెత్తి మీద బొచ్చు మొల్చేటందుకు ఈల్లేదని పద్దినాలకొక్కసారి యాదగిరి గుట్ట పోతాండ.. గుండు కొట్టించుకుంటాండ..’ అంటూ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులతో కోట తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు.


కాంట్రాక్టర్‌ వెంకటరత్నం (శత్రువు)

‘నెక్ట్స్‌ ట్రిప్పు మన్దేరా బాబూ’.. ‘సెప్పవయ్యా బాబూ’.. ‘ఫోన్‌ మోగుతోందిరా బాబూ’... ‘ఇది కల కదరా బాబూ’.. అంటూ ఒక టిపికల్‌ సాగదీతతో మాట్లాడుతూ ‘శత్రువు’ సినిమాలో కాంట్రాక్టర్‌ వెంకటరత్నం పాత్రలో కోట పండించిన విలనీ విలక్షణం. ఈ సినిమాలో కోటకున్న మరో ఊతపదం.. ‘థ్యాంక్స్‌’! అప్పట్లో అది చాలామందికి ఊతపదంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.

మినిస్టర్‌ సాంబశివుడు (గణేశ్‌)

విలనీలో కోట శ్రీనివాసరావు పతాకస్థాయి నటనను చూడాలంటే.. ‘గణేశ్‌’ సినిమా చూడాల్సిందే! హెల్త్‌ మినిస్టర్‌ సాంబశివుడుగా ఆ సినిమాలో ఆయన చేసిన నటన నభూతో. ‘‘తమ్మీ.. నేను 50 కోట్ల కుంబకోణం జేసిన. కాదంటలే. మరి నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరీ ఉంది. ఒక ముష్టోనికి కుప్పతొట్లో దొరికినానంట. గప్పటి సంది ముష్టోళ్లతో ముష్టెత్తిన. కుష్టోళ్లతో దుప్పట్లో పండిన. నా పెహలీ మర్డర్‌ ఎప్పుడు జేసినాననకున్నవ్‌? పద్నాలుగేళ్లకే.. బచ్చాగాణ్ని. అంటే చెడ్డీ మీద మర్డరన్నట్టు’’ అంటూ కోట చెప్పిన డైలాగులు ఇప్పటికీ చాలామందికి గుర్తే!

సెల్వర్‌ మణి (సర్కార్‌)

అప్పటిదాకా తెలుగువారికి మాత్రమే తెలిసిన కోట శ్రీనివాసరావు విలనీ విశ్వరూపం.. 2005లో వచ్చిన ‘సర్కార్‌’ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులకూ బాగా పరిచయమైంది. ‘సెల్వర్‌ మణి లైట్‌ మ్యాటర్స్‌ మే కామెడీ కర్తేహై.. సీరియస్‌ మ్యాటర్స్‌ మే మర్డర్‌’ అంటూ తనదైన శైలిలో నవ్వుతూ హిందీ ప్రేక్షకులను అబ్బురపరిచారు. అంతేకాదు.. ఆ సినిమాలో తన సొంత గొంతుతో హిందీలో ఏకబిగిన డైలాగులు చెప్పి సత్తా చాటారు కోట.


గురునారాయణ (గాయం)

కోట శ్రీనివాసరావు పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే పాత్రల్లో ఒకటి.. ‘గాయం’ సినిమాలో మంత్రి గురునారాయణ పాత్ర. ముఠా తగాదాలు, హత్యల గురించి ఒక జర్నలిస్టు ప్రశ్నిస్తే.. ‘గదైతే నేను ఖండిస్తన్న.. ఏం యాక్షన్‌ తీసుకుంటం? పోలీసోళ్లకు జెప్పినం.. ఏంరా నువ్వే గద డీఎస్పీతో ఫోన్ల మాట్లాడినవ్‌..’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ ఇప్పటికీ పాపులర్‌.

అక్క (రెండిళ్ల పూజారి)

‘గా పాటేందిరా.. ఆ.. చందమామ రావే జాబిల్లి రావే.. కత్తి పట్కరావే.. ఖతం జేసి పోవే’ అంటూ హిజ్రా పాత్రలో ‘రెండిళ్ల పూజారి’ సినిమాలో కోట మెత్తటి కత్తిలా కనిస్తారు! పైకి సుకుమారంగా కనిపిస్తూనే.. కళ్లల్లో మాత్రం క్రౌర్యాన్ని చూపించిన తీరు అద్భుతం.

మాచిరాజు (శివ)

ఎలాంటి కామెడీ లేకుండా.. పూర్తిస్థాయిలో సీరియస్‌ విలన్‌గా కోట నటించిన సినిమాల్లో ప్రముఖమైనది.. ‘శివ’. అందులో ‘మాచిరాజు’ పాత్రలో ఆయన కళ్లతోనే కపటత్వాన్ని పలికించిన తీరు ఔత్సాహిక నటీనటులకో పాఠంలాంటిది.

9.jpg


జంబలకిడి పంబ:

కోట శ్రీనివాసరావు కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి.. ‘జంబ లకిడి పంబ’ సినిమాలో ఆయన చేసిన హీరోయిన్‌ తండ్రి పాత్ర. అణిగిమణిగి ఉండే భార్యను, కొడుకును అదిలిస్తూ బెదిరించే పాత్రలో తొలి సగంలోనూ.. మహిళలా మారి, భర్తగా మారిన భార్యకు అణిగిమణిగి ఉండే భార్య లాంటి భర్త పాత్రలో మలిసగంలోనూ.. కోట చెలరేగిపోయారు. ‘ఒత్తిలో పత్తి.. గిలకలో చిలక’ అంటూ ఆ పాత్రకు ఈవీవీ ఒక టిపికల్‌ మేనరిజాన్ని పెట్టారు.

బంగారం.. సింగారం (వినోదం)

ద్విపాత్రాభినయం సినిమాల్లో కొత్త కాన్సెప్ట్‌ కాదుగానీ.. లేని సోదరుడి పాత్రను ఉన్నట్టుగా ‘కల’గంటూ.. ఆ పాత్రలో కూడా తనే జీవించే ఓ అమాయక/అహంభావి తండ్రి పాత్ర మాత్రం కొత్తే. ‘వినోదం’ సినిమాలో కోట ఆ పాత్రలో నటించారనడం కంటే జీవించారనడం కరెక్ట్‌. ధనవంతుడైన బంగారం పాత్రలో.. కార్మిక నాయకుడు సింగారం పాత్రలో విజృంభించారాయన.


లక్ష్మీపతి (అహ నా పెళ్లంట):

తెలుగు సినిమా చరిత్ర మొదలైనప్పటి నుంచీ వెండితెరపై ఎన్నో పిసినారి పాత్రలు ఉన్నాయిగానీ.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పీనాసి పాత్రలు మాత్రం రెండే! వాటిలో ఒకటి.. ‘అహనా పెళ్లంట’ సినిమాలో ‘లక్ష్మీపతి’ పాత్ర. రెండోది ‘ఆమె’ సినిమాలో పిసినారి శ్రీనివాసరావు పాత్ర. రెండూ కోట పండించిన నవ్వుల తోటలే!! మరీ ముఖ్యంగా ‘అహ నా పెళ్లంట’ సినిమాలో నూతన్‌ ప్రసాద్‌ పాత్ర.. ‘లక్ష్మీపతా? వాడా.. ఆ మలపత్రాష్టుడా’ అనగానే.. ‘అవున్నేనే’ అనే డైలాగ్‌తో కనిపించే కోట ఆ సినిమాని ఒంటిచేత్తో విజయతీరాలవైపు నడిపించారంటే అందులో ఇసుమంత కూడా అబద్ధం లేదు. ‘నాకేంటి.. అహ నాకేంటి’ అని డబ్బులు అడగకుండానే అడగడం.. కోడిని తాడుతో కట్టి దాన్ని చూస్తూ భోంచేస్తూ చికెన్‌ తిన్నంత తృప్తిగా ఉందనడం.. బస్టాండ్‌లో టీ అమ్ముకుంటూ బావమరిది కంటపడినప్పుడు కనుగుడ్లు పూర్తిగా పైకి ఎత్తేసి, తెల్ల గుడ్డు మాత్రమే కనిపించేలా చేసి, కుంటుకుంటూ నడుస్తూ ‘చాయ్‌ పీవోజీ.. అచ్ఛా చాయ్‌ పీవోజీ’ అంటూ కోట చేసే యాక్టింగ్‌ని వర్ణించడానికి మాటల్లేవంతే!

తాడి మట్టయ్య (హలో బ్రదర్‌)

కోట శ్రీనివాసరావు తన కెరీర్‌లో హాస్యనటుడిగా పండించిన పాత్రల్లో అందరికీ గుర్తుండిపోయేది.. ‘హలో బ్రదర్‌’ సినిమాలో ‘తాడి మట్టయ్య’ అనే పోలీసు పాత్ర. మరో ప్రముఖ హాస్యనటుడు మల్లికార్జునరావుతో కలిసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. నవ్వించడమే కాదు.. సినిమా చివర్లో మల్లికార్జునరావు పాత్ర చనిపోయినప్పుడు.. ‘రేయ్‌, చిట్టీ లేవరా.. నా మీద రివెంజ్‌ తీర్చుకోరా..’ అంటూ తన నటనతో కన్నీళ్లు పెట్టించేస్తారు కోట.


అల్లావుద్దీన్‌ (మనీ)

‘భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరూ.. భర్తగా మారకు బ్యాచిలరూ’ అంటూ.. పెళ్లొద్దని భయపెట్టే పాత్రలో కోట పండించిన హాస్యం దశాబ్దాలు గడిచిపోతున్నా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఇంకా ఫ్రెష్‌గానే ఉంది.

పోతురాజు (మామగారు)

పనీపాటా లేకుండా వీధి అరుగు మీద కూర్చుని.. పేక ముక్కలు చేతుల్లో పట్టుకుని.. వచ్చేపోయే వాళ్లందరినీ ఆపి ‘ఒక దెబ్బేసుకుందామా?’ అని అడిగే క్యారెక్టర్‌లో కోట చెలరేగిపోయారీ సినిమాలో. ‘పోతురాజు’ పాత్రలో బాబూమోహన్‌తో కలిసి ఆయన చేసిన అల్లరి కామెడీ అదుర్స్‌.

గారపాటి బుల్లబ్బాయ్‌

(సీతారత్నంగారి అబ్బాయి)

‘జల్లింది జీలకర్ర.. మొలిసింది తోటకూర.. పూసింది మల్లెపువ్వు.. ఏసింది అరటిగెల’.. ‘కొబ్బరితోటలో జీడిపిక్కలేరుతున్నాను.. వంగతోటలో పనసగింజలేరుతున్నాను’ అంటూ కామెడీ డైలాగ్స్‌తో ‘సీతారత్నంగారి అబ్బాయి’ సినిమాలో కోట శ్రీనివాసరావు చేసిన ‘గారపాటి బుల్లబ్బాయ్‌’ పాత్ర కూడా ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర.


ఈ వార్తలు కూడా చదవండి

వికసిత్‌ తెలంగాణ బీజేపీకే సాధ్యం

రాజకీయ న్యాయానికి భరోసా!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 04:08 AM