Share News

Hyderabad: కన్నబిడ్డలపై.. తల్లి కొడవలి వేటు!

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:15 AM

జీడిమెట్ల పరిఽధిలోని గాజులరామారంలో ఈ ఘోరం జరిగింది. ఎక్కడికక్కడ రక్తధారలతో చూస్తేనే ఒళ్లు జలదరించేలా ఆ ఇల్లంతా నెత్తుటిమయమైంది.

Hyderabad: కన్నబిడ్డలపై.. తల్లి కొడవలి వేటు!

  • ఇంట్లోనే ఇద్దరు కుమారులపై దారుణంగా దాడి

  • పిల్లలు పారిపోతున్నా వెంటాడి నరికి చంపిన వైనం

  • ఆపై అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

  • ఆమెకు, పిల్లలకు అనారోగ్యం.. భర్తతో నిత్యం గొడవలు

  • సమస్యలు చెబితే ముగ్గురూ చావండి అని కసురుకున్న భర్త

  • హైదరాబాద్‌లో ఘటన.. 6 పేజీల సూసైట్‌ నోట్‌ లభ్యం

జీడిమెట్ల, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కోపంకొద్దీ పిల్లలకు ఓ లెంపకాయ వేసినా.. బెత్తంతో కొట్టినా ఏ తల్లికైనా ఆ రోజంతా మనసు చివుక్కుమంటుంది.. ‘బిడ్డను అనవసరంగా కొట్టాను కదా’ అని! మరి.. ఆ మాతృమూర్తి మనసెంత పాషాణమో! పదేళ్లలోపు వయసున్న ఇద్దరు బిడ్డలను పట్టుకొని.. వేట కొడవలితో నరికింది! తల్లి అలా ఎందుకు చేస్తోందో.. తామేం తప్పు చేశామో అర్థం కాని పిల్లలు.. గాయాలతో నెత్తురు కారుతున్న స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసినా వెంబడించి మరీ చంపేసింది. జీడిమెట్ల పరిఽధిలోని గాజులరామారంలో ఈ ఘోరం జరిగింది. ఎక్కడికక్కడ రక్తధారలతో చూస్తేనే ఒళ్లు జలదరించేలా ఆ ఇల్లంతా నెత్తుటిమయమైంది. చిన్నారులకు కొసరి కొసరి గోరుముద్దలు తినిపించే తల్లి.. వారిని ఒళ్లో కూర్చోబెట్టుకొని హోంవర్కు చేయించే తల్లి.. వారి కాలికి ముల్లు దిగితే తాను తల్లడిల్లిపోయి కన్నీరు పెట్టుకునే తల్లి ఎందుకంత రాక్షసంగా ప్రవర్తించింది? ఆమెకు, పెద్ద కుమారుడికి అనారోగ్య సమస్యలు ఉండటం.. చిన్నకుమారుడి ఆరోగ్యం కూడా దెబ్బతింటుండటం.. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు.. అన్నింటికి మించి తీవ్ర మానసిక సమస్యలతోనే ఆ తల్లి ఇంతటి దారుణానికి తెగబడింది! పిల్లలను చంపి.. తాను చావాలని ముందే అనుకుందేమో.. పిల్లలపై దాడి చేసి.. వారు నెత్తుటిమడుగులో కొట్టుకుంటుండగానే, ఆమె తాముంటున్న అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.


సూసైడ్‌ నోట్‌లోని వివరాలు.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి హైస్కూల్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన గండ్ర వెంకటేశ్వర్‌ రెడ్డి, తేజస్విని రెడ్డి (35) భార్యాభర్తలు. వీరికి ఆశిష్‌ రెడ్డి(8), హర్షిత్‌ రెడ్డి(6) సంతానం. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక తేజస్వినిని, వెంకటేశ్వర్‌ రెండో వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ఈ దంపతులు హైదరాబాద్‌కొచ్చారు. గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్‌లో ఉన్న సహస్ర మహేశ్‌ హైట్స్‌ అపార్టుమెంట్‌లో రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్వర్‌ బొంతపల్లి గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌లో క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య తేజస్విని ఇంటివద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటటోంది. ఆశిష్‌, హర్షిత్‌ గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లోని న్యూ ఎరా ది లీడ్‌స్కూల్‌లో రెండో తరగతి, ఒకటో తరగతి చదువుతున్నారు. తేజస్విని కొన్నాళ్లుగా కంటి సమస్యతో బాధపడుతోంది. పెద్ద కుమారుడు ఆశిష్‌ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఏంతిన్నా వాంతులు చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడైన హర్షిత్‌కు కూడా అప్పుడప్పుడు ఇదే సమస్య వస్తోంది. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పెద్ద కుమారిడికి ఆమె చికిత్స చేయిస్తోంది. పిల్లల స్వస్థత కోసం గూగుల్‌లోనూ వెతుకుతూ మందులు వాడుతోంది.


తనతోపాటు పిల్లలు కూడా తరచూ అనారోగ్యానికి గురవుతుండటాన్ని జీర్ణించుకోలేక ఆమె ఉన్మాదిగా మారింది. గురువారం సాయంత్రం నాలుగింటికి 6పేజీల సూసైడ్‌ నోట్‌ రాసింది. ఇంట్లోనే ఆడుకుంటున్న ఆశిష్‌, హర్షిత్‌ను పట్టుకొని.. అప్పటికే బయట నుంచి తెచ్చుకున్న వేటకొడవలితో మెడ, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఇద్దరు పిల్లలూ గాయాలతో నెత్తురోడుతున్న స్థితిలోనూ ప్రాణభయంతో వంటింట్లోకి.. పడక గదిలోకి పరుగులు తీసినా వెంబడించి పట్టుకొని వేటు మీద వేటు వేసింది. ఈ ఘటనలో ఆశిష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హర్షిత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ లోపే.. తేజస్విని, అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తు నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్రగాయాలుకావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కాగా ఇంట్లోంచి తేజస్విని సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు, తాను అనారోగ్యంతో బాధపడుతున్నా.. భర్త కనీసం పట్టించుకోవడం లేదని, తమ సమస్యలు చెబితే ముగ్గురు చచ్చిపోండని కోప్పడటంతోనే తాము చచ్చిపోతున్నామని నోట్‌లో తేజస్విని రాసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, 7 నెలల క్రితం ఇదే పక్క అపార్టుమెంట్‌లో ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను స్థానికులు గుర్తు చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న

Faheem Fake Letter Controversy: సీఎంకు చెడ్డ పేరు వచ్చేలా చేయను.. చేయబోను

Updated Date - Apr 18 , 2025 | 04:15 AM