Corruption: ఆ ముగ్గురి అక్రమాస్తులు రూ.1000 కోట్ల పైనే!
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:04 AM
ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)లు, ఒక ఈఈ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఈ ముగ్గురూ అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై రంగంలోకి ఈడీ
మురళీధర్‌రావు, హరిరామ్ నాయక్, శ్రీధర్ కేసుల
వివరాలను ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ
మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు!
శ్రీధర్ కుమారుడి ‘థాయ్‌లాండ్ పెళ్లి’, మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీలపై నజర్
మురళీధర్‌కు 2 వారాల రిమాండ్.. జైలుకు తరలింపు
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)లు, ఒక ఈఈ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఈ ముగ్గురూ అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులను సమకూర్చుకున్న ఈ ఇంజనీర్ల బాగోతంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విశ్రాంత ఈఎన్‌సీ మురళీధర్‌రావు, కాళేశ్వరం ఈఎన్‌సీగా పనిచేసిన హరిరామ్ నాయక్, ఈఈ నూనె శ్రీధర్ ఆస్తుల మార్కెట్ విలువ రూ.1000 కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై నమోదైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లు, రిమాండ్ రిపోర్టులు, కస్టడీ విచారణ నివేదికలు ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాసినట్లు సమాచారం. నూనె శ్రీధర్ కుమారుడి వివాహం థాయ్‌లాండ్‌లో జరిగిన నేపథ్యంలో ఆ ఖర్చులపై ఈడీ దృష్టి సారించింది. మురళీధర్‌రావు కుమారుడు అభిషేక్‌రావు కొన్ని కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టులపైనా ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఏసీబీ విచారణలో ఈ ముగ్గురు ఇంజనీర్లకు లగ్జరీ విల్లాలు, ఫ్లాట్లు, ఎకరాల కొద్దీ భూమి, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు తేలింది. మురళీధర్‌రావుకు మోకిలలో ఉన్న 6500 గజాల స్థలం విలువే రూ.65-70 కోట్లు ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంటున్నారు.
ఏసీబీ సోదాల్లో గుర్తించిన ఆస్తుల వివరాలు.. హరిరామ్ నాయక్
కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీగా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. షేక్‌పేట, కొండాపూర్‌లో రెండు లగ్జరీ విల్లాలు, నార్సింగ్, మాదాపూర్, శ్రీనగర్‌లో ప్రముఖులు ఉండే అపార్ట్‌మెంట్లలో మూడు ఫ్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు, బొమ్మల రామారాంలో ఆరెకరాల ఫాంహౌస్ (మామిడితోట), కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో రెండు ఇళ్ల స్థలాలు, ఒక బీఎండబ్ల్యూ కారు, బ్యాంకు లాకర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారు ఆభరణాలను గుర్తించారు.
నూనె శ్రీధర్..
సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేశారు. ఈ ఏడాది జూన్ 11నఏసీబీ అధికారులు శ్రీధర్‌ను అరెస్టు చేశారు. 13 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో 4 అంతస్తుల విలాసవంతమైన భవనం, షేక్‌పేటలోని ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్, తెల్లాపూర్‌లో లగ్జరీ విల్లా, వరంగల్‌లో జీ+3 భవనం, కరీంనగర్‌లో మూడు ఫ్లాట్లు, ఒక ఇండిపెండెంట్ ఇల్లు, అమీర్‌పేటలోని వాణిజ్య సముదాయంలో ఆస్తులు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 19 ఇళ్ల స్థలాలు, కరీంనగర్‌లో హోటల్‌ను గుర్తించారు. లాకర్లలో ఉన్న రూ.5 కోట్ల విలువైన ఆభరణాలు, మరికొన్ని ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్ తన కుమారుడి వివాహాన్ని థాయ్‌లాండ్‌లో నిర్వహించారు.
మురళీధర్‌రావు..
సాగునీటి శాఖ విశ్రాంత ఈఎన్‌సీ మురళీధర్‌రావును మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 11 చోట్ల సోదాలు నిర్వహించారు. మురళీధర్‌రావుకు కొండాపూర్‌లో ఒక విల్లా, బంజారాహిల్స్, యూసు్‌ఫగూడ, కోకాపేట, బేగంపేటలో నాలుగు ఫ్లాట్లు, కరీంనగర్‌లో ఒక వాణిజ్య సముదాయం, హైదరాబాద్‌లో మరో వాణిజ్య సముదాయం, కోదాడలో ఒక అపార్ట్‌మెంట్, జహీరాబాద్‌లో 2కేవీ సౌర విద్యుత్కేంద్రం, వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్, 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో నాలుగు ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6,500 గజాల ప్లాటు, మెర్సిడెజ్ బెంజ్ సహా మూడు కార్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని చెప్పారు. మురళీధర్‌రావు కుమారుడు అభిషేక్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టులు చేసినట్లు గుర్తించారు.
14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి న్యాయమూర్తి నివాసంలో హజరుపరచగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వీరవల్లి కనకరత్నం ఏసీబీకి చిక్కారు. డీఈ బదిలీ కోసం రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సొంత శాఖలోని డీఈ తాండూరు నుంచి వికారాబాద్‌కు బదిలీ చేయాలని కోరగా.. అందుకు రూ.50 వేలు లంచం ఇవ్వాలని కనకరత్నం డిమాండ్ చేశారు. దీంతో ఆ డీఈ ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం.. డీఈ కనకరత్నానికి రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేపీహెచ్‌బీ కాలనీలోని కనకరత్నం ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే కనకరత్నం పదవీ విరమణ పొందారు. అయితే, ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి