Nirmal: విహారయాత్ర విషాదాంతం
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:05 AM
నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది తీరంలో ఆదివారం ఘోరం జరిగింది. గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతై హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు అన్నదమ్ములు సహా ఐదుగు రు యువకులు చనిపోయారు.

బాసర వద్ద గోదావరిలో మునిగి ఐదుగురు యువకుల మృతి
అంతా హైదరాబాద్ వాసులు, బంధువులు
వారిలో ముగ్గురు సొంత అన్నదమ్ములు
బాసర, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చాదర్‌ఘాట్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది తీరంలో ఆదివారం ఘోరం జరిగింది. గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతై హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు అన్నదమ్ములు సహా ఐదుగు రు యువకులు చనిపోయారు. మృతులంతా బంధువులు కాగా.. తల్లిదండ్రులు, సన్నిహితులు చూస్తుండగానే వారంతా ప్రాణాలు కోల్పోయారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్, చింతల్‌లోని చంద్రానగర్‌కు చెందిన ప్రేమ్‌రామ్ రాథోడ్, సోనీ దంపతులు, వారి పిల్లలు రాకేష్ (20), మదన్ (18), భరత్ (16), దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసముండే వారి బంధువులు కలిసి మొత్తం 15మంది ఆదివారం బాసరకు రైలులో వచ్చారు. అమ్మవారిని దర్శించుకునే ముందు వీరం తా గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. అయితే, నదిలో నీటి నిల్వలు తగ్గి అక్కడక్కడ ఇసుక మేటలు తేలాయి. దీంతో రాకేశ్, మదన్, భరత్, రుత్విక్ (22), వినోద్ (19) నాటు పడవలపై నది మధ్యలో ఇసుక మేటలు వేసిన ప్రాంతానికి వెళ్లి స్నానం చేస్తూ గల్లంతయ్యారు. వీరు నీళ్లలో దిగిన చోట లోతును గ్రహించలేక మునిగిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వారిని ఒడ్డుకు చేర్చినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను బైంసా ఆస్పత్రికి తరలించారు.
చదువుల్లో మేటి
రాజస్థాన్‌కు చెందిన ప్రేమ్ కుమార్ రాథోడ్ కుటుంబంతో సహా 15ఏళ్ల క్రితం హైదరాబాద్ వలస వచ్చి చింతల్, చంద్రానగర్‌లో కిరాణా హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండే ప్రేమ్‌రామ్ రాథోడ్ ముగ్గురు కుమారులు చదువులోనూ రాణిస్తున్నారు. పెద్ద కొడుకు రాకేష్ ఆదివారం విడుదలైన నీట్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించాడని స్థానికులు తెలిపారు. రెండో కుమారుడు మదన్ ప్రస్తుతం ఇంటర్ చదువుతుండగా.. మదన్ మెరుగైన విద్యార్థి అని అధ్యాపకులు చెబుతున్నారు. ఇక, ప్రేమ్‌రామ్ చిన్న కొడుకు భరత్.. పదో తరగతిలో 591 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడని, ఇటీవల ఓ కార్యక్రమం లో సినీ నటుడు బాలకృష్ణ కూడా భరత్‌ను మెచ్చుకున్నారని స్థానికులు వెల్లడించారు. కాగా, అన్నదమ్ము లు ముగ్గురూ మరణించడంతో ప్రేమ్‌రామ్ కుటుం బం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కాగా, ముసారాంబాగ్ శాలివాహననగర్‌లో ఉండే రుత్విక్... తన అన్న ప్రవీణ్‌తో కలిసి స్థానికంగా కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. అన్న, తల్లి, ఇద్దరు చెల్లెల్లు చూస్తుండగానే రుత్విక్ నీటి మునిగి కన్నుమూశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
నీట్ యూజీ టాపర్లకు అభినందనలు తెలిపిన సీఎం
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..
For Telangana News And Telugu News