Share News

Kodangal Temple: టీటీడీకి అనుసంధానంగా రూ.100 కోట్లతో కొడంగల్‌ ఆలయ అభివృద్ధి

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:46 AM

టీటీడీకి అనుసంధానంగా ఆగమ శాస్త్రం ప్రకారం కొడంగల్‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ అన్నారు.

Kodangal Temple: టీటీడీకి అనుసంధానంగా రూ.100 కోట్లతో కొడంగల్‌ ఆలయ అభివృద్ధి

  • దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌

కొడంగల్‌/హైదరాబాద్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): టీటీడీకి అనుసంధానంగా ఆగమ శాస్త్రం ప్రకారం కొడంగల్‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ అన్నారు. ఆమె శనివారం వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌లో పర్యటించారు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ వెంకట్రావ్‌, ధార్మిక సలహాదారులు గోవిందు, హరితో కలిసి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన ఆమెకు ధర్మకర్తలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం టీటీడీ తరహాలో ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపా రు. ఆలయ అభివృద్ధిలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి ప్రభుత్వం.. ఇంటి స్థలంతోపాటు పరిహారం చెల్లిస్తుందన్నారు. అంతకు ముందు కడా కార్యాలయంలో ఆలయ పనులపై ప్రజంటేషన్‌ను పరిశీలించారు.


అనుమతి లేకుండా లోకకల్యాణాలు, బ్రహ్మోత్సవాలు వద్దు

దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న వేదపండితులు, అర్చకులు ముందస్తు అనుమతి లేకుం డా లోకకల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, ప్రవచనాలు నిర్వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కొందరు వేదపండితులు, అర్చకులు అనుమతులు లేకుండా రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో కమిషనర్‌ దృష్టి సారించాలని, స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ సర్క్యులర్‌ జారీ చేయాలన్నారు.


అర్చక, ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా

దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తూ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా వేతనాలు పొందుతున్న అర్చక, ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. శనివారం బ్యాంకర్లతో దేవాదాయ శాఖ డైరెక్టర్‌ వెంకట్రావు నేతృత్వంలో అధికారుల బృందం సమీక్ష నిర్వహించింది. ఏడీసీలు కృష్ణవేణి, శ్రీనివాస రావు, అర్చక, ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ గంగు ఉపేంద్ర శర్మ, అర్చక వెల్ఫేర్‌ ట్రస్ట్‌బోర్డు సభ్యుడు కాండురి కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. కేవలం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వేతనాలు పొందుతున్నవారే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు సైతం ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. బ్యాంకర్ల నుంచి నివేదికలు స్వీకరించిన ఉన్నతాధికారులు.. ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 05:46 AM