Share News

TPCC Chief Mahesh Kumar Goud : బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నా

ABN , Publish Date - Feb 02 , 2025 | 07:55 PM

TPCC Chief Mahesh Kumar Goud : తెలుంగింటి కోడ‌లు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే కేటాయించినట్లుగా ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలపై బీజేపీ చూపిస్తున్న వివక్ష, రాజకీయ కక్షకు ఈ బ‌డ్జెట్ కేటాయింపులే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

TPCC Chief Mahesh Kumar Goud : బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నా
TPCC Chief Mahesh Kumar Goud

హైదరాబాద్, ఫిబ్రవరి 02: సాధారణ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపినందుకు నిరసనగా డాక్టర్ బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సాధారణ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగా ఆదివారం ట్యాంక్ బండపై ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో నిరసన చేపట్టారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక బీఆర్ అంబేద్కర్ విగ్రహల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కేడర్‌‌కు ఆయన పిలుపు నిచ్చారు.

తెలంగాణ సంక్షేమం, అభివృద్ది, రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా అందరు కలిసి రావాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇచ్చే వరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డికి రాష్ట్రాభివృద్ధి పట్టదా? అంటూ వారిని పీసీసీ చీఫ్ నిలదీశారు. తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్, మంత్రులు ఒంటరి పోరాటం చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


తెలుంగింటి కోడ‌లు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే కేటాయించినట్లుగా ఉందన్నారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలపై బీజేపీ చూపిస్తున్న వివక్ష, రాజకీయ కక్షకు ఈ బ‌డ్జెట్ కేటాయింపులే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు ఉన్నారని.. అయినా తెలంగాణకు కేంద్రం గాడిదగుడ్డు ఇచ్చిందంటూ మండిపడ్డారు.

Also Read: వసంత పంచమి.. ఇలా చేయండి చాలు


‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’’ అంటూ తెలుగు గేయం వినిపించి తెలుగు వారి ఆకాంక్షలకు, తెలుగు నేల అభివృద్ధికి మొండిచేయి చూపించారని వ్యంగ్యంగా అన్నారు. ఈ బడ్జెట్ కేటాయింపులు ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోస‌మే అన్నట్లుగా ఉందన్నారు. రాజకీయ అవసరాల కోసం బీజేపీ కేంద్ర బడ్జెట్‌ను ఉపయోగించుకుంటూ రాష్ట్రాలను విడదీస్తూ.. జాతి సమగ్రతను పక్కన పెట్టిందని ఈ సందర్భంగా కేంద్రంపై ఆయన నిప్పులు చెరిగారు. బ‌డ్జెట్‌లో దేశ సమ్మిళిత వృద్ధిని కొంచెం కూడా పట్టించుకోలేదంటూ కేంద్ర వైఖరిని తప్పు పట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల బీజేపీ సవితి ప్రేమను తెలియజేస్తుందన్నారు.


అయినా కొన్ని రాష్ట్రాల‌కే బ‌డ్జెట్ కేటాయింపుల‌తో విక‌సిత్ భార‌త్ ఎలా సాధ్యమవుతోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. దేశ జీడీపీలో 5.1 శాతం వాటా ఉన్న తెలంగాణకు కేవలం 2.10 శాతమే మాత్రమే తిరిగి వ‌స్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో సుమారు రూ. లక్ష వేల కోట్లు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కనీసం రూ. 40 వేల కోట్లు కూడా తిరిగి ఇవ్వక పోవడం బాధాక‌రమన్నారు. బ‌డ్జెట్‌లో విభ‌జ‌న‌ చట్టం హామీలు, మెట్రో రెండో దశకు నిధుల కేటాయింపుతో పాటు ఇతర రంగాలకు కేటాయింపులు శూన్యమని గుర్తు చేశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని గొప్పలకు పోయే బీజేపీకి దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలు, వారి సమస్యలు కనపడక పోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Also Read: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం


2025-26 బ‌డ్జెట్ కేటాయింపులు చూసి తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరన్నారు. తెలంగాణ అభ్యున్నతి కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా ప్రతీ తెలంగాణ పౌరుడు ఏక‌తాటిపైకి రావాలిసిన అవ‌స‌రం ఉందని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ నొక్కి చెప్పారు. కేంద్రం క‌క్ష పూరిత‌ వైఖ‌రికి నిర‌స‌న‌గా బీఆర్ఎస్‌తోపాటు తెలంగాణ‌వాదులు ముందుకు రావాలంటూ పిలుపు నిచ్చారు. మాటిమాటికి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేత‌లు.. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనను విమర్శిస్తారని.. మరి ప్రస్తుత బ‌డ్జెట్ కేటాయింపుల‌పై వారు ఏం స‌మాధానం చెబుతారంటూ ఈ సందర్భంగా వారిని నిలదీశారు.

Also Read: బాలీవుడ్ నటులపై కేసు


రాష్ట్ర నిధుల కోసం సీఎం రేవంత్, మంత్రులు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసి యాచించిన తెలంగాణ‌కు మాత్రం ఒరిగిందేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా గ‌ల్లీ నుంచి పట్టణం వరకు జ‌రిగే నిర‌స‌న కార్యక్రమాల్లో.. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు ఇచ్చారు.

Also Read: మావోయిస్టుల కుట్ర.. భగ్నం చేసిన భద్రతా దళాలు


అక్షింతలకు ఓటెద్దామా? అభివృద్ధికి ఓటెద్దామా?

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీజేపీ వ్యవహారశైలిపై మంత్రి సీతక్క మండిపడ్డారు. తెలంగాణ అంటే బీజేపీకి పిచ్చి విద్వేషమని విమర్శించారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా.. వారు బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. అక్షింతలకు ఓటేస్తే తెచ్చింది గుండు సున్నా అని పేర్కొన్నారు.

అక్షింతలు కాదు అభివృద్ధికి నిధులు ఇవ్వండంటూ కేంద్రాన్ని కోరారు. అయినా తెలంగాణపై ఇంత దారుణమైన వివక్షత ఎందుకు? అంటూ కేంద్రాన్ని ఈ సందర్భంగా ఆమె సూటిగా ప్రశ్నించారు. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదంటూ కేంద్రాన్ని నిలదీశారు. అక్షింతలకు ఓటెద్దామా? అభివృద్ధికి ఓటెద్దామా? అంటూ పార్టీ కేడర్‌ను ఆమె ప్రశ్నించారు. తెలంగాణకి ప్రత్యేక బడ్జెట్ ప్రకటించాలంటూ కేంద్రాన్ని సీతక్క డిమాండ్ చేశారు.


చరిత్రహీనులుగా మిగలకండి..

ఇదే నిరసన దీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలు కలిపితేనే కేంద్రమవుతోందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రానికి ఎందుకు ఇంత వివక్షా అంటూ సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ నిధుల కోసం బీజేపీ ఎంపీలు గొంతేత్తాలని ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేశారు.

చరిత్రహీనులుగా మిగలకండంటూ బీజేపీ ఎంపీలకు ఆయన హితవు పలికారు. ప్రభుత్వం తరఫున నిధులు కావాలని కాలుకు బలపం కట్టుకొని తిరిగినా ఎందుకు ఇవ్వట్లేదని కేంద్రాన్ని ఆయన బల్లగుద్ది మరి ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు పార్టీ అగ్రనేతలు సూచించారు.

For Telangana News And Telugu News

Updated Date - Feb 02 , 2025 | 07:55 PM