Share News

Nalgonda: సీఐ నుంచి రూ.1.10 లక్షల వసూల్‌

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:11 AM

సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌(సీఐ)ని బెదిరించి రూ.1.10 లక్షలు వసూలు చేసిన ఇద్దరు జర్నలిస్టులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు వివరాలను వెల్లడించారు.

Nalgonda: సీఐ నుంచి రూ.1.10 లక్షల వసూల్‌

  • ఇద్దరు విలేకరుల అరెస్టు

మిర్యాలగూడ అర్బన్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌(సీఐ)ని బెదిరించి రూ.1.10 లక్షలు వసూలు చేసిన ఇద్దరు జర్నలిస్టులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు వివరాలను వెల్లడించారు. మర్రిగూడ మండలం వట్టిపల్లికి చెందిన తప్పరి రఘు ఓ డిజిటల్‌ పేపర్‌లో జిల్లా రిపోర్టర్‌గా, మాడ్గులపల్లి మండలం పాములపాడుకు చెందిన పేరబోయిన ఆంజనేయులు అలియాస్‌ అంజి రెండు మండలాలకు రిపోర్టర్‌గా చలామణి అవుతున్నారు. ఆ డిజిటల్‌ పత్రిక బ్యూరో ఎడిటర్‌ ఆనంద్‌కుమార్‌ సహకారంతో వీరిద్దరూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. అధికారులను టార్గెట్‌గా చేసుకుంటూ.. నిరాధారమైన కథనాలను రాసి, బెదిరింపులకు దిగుతున్నారని డీఎస్పీ వివరించారు. ‘‘ఈ క్రమంలో మిర్యాలగూడ రూరల్‌ సీఐ వీరబాబును లక్ష్యంగా చేసుకుని, ‘వీరగాథ’ పేరుతో వరుస కథనాలను ప్రచురించి, బెదిరింపులకు దిగారు.


సీరియల్‌గా రాస్తున్న కథనాలను ఆపాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరకు రూ.1.10లక్షలు వసూలు చేశారు. అయితే.. సీఐకి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు నిరాధారాలని తేలింది. అదే సమయంలో నకిలీ జర్నలిస్టులపై వీరబాబు కూడా మిర్యాలగూడ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి రూ.1.10 లక్షలు ఇస్తుండగా రికార్డయిన సీసీకెమెరా ఫుటేజీ, కాల్‌రికార్డులను ఆధారాలుగా చూపారు. దాంతో.. రఘు, ఆంజనేయులు, ఆనంద్‌కుమార్‌పై కేసు నమోదు చేశాం’’ అని డీఎస్పీ వెల్లడించారు. రఘు, ఆంజనేయులును అరెస్టు చేయగా.. ఆనంద్‌కుమార్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. తదుపరి దర్యాప్తులో ఈ ముఠా ఓ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ నుంచి రూ.50వేల చొప్పున వసూలు చేసినట్లు తేలిందన్నారు. నిందితులపై పలు పోలీ్‌సస్టేషన్లలో ఫిర్యాదులు ఉన్నాయని, వాటిని పరిశీలించి, కేసులు నమోదు చేస్తామన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 04:11 AM