Road Accident: కొడంగల్‌లో బొలెరో, కారు ఢీ.. భార్య, భర్త వారి కుమార్తె మృతి
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:34 AM
దైవ దర్శనం చేసుకొని తిరిగొస్తుండగా కొడంగల్‌లో కారును బొలెరో ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్‌ను కారు ఢీకొని ఓ బాలుడు, మరో యువకుడు చనిపోయారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్‌ను ఢీ కొట్టిన కారు
తీవ్ర గాయాలతో ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
కొడంగల్/కొడంగల్ రూరల్/ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): దైవ దర్శనం చేసుకొని తిరిగొస్తుండగా కొడంగల్‌లో కారును బొలెరో ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్‌ను కారు ఢీకొని ఓ బాలుడు, మరో యువకుడు చనిపోయారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన రామారావు (51) ఆయన భార్య శ్రీలత (42) వారి చిన్న కుమార్తె శృతి ముగ్గురు కలిసి ఆదివారం కర్ణాటకలోని గాన్‌గాపూర్‌కు దైవ దర్శనం కోసం కారులో వెళ్లారు. దైవ దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరిగొస్తున్న క్రమంలో కొడంగల్ మండలంలోని ఐనన్‌పల్లి గేటు సమీపంలో వీరి కారును ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీలత అక్కడికక్కడే మృతి చెందగా రామారావు, శృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, స్వల్ప గాయాలతో బయట పడిన బొలెరో డ్రైవర్.. ప్రమాదం అనంతరం ఘటనా స్థలి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్- బీజాపూర్ 163వ జాతీయ రహదారిపై మలుపుల దగ్గర సూచిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ శివారులో కారు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ బాలుడు, మరో యువకుడు మృతి చెందారు. ఏపీలోని ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామానికి చెందిన తన్నీరు శివ దంపతులు హైదరాబాద్‌లో పనులు చేస్తూ జీవిస్తున్నారు. వారి చిన్న కుమారుడు మహేశ్‌బాబు ఏపీలోని పొదిలిలో సంక్షేమ వసతిగృహంలో ఉంటూ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు ముగియడంతో అతనికి పరిచయం ఉన్న సంటరుపాడు గ్రామానికి చెందిన దినసరి కూలీ కుంచెర్ల మధుతో కలిసి పది రోజుల కిందట ఎల్లారెడ్డిపేటలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై సిరిసిల్ల వైపు వెళుతున్న క్రమంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేశ్‌బాబు (16), మధు (34) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News