Tragic Incident: నాలుగు నెలల కవలల మృతి
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:21 AM
ఆ శిశువులు కవలలు.. వయసు నాలుగు నెలలే! బిడ్డలకు ఆ తల్లి పొద్దున, రెండు గంటల తేడాతో రెండుసార్లు పౌడరు పాలు తాగించి పడుకోబెట్టింది. కొద్దిసేపటికి శిశువుల ముక్కుల్లోంచి పాలు రావడం.. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు బిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

నిద్రపుచ్చాక ముక్కులోంచి పాలు.. పరిస్థితి విషమం
ఆస్పత్రికెళ్లేలోపే మృతి.. భూపాలపల్లిలో విషాదం
పాల పౌడరే కారణమన్న కుటుంబ సభ్యులు
గణపురం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆ శిశువులు కవలలు.. వయసు నాలుగు నెలలే! బిడ్డలకు ఆ తల్లి పొద్దున, రెండు గంటల తేడాతో రెండుసార్లు పౌడరు పాలు తాగించి పడుకోబెట్టింది. కొద్దిసేపటికి శిశువుల ముక్కుల్లోంచి పాలు రావడం.. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు బిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ కవలలు మృతిచెందారు. భూపాలపల్లి జిల్లాలో ఈ విషాదం జరిగింది. శిశువుల మృతికి పౌడరు పాలే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గణపురం మండలం గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్-లాస్యశ్రీ దంపతులకు రెండో సంతానంగా కవలలు (పాప, బాబు) జన్మించారు. కాన్పు తర్వాత లాస్యశ్రీ అదే మండలంలోని తన పుట్టిల్లయిన నగరపల్లిలో ఉంటోంది. రెండు నెలలుగా కవలలకు పాలు పట్టేందుకు లాస్యశ్రీ ఒకే కంపెనీకి చెందిన పాల పౌడరు ప్యాకెట్లు వాడుతోంది. శుక్రవారం సాయంత్రం అదే కంపెనీకి చెందిన కొత్త పౌడర్ ప్యాకెట్‌ను కొని తెప్పించిన లాస్య.. శనివారం ఉద యం 8 గంటలకు ఒకసారి, రెండు గంటల తర్వాత మరోసారి శిశువులకు ఆ పౌడర్‌తో పాలు కలిపి తాగించి పడుకోబెట్టింది.
మధ్యాహ్నం ఒంటిగంటకు నిద్రిస్తున్న కవలలను చూడగా ముక్కుల్లోంచి పాలు రావడాన్ని తల్లి గమనించింది. ఆ బిడ్డలను వెంటనే స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు.. అక్కడి నుంచి భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు ఆ చిన్నారులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. కవలలకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని.. పౌడర్ పాలు వికటించడంతోనే మృతిచెందారని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ పాల ప్యాకెట్ గత ఏడాది సెప్టెంబరులో తయారైందని.. ఈ ఏడాది డిసెంబరు వరకూ ఉపయోగించవచ్చునని దానిపై ఉంది. ఈ ఘటనపై భూపాలపల్లి ఆస్పత్రిలోని వైద్యులను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. శిశువులకు పాలు, ఇతర ద్రావణాలను తాగించే క్రమంలో వారికి త్రేన్పులు వచ్చేదాకా వీపు నిమరాలని.. అలా కాకుండా తాగించగానే పడుకోబెడితే.. కొన్ని సందర్భాల్లో ద్రావణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి, ముక్కుద్వారా బయటకు వస్తాయని.. అప్పుడు ఊపిరాడక శిశువులు మృతిచెందే అవకాశాలుంటాయని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే శిశువుల మృతికి కారణాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.