Share News

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురి మృతి

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:20 AM

అమెరికాలో సాఫీగా సాగుతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఐదుగురు కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణిస్తున్న కారును ఓ కంటెయినర్‌ ఢీకొనడంతో.. అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురి మృతి

  • భార్య, ఇద్దరు కొడుకులు, తల్లితో కలిసి కారులో వెళ్తున్న టెకీ.. దారిలో ప్రమాదం

  • భార్య, కొడుకు, తల్లి అక్కడికక్కడే మృతి

  • స్పల్ప గాయాలతో బయటపడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రోహిత్‌ రెడ్డి, మరో కుమారుడు

  • వారి స్వగ్రామం టేకులపల్లిలో విషాదం

షాద్‌నగర్‌, చౌదరిగూడ 17 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో సాఫీగా సాగుతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఐదుగురు కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణిస్తున్న కారును ఓ కంటెయినర్‌ ఢీకొనడంతో.. అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు (భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3.35 గంటలకు) అమెరికాలోని ఫ్లొరిడాలో ఈ ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లా బక్రి చెప్యాలకు చెందిన రోహిత్‌రెడ్డి (38) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ఆయన భార్య ప్రగతిరెడ్డి (36) అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు. రోహిత్‌రెడ్డి తల్లి సునీత (56) కూడా వారితోనే ఉంటోంది. ఆదివారం సెలవు దినం కావడంతో రోహిత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో పిక్నిక్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో రాంగ్‌రూట్‌లో వస్తున్న ఓ భారీ కంటెయినర్‌ వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. దీంతో వెనుక సీట్లో కూర్చున రోహిత్‌రెడ్డి తల్లి సునీత, భార్య, పెద్ద కుమారుడు అర్విన్‌(6) అక్కడిక్కడే మృతి చెందారు.


ముందు సీట్లో కూర్చుని కారు డ్రైవింగ్‌ చేస్తున్న రోహిత్‌రెడ్డి, ఆయన చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోహిత్‌రెడ్డి 12 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి కూతురు ప్రగతిరెడ్డిని వివాహం చేసుకున్నారు. అనంతరం వారు అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవలే ప్రగతిరెడ్డి తల్లిదండ్రులు అమెరికా వెళ్లి వచ్చారు. ఈ సమయంలోనే ఒకేసారి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో ఆ కుటుంబం దు:ఖసాగరంలో మునిగిపోయింది. టేకులపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అదేరోజు తన కూతురు ఫోన్‌చేసి మాట్లాడుతూ పిక్నిక్‌కు వెళ్లామని, మరో అరగంటలో ఇంటికి చేరుకుంటామని చెప్పిందని, కానీ ఇలా తిరిగిరాని లోకానికి వెళ్తారని అనుకోలేదంటూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ వేసవిలో తన కూతురు, అల్లుడు, మనుమళ్లు అందరూ సొంతూరికి వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే.. ఇంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చిందని రోధించారు. ప్రగతిరెడ్డి తల్లితండ్రులు మంగళవారం సాయంత్రం అమెరికాకు బయలుదేరుతారు. ఫ్లోరిడాలోనే మృతులకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Updated Date - Mar 18 , 2025 | 05:20 AM