Shadnagar Road Accident: ‘ప్లీజ్.. మమ్మల్ని కాపాడండి’
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:48 AM
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మరణించారు. అయితే, లారీచక్రాల మధ్య ఇరుక్కుపోయిన కూతురు(బీటెక్ విద్యార్థిని) మృత్యువుతో పోరాడుతూ.

లారీ చక్రాల కింద ఇరుక్కుపోయిన బీటెక్ విద్యార్థిని ఆర్తనాదాలు
షాద్‌నగర్‌లో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ట్యాంకర్ లారీ
తండ్రీకూతుళ్ల దుర్మరణం
షాద్‌నగర్, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మరణించారు. అయితే, లారీచక్రాల మధ్య ఇరుక్కుపోయిన కూతురు(బీటెక్ విద్యార్థిని) మృత్యువుతో పోరాడుతూ.. ‘ప్లీజ్ మమ్మల్ని కాపాడండి’ అంటూ ఆర్తనాదాలు పెట్టడం అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. షాద్‌నగర్‌కు చెందిన మశ్చేందర్ (48) రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా ఆయన ఏకైక కుమార్తె మైత్రి(23) శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఎప్పట్లాగే శనివారం ఉదయం కుమార్తెను బస్టాండ్‌లో దింపేందుకు మశ్చేందర్ ద్విచక్రవాహనంపై బయలుదేరగా.. షాద్‌నగర్ కూడలిలో ఆయిల్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది.
మశ్చేందర్ అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన మైత్రి లారీ వెనుక చక్రాల మధ్య ఇరుక్కుపోయింది. కొన ఊపిరితో ఉన్న మైత్రి.. ‘మమ్మల్ని కాపాడండి.. మా కుటుం బ సభ్యులకు సమాచారం ఇవ్వండి’ అని అక్కడున్న వారిని వేడుకుంది. ఓ బుక్‌స్టాల్ యజమాని మైత్రి ఫోన్ తీసుకుని ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చే యత్నంలో ఉండగా.. మైత్రి స్నేహితురాలి నుంచి ఫోన్ వచ్చింది. బుక్‌స్టాల్ యజమాని.. ఆమెకు పరిస్థితిని వివరించగా.. ఆమె మైత్రి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు ఘటనాస్థలికి చేరే లోపే మైత్రి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, తండ్రీకూతుళ్ల మృతిపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, విచారం వ్యక్తం చేశారు.