Share News

US Jail: అమెరికా జైలులో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:23 AM

అమెరికాలోని జైలులో తెలంగాణ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, అశ్లీల వీడియోల కేసులో 35 ఏళ్ల జైలుశిక్షపడిన ఆయన ఆందోళనతో జైలులోనే ఉరివేసుకున్నారు.

US Jail: అమెరికా జైలులో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

  • స్నాప్‌చాట్‌లో 15 ఏళ్ల బాలుడిలా నమ్మిస్తూ అమెరికా బాలికలతో చాటింగ్‌

  • నగ్న వీడియోలు తీసి పంపేలా ఒత్తిడి, బెదిరింపులు

  • ఏప్రిల్‌లో 35ఏళ్లు జైలుశిక్ష వేసిన అమెరికా కోర్టు

  • గత నెల 26న ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి

లింగాలఘణపురం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని జైలులో తెలంగాణ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, అశ్లీల వీడియోల కేసులో 35 ఏళ్ల జైలుశిక్షపడిన ఆయన ఆందోళనతో జైలులోనే ఉరివేసుకున్నారు. మృతదేహాన్ని అప్పగించేందుకు అమెరికా అధికారులు నిరాకరించడంతో.. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్‌ (31) పదేళ్లుగా అమెరికాలోని ఒక్లహామాలోని ఎడ్మండ్‌ లో ఉంటున్నారు. రెండేళ్ల క్రితం అక్కడే ఉద్యోగం చేస్తున్న బంధువుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సోషల్‌ మీడియా మెసేజింగ్‌ యాప్‌ ‘స్నాప్‌చాట్‌‘ ద్వారా బాలికలతో పరిచయం పెంచుకుని, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడారని, ఆ బాలికల అశ్లీల వీడియోల (చైల్డ్‌ పోర్నోగ్రఫీ)ను ఇతరులకు పంపారని ఆయనపై కేసునమోదైంది.


స్నాప్‌చాట్‌లో ఆ వీడియోలు షేర్‌ అవుతున్న ఖాతా ఐపీ (ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) అడ్రస్‌ ఆధారంగా అమెరికా దర్యాప్తు అధికారులు సాయికుమార్‌ ను అరెస్టు చేశారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో.. స్నాప్‌చాట్‌లో తాను 13-15 ఏళ్ల బాలుడని నమ్మిస్తూ 18 మంది అమెరికా బాలికలతో చాటించ్‌ చేసి, మభ్యపెట్టి.. వారి నుంచి నగ్న, అశ్లీల వీడియోలు సేకరించారని గుర్తించారు. నిరాకరించిన బాలికలను, వారి కుటుంబసభ్యులను చంపేస్తామని, అశ్లీల ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడని తేల్చారు. ఈ మేరకు కోర్టులో చార్జిషీట్‌ వేశారు. విచారణలో ముగ్గురు బాలికలతో నేరపూరితంగా ప్రవర్తించినట్టుగా సాయికుమార్‌ అంగీకరించి, తనకు తక్కువ శిక్ష వేయాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు.


sucide.jpg

బాలలపై నేరాలకు తీవ్రమైన శిక్షలు

బాలికలపై వేధింపులు, చైల్డ్‌ పోర్నోగ్రఫీని అత్యంత తీవ్రమైన నేరం గా పరిగణిస్తూ.. న్యాయమూర్తి చార్లెస్‌ గుడ్విన్‌ సాయికుమార్‌కు 35 ఏళ్ల (420 నెలలు) జైలుశిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చి 27న తీర్పు ఇచ్చారు. దీంతో మానసిక వేదనకు గురైన సాయికుమార్‌.. గత నెల 26న జైలులో ఉరివేసుకున్నారు. సాయికుమార్‌ వ్యక్తిగతంగా చాలా మంచివాడేనని, అమెరికాలో ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నామని నెల్లుట్ల గ్రామస్తులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 07:42 AM